వయసు 84....ఇంకా అనుభవించాలా?

ఎన్టీ రామారావు పాత సినిమాలో 'అనుభవించు రాజా...అనుభవించు రాజా..నువు పుట్టింది పెరిగింది ఎందుకూ అందుకే...అనుభవించు రాజా'...అనే పాట ఉంది. ఇది రాజకీయ నాయకులకు బాగా సరిపోతుంది. వారు పుట్టింది, పెరిగింది ఎందుకో తెలియదుగాని రాజకీయాల్లోకి వచ్చింది మాత్రం పదవులు అనుభవించడానికే, పెత్తనం చెలాయించడానికే, వీలైనంత సంపాదించుకోవడానికే.  పదవులను ప్రజాసేవకు ఉపయోగించేవారు చాలా తక్కువ. వీళ్లెవరో ప్రజలకు అంతగా తెలియదు. మన దేశంలో ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ విరమణ వయసుందిగాని ప్రభుత్వాలను నడిపే, చట్టాలు చేసే నాయకులకు లేదు. అమెరికాలో అధ్యక్ష పదవికి రెండుసార్లకు మించి పోటీ చేయకూడదనే నిబంధన ఉంది. కాని మన దేశంలో కింది నుంచి పై పదవి వరకు అంటే సర్పంచ్‌ మొదలు ప్రధాని, రాష్ట్రపతి వరకు ఏ పదవికి కూడా 'ఇన్ని సార్లే' అని నిబంధన లేదు. దీంతో కాటికి కాళ్లు చాపుకున్న నాయకులు కూడా పదవుల కోసం అల్లాడుతుంటారు. పదవి దొరకుతుందంటే చాలు ఎంతకైనా దిగజారుతారు.

     
రాజకీయాల్లోకి వచ్చేవారు మడి కట్టుకొని కూర్చోవడానికి రారు. పదవుల కోసమే వస్తారు. ఇది తప్పనలేం. కాని వందేళ్లకు దగ్గరవుతున్న వయసులోనూ కొందరు పదవుల కోసం అల్లాడిపోతుంటారు. అప్పటికే జీవితంలో ఎన్నో పదవులు అనుభవించి ఉన్నప్పటికీ ఫలాన పదవి దక్కలేదని దిగులు పడతారు. తెలంగాణకు చెందిన ఓ కాంగ్రెసు నాయకుడు కన్నుమూసేవరకు రాష్ట్రపతి పదవి గురించి కలవరించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి గవర్నరుగా, ఉప రాష్ట్రపతిగా చేసిన ఓ కాంగ్రెసు నాయకుడు కూడా రాష్ట్రపతి పదవిపై ఆశలు పెట్టుకొని ఆ దిగులుతోనే పోయారు. ఇలాంటివారు అనేకమంది ఉండొచ్చు. దేశంలోని రాజకీయ నాయకుల్లో ఎనభై ఏళ్లు దాటిన చాలామంది నాయకులు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ఇలాంటివారు ఆరోగ్యంగానే ఉన్నాం కాబట్టి పదవి దొరికితే చేద్దామనుకుంటారు. ఆ వయసులోనూ ఏదైనా పదవి దానంతట అది వచ్చి ఒళ్లో వాలితే చేయడంలో తప్పు లేదు. కాని అందుకోసం విలువలను వదిలేసి దిగజారితేనే అసహ్యం పుడుతుంది. దేశంలోని సీనియర్‌ నాయకుల్లో ఒకరు, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్రంలో కీలక మంత్రి పదవులు నిర్వహించినవాడు, గవర్నర్‌గా చేసినవారు 90 ఏళ్లకు దగ్గరగా వస్తున్న ఓ దక్షిణాది నాయకుడు మీడియాకు హాట్‌ టాపిక్‌గా మారాడు.

ఆయనే కర్నాటక మాజీ ముఖ్యమంత్రి 84 ఏళ్ల ఎస్‌ఎం కృష్ణ. 1968 నుంచి కాంగ్రెసు పార్టీలో కొనసాగుతున్న సోమనహళ్లి మల్లయ్య (ఎస్‌ఎం) కృష్ణ నెల రోజుల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ముహూర్తం ఖరారు కావాలంతే. ఇంత లేటు వయసులో ఈ ఘాటు నిర్ణయానికి కారణం ఏమిటంటే 'నా ఆత్మ గౌరవం దెబ్బ తిన్నది' అనేది ఆయన జవాబు. 'ఎంతో సీనియర్‌ని అయిన నన్ను పార్టీలో పక్కన పెట్టేశారు' ఇదీ ఆయన ఆరోపణ. ప్రతి పార్టీలో ఇలాంటి ఆరోపణలు చేసే, అసంతృప్తి వ్యక్తం చేసే నాయకులుంటారు. వయసు బాగా మీద పడిన కొందరు నాయకులను పక్కకు పెట్టడం ప్రతి పార్టీలోనూ జరుగుతూనే ఉంటుంది. వాస్తవానికి అప్పటికే వారు చాలా పదవులు అనుభవించి ఉంటారు. కాబట్టి కొత్త నీరు రావడం కోసం పాత నీరును పక్కకు పెడతారు. ఈ వాస్తవం తెలిసిన కొందరు తమకు తామే గౌరవంగా తప్పుకొని శేష జీవితాన్ని ఇతర వ్యాపకాలతో గడుపుతారు. కాని కొందరు కాటికి కాళ్లు చాపుకున్న వయసులోనూ పార్టీలు మారతారు. ఈ కోవలోకే చేరారు ఎస్‌ఎం కృష్ణ. ఆయన రాజకీయ ప్రస్థానం తక్కువది కాదు. కాంగ్రెసు పార్టీ చాలా ఇచ్చింది. ప్రజా సోషలిస్టు పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించిన ఈ నాయకుడు కాంగ్రెసులో చేరాక 1968 నుంచి నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

ఒకసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ మంత్రివర్గాల్లో పనిచేశారు. పలుమార్లు కర్నాటకలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. స్పీకరుగా, ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. 1999లో ఈయన కర్నాటక కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ముఖ్యమంత్రి అయ్యారు. మహారాష్ట్ర గవర్నరుగా పనిచేశారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా చేశారు. కాంగ్రెసు పార్టీ ఈయన్ని గౌరవించి ఇన్ని పదవులు ఇచ్చింది. 2012లో కృష్ణ విదేశాంగ  మంత్రి పదవికి రాజీనామా చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. విదేశాంగ మంత్రిగా తనను బలవంతంగా తప్పించారని, ఆ తరువాత పక్కకు పెట్టారని కృష్ణ ఆరోపణ. అయితే ఎందుకు తప్పించారో సరైన కారణం తెలియదు. అనారోగ్య సమస్యలున్నాయని కొందరంటే, ఆరోపణలు వచ్చాయని కొందరన్నారు. ఇప్పుడు కృష్ణ ఈ లేటు వయసులో బీజేపీలోకి ఎందుకు వెళుతున్నారో తెలియదు. కాలక్షేపం కోసం కాదు. ఏం పదవి కోసం హామీ లభించిందో...!                               
-మేనా

Show comments