'సాక్షి'కి పరోక్షంగా చురకలంటించిన జగన్

పార్టీలవారీగా ఎవరి పత్రికలు వారికి ఉన్నాయి, ఎవరి ఛానెళ్లు వారికి ఉన్నాయి. పార్టీల అజెండాల ప్రకారం అవి పనిచేయాల్సిందే. అయితే టీడీపీని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఎలివేట్ చేసినంతగా వైసీపీని సాక్షి ఎలివేట్ చేయగలుగుతుందా.. అనేది ఇంకా అనుమానంగానే మిగిలిపోతోంది. ఆత్మస్తుతి, పరనింద ఎప్పుడూ ఉండేదే.. కానీ జనం అది నిజం అని నమ్మేంతగా సాక్షి కథనాలు ఇవ్వగలుగుతుందా? ఇస్తే ఇంకా ఈనాడు, ఏబీఎన్, టీవీ-5ని ఆడిపోసుకునే రోజులు ఉంటాయా?

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5లో అబద్ధాలే ప్రచారంలో ఉంటాయనుకుందాం. మరి ఆ నిజమేంటో సాక్షిలో రావాలి కదా. అలా సాక్షిలో నిజాలు వెదుక్కోడానికి జనాలు అలవాటు పడితే.. ఆ మూడు మీడియా సంస్థల్ని ఏనాడో పక్కనపెట్టేసి ఉండేవారు. అసలు వాటి జోలికి కూడా వెళ్లేవారు కాదు. కానీ సాక్షి ఆ స్థాయిలో జనాలకు నిజాలు చేరవేయలేకపోతోంది. ఆహా, ఓహో అనే కథనాలే కానీ, అసలు నిజాల్ని జనం మధ్యకు చేర్చలేకపోతోంది.

టీడీపీ అనుకూల మీడియాలో వచ్చే వార్తలకు ఖండనలు, కవరింగ్ లు తప్ప సాక్షిలో మిగతా ఏవీ ఉండవనేది ప్రధాన ఆరోపణ. ఆరోపణ కాదు అది నిజమే. ఎందుకంటే.. సాక్షాత్తూ సీఎం జగన్.. కొన్ని మీడియా సంస్థలతో యుద్ధం చేస్తున్నాం అంటూ స్టేట్ మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే అంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలి.

సాక్షి నిర్లక్ష్యం వల్లే ఇంకా జనాల్లో పచ్చ పత్రికలు, ఛానెళ్లకు క్రేజ్ తగ్గలేదు. లోకేష్, రమ్య ఇంటికి వెళ్లి హడావిడి చేయకముందే.. అసలు జరిగిందేంటో సాక్షిలో వస్తే జనాలు ఆ ఇష్యూని సరిగా అర్థం చేసుకునేవారు కదా. కానిస్టేబుల్ వ్యవహారాన్ని జగన్ ఉదాహరణగా చూపుతూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5ని తీవ్రంగా విమర్శించారు. వాటితో జాగ్రత్తగా ఉండాలని అధికారులను హెచ్చరించారు. 

మరి అదే వ్యవహారాన్ని సాక్షి సమర్థంగా, ప్రజెంట్ చేయగలిగితే జనాలు డైవర్ట్ అవ్వడానికి అవకాశం ఉండేది కాదుగా. అదే జరిగితే జగన్ ఇప్పుడు ఇంతలా మీడియాను తప్పుబట్టే అవసరం వచ్చేది కాదు కదా..?

ఆ మూడు సంస్థల పేర్లు ఎత్తి జగన్ పరోక్షంగా సాక్షికి కూడా చురకలంటించారనే చెప్పాలి. ఇప్పటికైనా స్థానిక నాయకుల భజన, ప్రచార వార్తల్ని పక్కనపెట్టి వాస్తవాలను వేగంగా జనాల ముందుంచడానికి సాక్షి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయనన్ని రోజులు.. పచ్చపాత మీడియాని తిట్టుకోవడం మినహా ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదు. 

Show comments