కేసీఆర్‌ నయా నవాబ్‌: ఖుష్బూ ఫైరింగ్‌.!

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ని నయా నవాబ్‌గా అభివర్ణించారు సినీనటి, కాంగ్రెస్‌ నేత ఖుష్బూ. సీఎం కేసీఆర్‌ అంటే, ముఖ్యమంత్రి కేసీఆర్‌లా కాదు.. కమీషన్‌ మ్యాన్‌ కేసీఆర్‌లా వ్యవహరించారంటూ దుమ్మెత్తిపోశారు. దళిత ముఖ్యమంత్రి.. అంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామిని కేసీఆర్‌, చెత్తబుట్టలో పడేశారంటూ ఖుష్బూ విరుచుకుపడిపోయారు.

తమిళనాడుకి చెందిన ఖుష్బూ, ఒకప్పుడు డీఎంకే పార్టీలో కీలకనేతగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ తరఫున తమిళనాడు రాజకీయాల్లో హల్‌చల్‌ చేస్తున్న ఈ ఒకప్పటి హీరోయిన్‌ని కాంగ్రెస్‌ పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా తెలంగాణ ఎన్నికల కోసం తీసుకొచ్చింది.

స్టార్‌ క్యాంపెయినర్‌గా తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి విజయశాంతి సేవలందిస్తున్నా, ఖుష్బూ వాగ్దాటి కాంగ్రెస్‌ పెద్దలకు బాగా తెలుసు గనుక, ఆమెని రంగంలోకి దించడం, ఆమె అధిష్టానం అంచనాలకు అనుగుణంగా ప్రత్యర్థులపై విరుచుకుపడటం చకచకా జరిగిపోయాయి.

చిరంజీవి హీరోగా నటించిన 'స్టాలిన్‌' సినిమాలో చిరంజీవికి అక్కగా నటించిన ఖుష్బూ, ఈ మధ్యనే పవన్‌ కళ్యాణ్‌ సినిమా 'అజ్ఞాతవాసి'లో పవన్‌కళ్యాణ్‌కి 'పిన్ని' పాత్రలో కన్పించిన సంగతి తెల్సిందే. ఓ వైపు సినిమాల్ని, ఇంకో వైపు రాజకీయాల్ని ఖుష్బూ బాగానే బ్యాలెన్స్‌ చేస్తోంది. ఒకప్పుడు తెలుగులో పలువురు హీరోల సరసన హీరోయిన్‌గా ఖుష్బూ నటించిన విషయం విదితమే.

ఇక, తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు.. వివిధ అంశాలపై కేసీఆర్‌ని విమర్శించడం చూస్తూనే వున్నాం. అవే విమర్శల్ని కాస్త అటూ ఇటూగా ఖుష్బూ నోట వింటున్నాం అంతే. అయితే, ఖుష్బూకి వున్న పాపులారిటీ, సినీ గ్లామర్‌ నేపథ్యంలో.. ఆమె చేసే విమర్శలు ఒకింత అటెన్షన్‌ని గట్టిగానే సంపాదిస్తున్నాయి.

'మహిళ అంటే, మీ కుమార్తె మాత్రమేనా.? మహిళలకు మీ మంత్రివర్గంలో ఎందుకు అవకాశం ఇవ్వలేదు.?' అని ఖుష్బూ, కేసీఆర్‌ని ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్‌ హామీలు ఇచ్చి తప్పారు సరే, మరి కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని మహాకూటమి అధికారంలోకి వస్తే ఏమి చేస్తారు.

దళిత ముఖ్యమంత్రిని ఆశించవచ్చా.? మహిళా ముఖ్యమంత్రిని ఆశించవచ్చా.? అని మీడియా ప్రశ్నిస్తే, 'ముఖ్యమంత్రి ఎవరన్నది రాహుల్‌గాంధీ నిర్ణయిస్తారు.. చంద్రబాబు డిసైడ్‌ చేస్తారు..' అని ఖుష్బూ వ్యాఖ్యానించడం గమనార్హం.

ఆసక్తిదాయకంగా 'పోల్‌ తెలంగాణ'... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments