టాలీవుడ్‌ను కవ్విస్తున్న తెలుగు నవలలు!

నవల.. ఒకనాటి ఎంటర్‌టైన్‌మెంట్. నేటికి ఎవరికీ పట్టకుండా పట్టని ప్రక్రియ! ప్రత్యేకించి తెలుగులో ఎంత ఉన్నతమైన స్థితిని చవిచూసిందో.. ఇప్పుడు అంతటి ధీనమైన స్థితిని ఎదుర్కొంటోంది నవల రచన. నవల రచనతోనే సెలబ్రిటీ స్టేటస్‌ను సంపాదించుకున్న వాళ్లలో ఇప్పుడు చాలా మంది తెరమరుగు అయిపోగా.. కొందరు మాత్రం నేటి తరానికి తగ్గట్టైన వ్యాపకాలతో ఉనికిని చాటుకుంటున్నారు. అయితే.. కొత్తగా నవల రచనపై రచయితల్లో కానీ, పబ్లిషర్లలో ఎలాంటి ఆసక్తి లేదు. ప్రఖ్యాత నవలల పునర్ముద్రణ కూడా ఏమంత గొప్పగా లేదు! మరి ఇలాంటి స్థితిలో ఉన్నప్పటికీ తెలుగు నవల మాత్రం తన ఆకర్షణను ఏ మాత్రమూ కోల్పోలేదు అని రుజువు అవుతోంది! నేటి తరం దర్శకులు పాత నవలలను సినిమాలుగా మలుస్తుండటమే దీనికి రుజువు!

ఆసక్తికరమైన అంశం ఏమనగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టాండ్ అయిన దర్శకుల్లో చాలా మంది వయసు 30 నుంచి 45 మధ్యలో ఉంది. తమకంటూ కొంత ఉనికిని కలిగి.. తమ కంటూ ఒక కాంపౌండ్ కలిగిన వీళ్లు కచ్చితంగా నవలల తరం వాళ్లే! ఏ జనరేషన్ అయితే నవలలను నమిలి మింగిందో ఆ తరానికి చెందిన వాళ్లు ఈ దర్శకులు! టీవీల  వినోదం ఇంకా మధ్య తరగతి కుటుంబాలకు, పల్లెలకు చేరువ కాని దశలో పుట్టి పెరిగిన వాళ్లు వీళ్లంతా. ఖాళీ సమయల్లో గ్రంథాలయాల బాట పట్టి.. అక్కడ దొరికన నవలనల్లా చదివేశామని.. ప్రముఖ దర్శకులు చాలా సార్లే చెప్పుకున్నారు కూడా! వీళ్లలో మరీ పుస్తకాల పురుగులు.. చలం, శ్రీశ్రీ రచనల లోతుల్లో వరకూ వెళ్లగా.. మరికొంతమంది మాత్రం యండమూరి, వాసిరెడ్డి, యద్ధనపూడిల వినోదాత్మక నవలలతోనే ఆగిపోయారు. ఆ విధంగా వీరికి ఆయా నవలలతో ఏర్పడిన అనుబంధం వీరి సినిమాలను కూడా చాలా వరకూ ప్రభావితం చేస్తోంది.

ఈ మధ్య కాలంలో.. దర్శకుడు పూరి జగన్నాథ్ అప్పుడెప్పుడో మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల ‘మిసెస్ పరాంకుశం’ను సినిమాగా మలిచాడు. ‘జ్యోతి లక్ష్మి’ పేరుతో ఆ సినిమా వచ్చింది. అయితే అంతగా ఆకట్టుకోలేదు! దీనికి వేర్వేరు రీజన్లు ఉండవచ్చు. తాజాగా ‘ఆ ఆ’తో యద్ధనపూడి అలనాటి సృజన ‘మీనా’ను మళ్లీ వెలికి తీశాడు త్రివిక్రమ్. దశాబ్దాల కిందట నవలగా సంచలనం సృష్టించిన మీనాను అప్పట్లోనే దర్శకురాలు విజయ నిర్మల సినిమాగా రూపొందించారు. ఆమె మీనా పాత్రలో నటించగా.. కృష్ణ హీరోగా నటించగా వచ్చిన ఆ సినిమా అప్పట్లో విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ బావమరదళ్ల కథకు వన్నె చెరగలేదని.. తాజాగా త్రివిక్రమ్ ‘అ..ఆ’’తో నిరూపించాడు.

