అర్థంలేని ఆశతో వివాదంలో ఇరుక్కున్న జగన్!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో కాకుండా మరో రకంగా ఇప్పటికిప్పుడు ప్రజలు ఊహించుకోగలరా? జగన్మోహన్ రెడ్డి లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలదని, కనీసం ప్రజల ఎదుటకు ధైర్యంగా వెళ్ళగలదని ఎవరైనా నమ్ముతున్నారా? జగన్ ను ధిక్కరించి ఆయన పార్టీ మీద పెత్తనం సాగించగల తెగువ, స్థాయి, ధైర్యం, అవకాశం ఎవరికైనా ఉన్నాయని ప్రజలు భ్రమ పడుతున్నారా? ఇలాంటి ఎన్ని ప్రశ్నలు వేసినా సరే మనకు ‘నో’ అనే సమాధానం మాత్రమే వస్తుంది. 

అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద పెత్తనానికి సంబంధించి తన అధికార కాంక్షను అంత బాహాటంగా ఎందుకు బయట పెట్టుకున్నారు? దానివల్ల ప్రత్యేకంగా ఆయన ఏం సాధించారు? ఇప్పుడు ఒక కొత్త వివాదం రూపేణా నలుగురూ తన గురించి రకరకాలుగా మాట్లాడుకోవడానికి ఆస్కారం ఇవ్వడం తప్ప జగన్మోహన్ రెడ్డి విజయం ఏమిటి? అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశాలుగా ఉన్నాయి.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌ను నియమిస్తూ ఇటీవలి పార్టీ ప్లీనరీ నిర్ణయం తీసుకుంది. ఇది ఏకగ్రీవ నిర్ణయం అనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం కూడా ఉండదు. జగన్ కనుసన్నల్లో పనిచేసే వారు మాత్రమే, జగన్ అడుగులకు మడుగులొత్తే వారు మాత్రమే, వీర విధేయులు మాత్రమే పార్టీలో కొనసాగుతూ ఉంటారు అనేది సత్యం. ఆ మాటకొస్తే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితమైన తీరు కాదు. దాదాపుగా ఒక వ్యక్తి స్థాపించిన, నడిపే ప్రాంతీయ పార్టీలు అన్నీ ఇదే తరహాలో వ్యక్తిగత ఆస్తుల మాదిరిగానే చలామణి అవుతూ ఉంటాయి. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డిలో మాత్రం పార్టీ మీద తన అధికారాన్ని ప్రత్యేకంగా కాపాడుకోవాలనే భయం ఉన్నట్టుగా... శాశ్వత అధ్యక్షుడిగా ఆయనను ఎన్నుకున్నారు.

అయితే ప్రజాస్వామిక పోకడలకు భిన్నమైన ఇలాంటి శాశ్వత ఎన్నిక చల్లదని ఎన్నికల సంఘం తప్పుపడుతోంది. జగన్ ఎన్నిక గురించి ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా ఫిర్యాదులు కూడా ఏమీ రాలేదు. అయినా పత్రికలలో వచ్చిన వార్తల ఆధారంగానే.. ఇలాంటి వ్యవహారం ప్రజాస్వామ్య వ్యతిరేకం అనే ఉద్దేశంతో ఈసీ చర్యలు తీసుకుంది. ఈ విషయంలో పార్టీ అంతర్గతంగా విచారణ జరిపి తమకు నివేదిక ఇవ్వాలని కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని ఆదేశించింది.

వైయస్ జగన్ లేకపోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉండదు. ఆయనను ఓడించి ఆ పార్టీ పగ్గాలను చేతపట్టగలవారు ఎన్నటికీ ఉండబోరు. ఇంకా సూటిగా చెప్పాలంటే వైయస్ జగన్ బొమ్మ లేకుండా ఎన్నికలకు వెళ్లి నెగ్గగల వారు కూడా ఆ పార్టీలో ఉండరు. అలాంటప్పుడు ప్రకటించినా ప్రకటించకపోయినా అధ్యక్ష హోదా, అధికారం వైభవం అన్ని ఎప్పటికీ జగన్ చేతిలోనే ఉంటాయి. దానిని ప్రశ్నించగలవారు నిలదీయగలవారు కూడా ఉండరు. 

అయినా సరే తనను తాను శాశ్వత అధ్యక్షుడు అనే హోదాలో.. చూసుకోవాలని జగన్ ముచ్చట పడ్డట్లు ఉన్నారు. ఆ ముచ్చట ఇప్పుడు వివాదానికి కారణమైంది. జగన్ పోకడలు ప్రజాస్వామిక స్ఫూర్తికి వ్యతిరేకం అనే చర్చ జరగడానికి ఆస్కారం ఇస్తోంది. ఈ విషయాన్ని మరింత సాగదీయకుండా జగన్ తన అధికార వైభవాన్ని, హోదాని, గౌరవాన్ని కాపాడుకుంటే బాగుంటుంది.

Show comments