జగన్ వచ్చారు.. చాకిరేవుకి ముహూర్తం ఎప్పుడు?

జగన్ లేని టైమ్ లో ఏపీలో చాలా పరిణామాలు జరిగాయి. మహానాడు జరిగింది. కోనసీమలో అల్లర్లు జరిగాయి. ఒకరు తొడలు కొట్టారు, ఇంకొకరు టీడీపీ కార్యకర్తల జోలికొస్తే తాటతీస్తానంటూ హెచ్చరించారు. ముందస్తు ఎన్నికలొచ్చేస్తాయంటూ మరోసారి చంద్రబాబు జనంలోకి ఓ ఫీలర్ వదిలారు. 

మరి వీటన్నిటికీ జగన్ ఒకేసారి కౌంటర్ ఇస్తారా..? ఇస్తే అది ఎలా ఉంటుంది..? దావోస్ పర్యటన ముగించుకొని స్వస్థలానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. మరో 2-3 రోజుల్లో టీడీపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది.

జగన్ అప్పటిలా లేరు..?

మూడేళ్ల కాలంలో జగన్ పాలనలో బాగా బిజీగా ఉన్నారు. కనీసం సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వలేనంత బిజీగా ఉన్నారు. ఇక ప్రతిపక్షాల గురించి పట్టించుకోవడం కూడా చాలా తక్కువ. విమర్శలకు సమాధానాలే కరువయ్యాయి. కానీ ఇటీవల జగన్ లో మార్పు బాగా కనపడుతోంది. 

దత్తపుత్రుడు అంటూ ర్యాగింగ్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు. చంద్రబాబుకి ఇటీవల బహిరంగ సభల్లోనే ఆయన చాకిరేవు పెట్టేశారు. సహజంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం పెట్టిన మీటింగ్ లలో జగన్ రాజకీయాలు మాట్లాడేవారు కాదు. కానీ మారీచ, సుబాహువుల్లా మంచి పనులకు ప్రతిపక్షం అడ్డు తగులుతుండే సరికి జగన్ నేరుగా వారినే టార్గెట్ చేస్తున్నారు. దుష్టచతుష్టయం అంటూ దుయ్యబడుతున్నారు.

డోస్ పెంచుతారా..?

ఈమధ్యే జగన్ లో ఈ మార్పు గమనించాం. అంతలోనే ఆయన దావోస్ పర్యటనకు వెళ్లారు. తిరిగి వచ్చేలోగా ఇక్కడ ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలతో విరుచుకుపడ్డాయి. మహానాడులో వాగిన వాగుడు గురించి అందరికీ తెలిసిందే. జగన్ నే కాదు, ఆయన సతీమణి పేరు కూడా ప్రస్తావిస్తూ మహిళలతో తిట్టించారు చంద్రబాబు. ఇప్పుడు వీటన్నిటికీ ఒకేసారి జగన్ కౌంటర్ ఇస్తారని తెలుస్తోంది.

ఒకప్పటిలా జగన్ చూసీచూడనట్టు వదిలేయడం లేదు కాబట్టి.. ఆయన రియాక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని మాత్రం అనుకోవచ్చు. న్యాయభేరి సదస్సులో మంత్రులు కూడా కాస్త ఘాటుగానే చంద్రబాబుకి చీవాట్లు పెట్టారు. ఆ సీన్ రిపీట్ అయితే మాత్రం జగన్ చేతిలో మరోసారి బాబుకి, చినబాబుకి, దత్తపుత్రుడికి చాకిరేవు తప్పదన్నమాట. 

Show comments