కేసీఆర్, జగన్ భేటీ.. ఎవరి ఊహాగానాలు వారివి!

ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఈ రోజు మరోసారి భేటీ కానున్నారు. సీఎంగా జగన్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పలు సార్లు కేసీఆర్ తో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి రకరకాల కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. జగన్ ఏం చేసినా తెలుగుదేశం పార్టీ విమర్శిస్తూనే ఉంటుంది. అదే రకంగా ఈ అంశంలోనూ విమర్శలు చేస్తూ వచ్చింది.

ఓటుకు నోటు కేసులు ఇరుక్కోనంత వరకూ కూడా చంద్రబాబు నాయుడు కేసీఆర్ తో అత్యంత సఖ్యతతో మెలిగారు. ఆ తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు కోసం తను ప్రయత్నాలు చేసినట్టుగా చంద్రబాబు అనేక సార్లు ప్రకటించారు కూడా. తను స్నేహాన్నే కోరుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు బాహాటంగా ప్రకటించారు. అయితే కేసీఆర్ తనను పట్టించుకోలేదని వాపోయారు. అలా కేసీఆర్ తనను పక్కన పెట్టిన వైనం గురించి చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పారు.

చంద్రబాబు కేవలం ఇరు రాష్ట్రాల సీఎంలుగా తమ స్నేహాన్నే కాదు, తెలంగాణలో తెలుగుదేశం, టీఆర్ఎస్ ల పొత్తును కూడా కోరుకున్నారు. అయితే తనను కేసీఆర్ పట్టించుకోలేదని చంద్రబాబు వాపోయారు. అదంతా ఇప్పుడు అంతా మరిచిపోయారన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్లు మాట్లాడుతూ ఉంటారు. కేసీఆర్ ట్రాప్ లో జగన్ పడ్డారంటూ.. వెకిలికామెంట్లు చేస్తూ ఉంటారు. ఎవరి ట్రాప్ లోనో పడేంత అమాయకుడు అయితే జగన్ ఇంతదాకా ఎదిగేవారు కాదని తెలుగుదేశం వాళ్లకూ తెలిసిన సంగతే. అయితే ఏదో అనాలి కాబట్టి అనాలన్నట్టుగా ఉంటాయి ఆ మాటలు.

ఇక కేసీఆర్, జగన్ ల మధ్యన పెండింగ్ లోని విభజన అంశాలు చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. వాటిపై తేల్చుకోవడానికి కూడా సమయం ఆసన్నమైంది. మరోవైపు జగన్, కేసీఆర్ ల  సమావేశం.. బీజేపీ మీద యుద్ధానికి అని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. బీజేపీ ఉమ్మడి శత్రువుగా తయారవుతోందని , చెక్ పెట్టడానికి వీరు చర్చించుకుంటారని  వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ప్రధానంగా కేసీఆర్ కు మాత్రమే శత్రువు. ఏపీలో బలోపేతం అయ్యే లక్షణాలు కమలం పార్టీలో ఏమీ కనిపించడం లేదు. కాబట్టి..జగన్ కు అలాంటి అజెండా ఏమీ లేకపోవచ్చని మాత్రం స్పష్టం  అవుతోంది.

Show comments