కొంచెం వెనక్కు వెళితే యండమూరి సంచలనాత్మక నవల ‘తులసిదళం’ కూడా ఆ మధ్య సినిమాగా వచ్చింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆ నవలను ఆధారంగా చేసుకుని ‘రక్ష’ అంటూ ఒక సినిమా తీశాడు. ‘ఓమెన్’ స్ఫూర్తితో యండమూరి విరచించిన ‘తులసీదళం’ 0లలో సృష్టించిన సంచలనం ఆ తరం వారిని అడిగితే ఇట్టే చెప్పేస్తారు. కాష్మోరా, ఖాద్రా, దార్కా.. బిస్తా, చేతబడి.. అంటూ యండమూరి ప్రకంపనలు పుట్టించాడు. ఆంధ్రభూమి వీక్లీలో ప్రచురితం అయిన తులసీదళం ఆ పత్రిక సర్క్యులేషన్‌ను ఒక రేంజ్‌కు తీసుకెళ్లింది. అప్పట్లోనే తులసిదళం సినిమాగా వచ్చింది. అయితే అంతగా హిట్ కాలేదు. 

ఆ తర్వాత తులసిదళంకు యండమూరి సీక్వెల్ రాశాడు. దాని పేరు ‘తులసి’ తులసిదళానికి ధీటుగా ఆదరణ పొందిన ఈ రెండో నవలనూ సినిమా చేశారు. రాజేంద్రప్రసాద్ మంత్రగాడిగా నటించిన ఈ సినిమా బాగుంటుంది. ఆ  తర్వాత దానికే మరో సీక్వెల్‌గా యండమూరి ‘అష్టావక్ర’ రాశారు. ఇదైతే సినిమా రాలేదు. కానీ.. తర్వాతి కాలంలో యండమూరి దర్శకుడిగా మారి తులసి, తులసీదళం, అష్టావక్రలను సీరియల్‌గా రూపొందించాడు. 2000 సమయంలో.. ఈ సీరియల్స్ ప్రసారం అయ్యి పాత జ్ఞాపకాలను తట్టి లేపాయి. కొంత విరామం తర్వాత వర్మ లోకల్ మేడ్ యండమూరి రచనను ‘రక్ష’ అంటూ సినిమా తీశాడు. ఈ విధంగా ఏదో విధంగా ఆ నవల ఏదో విధంగా ప్రతి జనరేషన్‌నూ పలకరిస్తూనే ఉంది. కేవలం ఇదొక్కటే కాదు.. యండమూరి రచించిన దాదాపు 50 నవలల్లో చాలా నవలలు సినిమాలుగా వచ్చాయి. వాటిల్లో చాలా వరకూ చిరంజీవే హీరోగా నటించిన దాఖలాలున్నాయి. ఛాలెంజ్, అభిలాష, దొంగమొగుడు, స్టువర్ట్ పురం పోలిస్ స్టేషన్, రుద్రనేత్ర, రాక్షసుడు, రక్తసింధూరం.. ఇలా చెప్పుకొంటూ పోతే ఈ జాబితా పెద్దదే.  

