గడప గడప వెనుక గూడుపుఠాణీ ?

నాన్నకు పెళ్లవుతుందనే సంబరమే కానీ, సవతి తల్లి వస్తుందన్న ఐడియా లేకపోయిందట. అలాగ్గా వుంది మన జనాల పరిస్థితి. రాజకీయ నాయకులు చాలా స్మూత్ గా తమ చుట్టూ తాళ్లు బిగిస్తున్నారన్న సంగతిని జనం గమనించడం లేదు. గమనించేసరికి అష్ట దిగ్బంధనంలో వుంటున్నారు. రాజకీయ నాయకులకు అధికారం అండగా వుంటుంది కాబట్టి కోట్లకు కోట్లు నల్ల డబ్బు వున్నా, వేలాది ఎకరాలు వున్నా వాళ్లకు తప్పించుకునే మార్గాలు అనేకం వుంటాయి. 

కానీ సామాన్య జనానికి అలా కాదు కదా..సంపాదించిన ప్రతి పైసాకు ప్రభుత్వానికి రకరకాల పన్నుల కట్టాల్సిందే. పాన్, ఆధార్, ఇంకా అనేక మార్గాల ద్వారా వాళ్ల సమాచారం అంతా ప్రభుత్వ కంప్యూటర్లకు చేరుతూనే వుంటుంది. అయితే ఇదంతా ఎక్కువగా ఉద్యోగాలు చేసేవారి విషయంలోనే సాధ్యమవుతోంది.

అందుకే మోడీ వస్తూనే ప్రజలకు బ్యాంకింగ్ ను అలవాటు చేయాలనుకున్నారు.  విపరీతమైన ప్రచారం చేసి, బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించారు. మెల్లగా గ్యాస్ సబ్సిడీని బ్యాంకు ఖాతాలకు చేర్చారు. ఇకపై టాక్స్ ల విషయంలో కఠినంగా వుండే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.

ఎప్పుడైతే మోడీ ఇలా వెళ్తున్నారో, ఆయన అడుగుజాడలో నడిచే చంద్రబాబు కూడా ఇప్పుడు గడపగడపకీ సర్వే అంటున్నారు. కష్టంలో కూడా భవిష్యత్ ను దర్శించగల విజనరీ చంద్రబాబు. కాపు రిజర్వేషన్ గడబిడ, మంజునాధ కమిటీ వచ్చేసరికి, బాబుకో మహత్తరమైన అయిడియా వచ్చింది. ఫలితంగా పుట్టిన అయిడియానే గడప గడపకూ సర్వే.

సాధారణంగా ప్రభుత్వ సర్వే అంటే తూతూ మంత్రంగా వుంటుంది. ఎందుకంటే ప్రభుత్వ అధికారులకో, మాస్టర్లకో ఇది అదనపు బాధ్యతగా అంటగడతారు. దాంతో వాళ్లు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం..పైగా జనం కూడా అన్నీ నిజాలు చెప్పరు. వాళ్ల చేత అన్ని వివరాలు చెప్పించి, తీరిగ్గా నమోదు చేయాలంటే, రోజుకు పది ఇళ్లు కూడా పూర్తి కావు. అందువల్ల ప్రభుత్వ సర్వేలు కాస్త డవుటుగానే వుంటాయి. 

కానీ ఈసారి చంద్రబాబు కాస్త సీరియస్ గా వున్నారు. ప్రజల స్థితిగతులు పూర్తిగా తెలుసుకునే పనిలోపడ్డారు. అందుకోసం కాస్త భారీ కసరత్తే చేస్తున్నారు. సుమారు 83 అంశాలపై ప్రజల వివరాలు సేకరించడమే, కాదు సమాచారం అప్ డేట్ చేసే పని కూడా చేపడుతున్నారు. ఇలా మొత్తం సమాచారాన్ని ప్రభుత్వం సేకరించి, ప్రజల ఆర్థికస్థితిగతులు వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలనుకుంటోంది. 

మరి ఇలా అన్నీ వివరాలు నికార్సుగా సేకరిస్తే, నిజంగా తెల్ల కార్డులకు అర్హులు ఎంత మంది వుంటారు. అంతే కాదు ప్రభుత్వ పింఛన్లు ఎలా వుంటాయి. అన్నింటికి మించి కాపుల స్థితిగతుల వాస్తవ రూపం వచ్చే అవకాశం వుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల కాపులకు బిసి స్టేటస్ వుంది. అక్కడ కాపుల్లో పేదరికం కూడా వుంది. కానీ ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణా కు వచ్చేసరికి పరిస్థితి వేరుగావుంది. 

మరి ఈ లెక్కలు అన్నీ నికార్సులగా బయటకు వచ్చి, మంజునాధ కమిషన్ ముందు పెడితే కాపుల రిజర్వేషన్ సమస్యలో పడే ప్రమాదం వుంటుందేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పైగా అసలు అందుకే బాబు ఇప్పుడు అర్జెంట్ గా ఈ సర్వే కార్యక్రమం ఇంత భారీగా, లోప భూయిష్టంగా, అర్జెంట్ గా చేపడుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఓకసారి ప్రజలు తమ అంతట తాము నికార్సుగా వివరాలు అందించిన తరువాత, వాటిని టాబ్లింగ్ చేసాక ఎవరు కాదనగలరు? వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే..? ప్రభుత్వం సైలెంట్ గా వున్నా, ఒకసారి ఈ వివరాలు బయటకు వచ్చాక, కాపు రిజర్వేషన్లను వ్యతిరేకించేవారు వాటినే ప్రచారంలోకి తెచ్చే అవకాశం వుందేమో?

Show comments