ఆర్టీసీ మనసు దోచిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరీ ఇంత కఠినాత్ముడిగా ఉన్నారేమిటా... అని మొన్న మొన్నటి దాకా అందరూ దారుణంగా తిట్టుకున్నారు. అలాంటిది.. ఒక్కసారిగా ఆయన ఆర్టీసీ కార్మికుల.. సారీ ఉద్యోగుల మనసు గంపగుత్తగా దోచుకున్నారు.

అసలు వారిని కార్మికులు అని పిలవడానికే వీల్లేదని ఉద్యోగులు అని మాత్రమే అనాలని కూడా సెలవిచ్చారు. ఉద్యోగ సంఘాల ఉసురు తీసేస్తూనే... ఉద్యోగులు/కార్మికులు ఊహించని అనేక రకాల వరాలను ప్రకటించడం ద్వారా..ముఖ్యమంత్రి కేసీఆర్ వారి మనసు దోచుకున్నారు.

సమ్మె సమయంలో కేసీఆర్ ఎంత మొండిగా వ్యవహరించారో అందరికీ తెలుసు. కోర్టు జోక్యం చేసుకుని ఎన్నిరకాలుగా మధ్యంతర ఉత్తర్వులు/సూచనలు ఇచ్చినప్పటికీ.. వాటిని ఖాతరు చేయకుండా.. ముందుకెళ్లడం ఎలా అనే విషయమ్మీదనే కేసీఆర్ కసరత్తు యావత్తూ జరిగింది. అంతే తప్ప సమస్యల గురించి ఆయన దృష్టిపెట్టినట్టు కనిపించలేదు. అలాంటిది బేషరత్తుగా ఉద్యోగాల్లో చేరిపోడానికి అనుమతించిన తర్వాత.. కార్మికులతో నేరుగా తానే సమావేశమై కేసీఆర్ ప్రకటించిన వరాలు అనూహ్యం.

ప్రైవేటీకరణ లేదనడం, 60 ఏళ్లకు రిటైర్మెంటు వయసు పెంచడం, సమ్మెకాలానికి వేతనం ఇస్తాం అనడం, బడ్జెట్ లో ఏటా వెయ్యి కోట్లు ఇస్తాననడం ఇవన్నీ మామూలు వరాలు కాదు. ప్రత్యేకించి మహిళా ఉద్యోగుల కేసీఆర్ కు జేజేలు కొట్టే వాతావరణం ఏర్పాటైంది.

ఆర్టీసీలో కనీసం డిపోల్లో మహిళ ఉద్యోగులకు ప్రత్యేకించిన మరుగుదొడ్లు కూడా లేకుండా వారు ఎన్ని అవస్థలు పడుతున్నారో వర్ణనాతీతం. అలాంటి వాటి దగ్గరినుంచి వారి డ్యూటీ వేళలు రాత్రి ఎనిమిదికి ముగిసేలా, చైల్డ్ కేర్ లీవ్ మూడు నెలలు ఇచ్చేలా.. ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వసతులు కల్పించడం గొప్ప విషయం.

సమ్మే కాలంలో మరణించిన ప్రతికుటుంబానికి ఒక ఉద్యోగం, ఆర్థిక సాయం లాంటివి ఎక్స్‌పెక్ట్ చేసినవే. ఇంకా అనేక రకాలుగా ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసే, ఉద్యోగులకు గౌరవప్రదమైన వసతులు కల్పించే నిర్ణయాలు కేసీఆర్ ప్రకటించారు. ఇవన్నీ అమల్లోకి వస్తే మాత్రం.. ఆయన ఆర్టీసీ మనసును గంపగుత్తగా దోచుకున్నట్లే భావించాలి.

Show comments