ఇప్పుడు విషయం ఏమిటంటే.. ఒకసారి దృష్టి పెడితే.. యండమూరి నవలల్లో కొన్ని ఈ తరంలో సినిమాలుగా మలచదగ్గ సబ్జెక్టులు ఎన్నో ఉన్నాయి! తన రచనా ప్రక్రియలో రకరకాల నవ్యపోకడలను అనుసరించిన యండమూరి పెద్ద బ్యాంకునే పెట్టాడు. వాటి స్ఫూర్తితో కథలను డ్రా చేసుకునే ఆసక్తి ఉంటే.. కథ తయారు చేసుకోవడం పెద్ద సంగతేం కాదు! ఇప్పటికే యండమూరి నవలలను ఆధారంగా చేసుకోని రూపొందిన సినిమాలు ఏవో ఒకటి వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య యండమూరి రచన ‘అనైతికం’ను ఆధారంగా చేసుకుని ఆషాశైనితో ఒకచిన్న సినిమా తీశారు. ఇలాంటి చిన్న ప్రయత్నాలే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి.

ఇక యద్ధనపూడి నవలల్లో కూడా ఎన్నో సినిమాలుగా వచ్చాయి. తెలుగు నవలల హీరోకే కొత్త ఐడెంటీటీని ఇచ్చిన రచయిత్రి ఈమె. ఈ రచయిత్రి తన రచనలతో చాలా మంది నవల కారులేక ప్రేరణ కలిగించింది. తరచి చూడాలి కానీ.. ఆమె నవలల నుంచి స్ఫూర్తి పొందదగ్గ కథలెన్నో ఉన్నాయి. త్రివిక్రమ్ దీన్నినిరూపించాడు. ఆసక్తి ఉన్న వాళ్లు ఒక్కసారి లైబ్రరీని సందర్శిస్తే చాలు!

నవలా సాహిత్యంలో వచ్చిన మంచి మంచి కాన్సెప్టులను సినిమాలుగా మార్చిన పాతతరం దర్శకులు చాలా మందే ఉన్నారు. వీరిలో ముందున్నది ఎ.కోదండరామిరెడ్డి. ఈ తరహాలో అత్యధిక విజయాలు కూడా రెడ్డిగారివే! యండమూరి రచించిన మెజారిటీ నవలలను కోదండరామిరెడ్డి సినిమాలుగా రూపొందించాడు. కొమ్మనాపల్లి నవల్లలో ‘అస్తమించని సూర్యుడు’ కి దర్శకత్వం వహించింది కూడా కోదందరామిరెడ్డే. దర్శేకంద్రుడు రాఘవేంద్ర రావు ‘రుద్రనేత్ర’ ను రూపొందించినా అది హిట్ కాలేదు. సూర్యదేవర రామ్మోహన్ రావు రచించిన నవలపై రాఘవేంద్రరావు దృష్టి పెట్టాడు. సూర్యదేవర రచించిన ‘మనోయజ్ఞం’ను రాఘవేంద్రుడే సీరియల్‌గా రూపొందించాడు.

మల్లాది రచనల్లో కొన్ని జంధ్యాల దర్శకత్వంలో  సినిమాలుగా వచ్చాయి. మల్లాది రచించే సబ్జెక్టులకు, ఆయన సునిసిత హాస్య శైలికి జంధ్యాల మార్కు చిత్రీకరణ వంద శాతంగా న్యాయం చేయగలదు. అందులో జంధ్యాల మల్లాది నవలను సినిమాలుగా రూపొందించడానికి ఉత్సాహం చూపించారు. దర్శకుడు వంశీ కూడా మల్లాది నవల ఒకదాని ఆధారంగానే ‘డిటెక్టివ్ నారదా’ను రూపొందించాడు. బహుశా ఆ నవల పేరు ‘రేపటి కొడుకు’. మల్లాది నవల్లలో కేవలం హస్యప్రధానమైనవే కాకుండా ‘శనివారం నాది’ వంటి థ్రిల్లర్లు ఉన్నాయి. వీటిల్లో కొన్ని ఇప్పటికే సినిమాలుగా వచ్చినా.. రెండోసారి కొత్త స్టైల్లో తీయడం వల్ల నష్టం ఏమీ లేదు! 

