ప్రశాంతంగా శ్రీకాకుళం జిల్లా

ఎటు మొగ్గుతారు.. ఏ పార్టీకి ఓటేస్తారు. ఎవరిని ఎందుకు ద్వేషిస్తున్నారు.. ఇవన్నీ కాస్సేపు పక్కన పెడదాం. కానీ ఎన్నికల వేళ రయ్.. రయ్ మంటూ జెండాలు కట్టుకుని తిరిగే బైకులు పెద్దగా లేవు. కారుల బారులు అసలే లేవు. మైకుల కాలుష్యం అంతకన్నా లేదు. శ్రీకాకుళం జిల్లాలో అసలు ఎన్నికలు వున్నాయా? అన్న అనుమానం వచ్చేంత ప్రశాంతంగా వుందీ ప్రాంతం. అలా అని చిన్న చితక వాళ్లు పోటీ చేయడం లేదు… అంతా హేమా హేమీలే… ఎర్రం నాయుడు కుమారుడు రామ్మోహన నాయుడు, ఆయ‌న‌ బాబాయ్ అచ్చం నాయుడు, అలాగే ధర్మన బ్రదర్స్ ఇద్దరూ, స్పీకర్ తమ్మినేని, అలాగే తెలుగుదేశంతో అను కుల బంధాలున్న గౌతు కుటుంబానికి చెందిన శిరీష, ఇలా అంతా మహా మహులే.

కానీ ప్రచారం మాత్రం చాలా అంటే చాలా సైలంట్ గా వుంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వుంటుంది అంటే ఇరు వైపులా గెలుపు ధీమా బలంగా వున్నపుడు. ఒకరికి ధీమా తక్కువగా వున్నా, హడావుడి ఎక్కువ చేయాల్సి వుంటుంది. కానీ ఎవరూ ఎక్కువ చేయడం లేదు. అంతా సైలంట్ గా ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు.

సాధారణంగా పెద్ద సభలు పెడితే జనాలను పోగు చేయడానికి 150 నుంచి 500 ఇవ్వడం కామన్. అలాగే మందు.. బిరియానీ. ఏ జిల్లాలో అయినా ఇదే తంతు. అలాంటిది ఈ రోజు వైకాపా ప్రచారం కోసం సిఎమ్ జగన్ ఇచ్ఛాపురం వచ్చారు. జనం గట్టిగానే వచ్చారు. డబ్బులు ఇచ్చారా? అని అడిగితే, ‘ఇంకా ఇవ్వలా? ఎన్నికల యేలకు ఇస్తరేమో’ అంటూ అమాయకంగా జవాబు. మందు దుకాణాల ముందు కాస్త హడావుడి మాత్రం వుంది.

శ్రీకాకుళం జిల్లా జనాలు అమాయకులు అంటారంతా… కానీ తెలివైన వారే… పక్కాగా. ‘ఎవరికి మీ ఓటు.. ఎవరంటే ఇష్టం… ఎవరంటే ఎందుకు ఇష్టం లేదు’ అని అడిగితే కుర్రాళ్లు సైతం మెలికలు తిరుగుతూ తప్పించుకుంటున్నారు. ఒకటికి పది సార్లు రెట్టిస్తే..అప్పుడు ‘జనసేనకు’ అన్నారు ఒకరిద్దరు. పోటీ లేని చోట్ల అంటే… మూడు పార్టీలు కలిసిపోయాయి కదా… అంటూ మరింత అమాయకంగా చెబుతున్నారు.

Readmore!

మహిళలయితే వాళ్లలో వాళ్లు మొహాలు చూసుకుంటూ, ముసి ముసినవ్వులు నవ్వుకుని పక్కకు వెళ్తున్నారు. మగవారు మాత్రం కాస్త మెల్లగా అయినా సమాధానం చెబుతున్నారు. చంద్రబాబు వస్తే బాగుంటుంది అన్నారు కొందరు. మీ ఓటు ఎవరికి అని అడిగితే జగన్ కే అంటున్నారు. మీ దగ్గర పోటీ చేస్తున్న వాళ్ల సంగతి అని క్లారిటీగా అడిగితే, జగన్ కే అంటున్నారు మళ్లీ.

ఈ ఎన్నికల యుద్దం జగన్ కు చంద్రబాబు కు మధ్య అని అందరూ అంటున్నది కూడా ఇందుకే. జనాలు కూడా అలాగే భావిస్తున్నారేమో?

శ్రీకాకుళంలో గుండ లక్ష్మీదేవికి టికెట్ ఇవ్వలేదు తెలుగుదేశం అన్న అసంతృప్తి కొద్దిగా వుంది. అయినా ఫైట్ టైట్ గానే వుంది. అచ్చెం నాయుడికి పెద్దగా కష్టం వున్నట్లు లేదు. పదే పదే దువ్వాడ శ్రీనుకే ఎందుకు వైకాపా టికెట్ అని ఆ పార్టీ అభిమానులే ఒకరిద్దరు ప్రశ్నించారు. అయినా దువ్వాడ శ్రీను లక్కీ అంటూ చతర్లు వేసారు. ఎందుకు అని అడిగితే… పార్టీ డబ్బులిస్తుంది.. టికెట్ ఇచ్చింది. ఓడిపోతే మాత్రం నష్టం ఏమిటి అని జోకేసారు.

పలాస పోటీ కాస్త గట్టిగానే వుంది. ఇచ్ఛాపురం కూడా డిటో. ఇచ్ఛాపురంలో కుర్రాళ్లు ఎక్కువగా జగన్ వైపు మొగ్గినట్లు మాట్లాడడం విశేషం.

మొత్తం మీద శ్రీకాకుళం జిల్లాది ఓ ప్రత్యేక శైలి మాదిరిగా కనిపిస్తోంది ఎన్నికల వేళ.

-విఎస్ఎన్ మూర్తి

Show comments