ఇటు కేబినెట్ భేటీ.. అటు కేబినెట్ విస్తరణ!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆశావహులకు తీపి కబురు చెప్పబోతున్నారు సీఎం జగన్. అదే సమయంలో మాజీలు అయిపోతామనే భయంతో తాజా మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దాదాపుగా మంత్రిమండలి మొత్తాన్ని మార్చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ ఈరోజు నిర్వహించే కేబినెట్ భేటీ.. పాతవారికి ఆఖరి సమావేశం అని తెలుస్తోంది. 

సాయంత్రం గవర్నర్ ను కలవనున్న ముఖ్యమంత్రి.. మంత్రిమండలి మార్పుచేర్పుల గురించి చర్చిస్తారని అంటున్నారు. ఆల్రెడీ మహూర్తం ఫిక్స్ చేసుకున్నారని, దాన్ని సూచనప్రాయంగా గవర్నర్ కి చెబుతారని తెలుస్తోంది.

మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు..

దాదాపు 20 నుంచి 25 అంశాలపై చర్చిస్తారని అంటున్నా.. అందులో ముఖ్యంగా ఉండేవి రెండే రెండు. ఒకటి సినిమా టికెట్ల ఆన్ లైన్ వ్యవహారాన్ని ఖరారు చేయడం, రెండోది టీటీడీ బోర్డ్ మెంబర్ల సంఖ్యను పెంచేందుకు చట్టసవరణ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయడం. 

వీటితో పాటు.. మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈ సమావేశంలోనే తీసుకుంటారు. అయితే దాదాపుగా ఇప్పుడున్న మంత్రివర్గంతో జరిగే చివరాఖరి సమావేశం ఇదే అవుతుందని, నెక్స్ట్ కేబినెట్ భేటీకల్లా అందరూ కొత్త మంత్రులు వచ్చేస్తారని అంటున్నారు.

సాయంత్రం గవర్నర్ భేటీపై ఆసక్తి..

నవంబర్-1 న జరిగే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి గవర్నర్ ను ముఖ్య అతిథిగా పిలిచేందుకు సీఎం జగన్ సాయంత్రం రాజ్ భవన్ వెళ్తున్నారనేది బయటకు వినిపిస్తున్న సమాచారం. అయితే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో అంతకు మించిన కీలక అంశాలపై జగన్ చర్చిస్తారని అంటున్నాయి పార్టీ వర్గాలు. 

వచ్చే నెల జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల గురించి చర్చ జరుగుతుందని, పనిలో పనిగా కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు సంబంధించిన మహూర్తాన్ని కూడా గవర్నర్ కు చెబుతారని అంటున్నారు. గవర్నర్ కి చెప్పిన అనంతరం జగన్ ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారా.. లేదా ఎప్పటిలాగే ఆ ముచ్చట జరిగే వరకు దాన్ని రహస్యంగానే ఉంచుతారా అనేది తేలాల్సి ఉంది. 

Show comments