ఔనా... నిజ‌మా అమిత్‌షా!

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రంలో ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్ర‌చారం చేశారు. ధ‌ర్మ‌వ‌రం నుంచి బీజేపీ అభ్య‌ర్థి స‌త్య‌కుమార్ పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న బీజేపీ ముసుగులో ఉన్న టీడీపీ నాయకుడ‌ని సొంత పార్టీలో అనుకుంటుంటారు. స‌త్య‌కుమార్‌ను గెలిపించుకోడానికి ఢిల్లీ నుంచి అమిత్‌షా రావ‌డం, చంద్ర‌బాబు పాల్గొన‌డం విశేషంగా చెప్పుకోవ‌చ్చు.

ధ‌ర్మ‌వ‌రం స‌భ‌లో జ‌గ‌న్‌, వైసీపీ ప్ర‌భుత్వంపై అమిత్‌షా విమ‌ర్శ‌లు కామెడీగా ఉన్నాయ‌ని నెటిజ‌న్లు దెప్పి పొడుస్తున్నారు. ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ జ‌గ‌న్‌తో స్నేహంగా మెలిగి, ఇప్పుడు రాజ‌కీయాల కోసం విమ‌ర్శ‌లు చేస్తే... న‌వ్వు తెప్పించ‌కుండా ఎలా వుంటుంద‌ని నెటిజ‌న్లు అంటున్నారు. రామమందిరం ప్రారంభానికి జ‌గ‌న్‌ను ఆహ్వానించినా రాలేద‌ని అమిత్‌షా అన్నారు. త‌ద్వారా హిందూ వ్య‌తిరేకిగా ముద్ర వేసి, కాసిన్ని ఓట్లు సంపాదించుకోవ‌చ్చ‌నేది ఆయ‌న ఆశ‌.

అలాగే ఏపీని అభివృద్ధి చేయ‌కుండా భ్ర‌ష్టు ప‌ట్టించార‌ని అమిత్‌షా ఆరోపించారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై రూ.13 ల‌క్ష‌ల‌ కోట్ల అప్పు భారం మోపార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. మ‌ద్యం సిండికేట్‌లు ఏర్పాటు చేసి అవినీతికి పాల్ప‌డ్డార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. సీఎం జ‌గ‌న్ ఒక్క అవకాశం పేరుతో అధికారంలోకి వ‌చ్చి, రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల‌ను గాలికి వ‌దిలేశార‌ని అమిత్‌షా విమ‌ర్శించారు.

ఈ విమ‌ర్శ‌ల‌న్నీ చంద్ర‌బాబునాయుడు స్క్రిప్ట్ ఇవ్వ‌గా, అమిత్‌షా చ‌దివిన‌ట్టు ఉంద‌ని నెటిజ‌న్లు సెటైర్స్ విసురుతున్నారు. కేంద్రంలో మోదీ స‌ర్కార్ గ‌తంలో ప్ర‌భుత్వాల‌న్నీ చేసిన అప్పుల కంటే, ఈ ప‌దేళ్ల‌లో రెట్టింపు అప్పులు చేసిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. అమిత్‌షా వ‌చ్చి జ‌గ‌న్ స‌ర్కార్ అప్పుల గురించి మాట్లాడ్డం చూసి.... రాష్ట్ర ప్ర‌జానీకం ఔనా...నిజ‌మా? అని వెట‌కారంగా ప్ర‌శ్నిస్తున్న ప‌రిస్థితి. ఏపీలో ప్ర‌చారం చేస్తున్నాం కాబ‌ట్టి, జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయాల‌న్న‌ట్టుగా అమిత్‌షా ప్ర‌సంగం కొన‌సాగింద‌నేది మెజార్టీ అభిప్రాయం. 

Readmore!

Show comments