వాసిరెడ్డి సీతాదేవి రచనా వ్యాసంగంలో ఎన్నో ప్రయోగాలున్నాయి. ఆ మధ్య దర్శకుడు శంకర్ ‘అపరిచితుడు’లో స్ప్లిట్ పర్సనాలిటీ కథను తెరకు ఎక్కిస్తే మనమంతా వండర్ అయ్యాం. అయితే అంతకు దశాబ్దాలకు పూర్వమే.. వాసిరెడ్డి సీతాదేవి ఈ మల్టీ పర్సనాలిటీడిజార్డర్‌ను నేపథ్యంగా మార్చి మంచి నవలలు రచించింది. దాని పేరు ‘రాగ హేల’. హీరోకి మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌ను పెట్టి.. తన రాతతో ఆమె ఆ నవలను రక్తి కట్టించిన తీరు నిజంగా అద్భుతం! శంకర్ లాంటి దర్శకుడికి పాతికేళ్ల కిందటే అలాంటి ప్రయోగాత్మక కథలతో కూడిన సాహిత్యం వచ్చిదంటే తెలుగు నవలల స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. 

ఇక నవలతో ప్రస్థానం మొదలుపెట్టి సినిమాలకు కూడా కావాల్సినంత ముడిసరుకును ఇచ్చిన రచయిత కొమ్మనాపల్లి గణపతి రావు. బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘భార్గవరాముడు’ సంచలన విజయం సాధించిన సినిమా. దీనికి మూలకథ కొమ్మనాపల్లిదే. ‘అస్తమించని సూర్యుడు’ పేరుతో ఈయన రాసిన నవలకు కొద్దిగామార్పులు చేసి సినిమా తెరెకక్కించారు. అది మాత్రమే కాదు.. కవిత్వం పాలు ఎక్కువగా ఉండే కొమ్మనాపల్లి సాహిత్యంలో సినిమాలుగా రూపొందిన నవలలు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటికీ సినిమాలుగా మలుచుకోదగ్గ కథలెన్నో ఉన్నాయి! 

వీరు మాత్రమే కాదు.. వీరు రాసినవి మాత్రమే కాదు.. కొమ్మూరి వేణుగోపాలరావు ‘పెంకుటిల్లు’ దగ్గరతో మొదలుపెడితే.. ఎన్నో సజీవమైన సబ్జెక్టులున్నాయి. ఉత్సాహవంతులు ఈ విషయంలో దూసుకుపోతున్నారు. ఆ మధ్య తిలక్ రాసిన కథ ‘ఊరి చివరి ఇల్లు’ ఆధారంగా నరసింహ నంది ఒక సినిమా కూడా చేసినట్టున్నాడు. ఇంద్రగంటి మోహన కృష్ణ రూపొందించిన ‘గ్రహణం’ కూడా తెలుగు భాష సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన చలం కథల్లో ఒకటి. రావి శాస్త్రి ‘‘ఆరు సారాకథలు’ ఆధారంగా కూడా ఒక సినిమా వచ్చినట్టుంది. పాత్రికేయుడు, రచయిత పతంజలి నవలల్లో ఒకటైన ‘మేరా భారత్ మహాన్’ను ‘ఇదీ సంగతి’గా రూపొందించారు. శోధించే తీరిక ఉండాలి కానీ.. తెలుగు నవలల నుంచి చక్కటి కథనో, మూలకథనో సిద్ధం చేసుకోవడం ఏ మాత్రం కష్టం కాదు! అయితే.. అలా తయారు చేసుకున్నప్పుడు వాటి రచయితలకు క్రెడిట్ ఇవ్వడం కూడా నైతిక బాధ్యత. మర్చిపోయాం అని మాత్రం అనొద్దు! 

Show comments