కమల్‌ కెలుకుడు - సర్వత్రా చెడుగుడు

విశ్వనటుడు కమల్‌హాసన్‌, నిన్న మొన్నటిదాకా ఏ కామెంట్‌ చేసినా, దానికి బోల్డంత 'విలువ' వుండేది. కమల్‌ కామెంట్స్‌పై ఆసక్తికరమైన చర్చ జరిగేది. హిందూ తీవ్రవాదంపై కమల్‌ చేసిన తాజా వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నిజానికి, ఇప్పుడూ ఆయన వ్యాఖ్యలపై పెద్ద చర్చే జరుగుతోంది. ఈసారి చర్చ మాత్రం, కమల్‌కి వ్యతిరేకంగా కావడం గమనార్హం. నేషనల్‌ మీడియా అయితే, కమల్‌హాసన్‌తో చెడుగుడు ఆడేసుకుంటోంది.! 

ఇది నిజంగానే కమల్‌ ఊహించని సందర్భం. తాను ఏం మాట్లాడినా మీడియాలో మంచి కవరేజ్‌ వస్తుందని కమల్‌కి బాగా తెలుసు. అందుకే జల్లికట్టు అయినా, ఇంకోటైనా 'ముఖ్యమైన అంశాల్ని' పట్టుకుని కమల్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసేవాడు. అలా, ఆయనకి మీడియాలో మంచి పాపులారిటీ దక్కింది. ఇది కేవలం నటుడిగా దక్కిన ఇమేజ్‌ కాదు, అంతకు మించి కమల్‌లోని 'ప్రత్యేకమైన కోణం' ఎలివేట్‌ అవడం ద్వారా దక్కిన కొత్త ఇమేజ్‌. 

బహుశా, జల్లికట్టు గురించీ.. తమిళనాడు రాజకీయాల గురించీ కమల్‌ మాట్లాడింది, తన రాజకీయ రంగ ప్రవేశం కోసమేనేమో.! అనుకున్న స్థాయిలో తనకు పబ్లిసిటీ రాలేదనుకున్నాడో ఏమో, ఏకంగా హిందూ తీవ్రవాదం అంటూ తన నోట రాకూడని మాటని తీసుకొచ్చేశాడు. అంతే, దుమారం తారాస్థాయికి చేరిందిప్పుడు. ప్రధానంగా కేరళ మీద కమల్‌ ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుండడం, అక్కడి ప్రభుత్వంపై ప్రశంసలు గుప్పించడం ద్వారా కమల్‌ రాజకీయంగా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్న విషయం విదితమే. 

అయితే, ఇదే కేరళలో ఐసిస్‌ తీవ్రవాద సానుభూతిపరులు చాలా చాలా ఎక్కువమంది దొరుకుతున్నారు. ఇక్కడినుంచే సరాసరి, ఐసిస్‌లో చేరిపోతున్నవారి గురించి మీడియాలో కథనాల్ని చూస్తూనే వున్నాం. తాజాగా ఓ ఐసిస్‌ రాకెట్‌ని కేరళలో కనుగొన్నారు పోలీసులు. ఇంత తీవ్రమైన పరిస్థితులు కేరళలో వుంటే, ఐసిస్‌ తీవ్రవాదాన్ని (ఇస్లామిక్‌ తీవ్రవాదం అనాలి మామూలుగా అయితే) గురించి మాట్లాడకుండా, హిందూ తీవ్రవాదం గురించి మాట్లాడుతూ కేరళ అంశాన్ని ప్రస్తావించడమేంటట.? 

బీజేపీ నేతలెలాగూ కమల్‌ని ఈ కోణంలోనే విమర్శిస్తారు. ఈసారి మీడియా కూడా కమల్‌ని ఇదే కోణంలో ప్రశ్నిస్తోంది. సోషల్‌ మీడియా అయితే కమల్‌ని కడిగి పారేస్తోంది. ఇప్పటిదాకా కమల్‌ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో సందడి చేసిన ఆయన అభిమానులు, ఇప్పుడు మూగబోయారు. కమల్‌ వ్యాఖ్యలపై ఎలా స్పందించాలో వారికి అర్థం కావడంలేదు. ఒక్క వ్యాఖ్య.. అదీ నోటి దురదతో వచ్చిన వ్యాఖ్య.. కమల్‌ని ఆయన అభిమానులకే దూరం చేసింది. ఏ రాజకీయ దుగ్దతో ఈ వ్యాఖ్యల్ని కమల్‌ చేశాడోగానీ, కమల్‌ రాజకీయ రంగ ప్రవేశానికి ముందే, రాజకీయంగా అతన్ని ఆ వ్యాఖ్యలు సమాధి చేసేలా వున్నాయిప్పుడు.

Show comments