సినిమా రివ్యూ: మజ్ను

రివ్యూ: మజ్ను
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కెవా మూవీస్‌
తారాగణం: నాని, అను ఎమాన్యుయెల్‌, ప్రియ శ్రీ, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, సత్య, పోసాని కృష్ణమురళి, రాజ్‌ తరుణ్‌ (ప్రత్యేక పాత్రలో) తదితరులు
సంగీతం: గోపి సుందర్‌
కూర్పు: ప్రవీణ్‌ పుడి
ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌.
నిర్మాతలు: పి. కిరణ్‌, గీత గోళ్ల
కథ, కథనం, దర్శకత్వం: విరించి వర్మ
విడుదల తేదీ: సెప్టెంబరు 23, 2016

నాని ఇప్పుడున్న ఫామ్‌లో ఒక మామూలు సినిమాని కూడా ఎంజాయ్‌ చేసేట్టు చేయగలడు. 'మజ్ను'లో 'కృష్ణగాడి వీర ప్రేమగాథ', 'జెంటిల్‌మన్‌'ల్లో ఉన్నంత కంటెంట్‌ లేదు, కానీ మజ్నుని ఏ ఇబ్బంది లేకుండా ఓసారి చూసేస్తామంటే కారణం మాత్రం నానినే. విరించి వర్మ రాసుకున్న ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ అనాదిగా చాలా సినిమాల్లో చూస్తూ వస్తున్నదే. రొటీన్‌ వ్యవహారాన్ని కూడా కొత్తగా చెప్పవచ్చు. దర్శకుడు అలాంటి కొత్తదనం కోసం ప్రత్యేక శ్రద్ధ ఏం పెట్టలేదు. తన కథకి కరక్ట్‌ హీరోని ఎంచుకోవడం, తన కథ విసిగించకుండా వినోదం ఉండేట్టు చూసుకోవడం విషయంలో మాత్రం విరించి సక్సెస్‌ అయ్యాడు. 

ఇద్దరు ప్రేమించుకుని విడిపోవడం, కానీ మళ్లీ కలుద్దామనుకునే సమయంలో పరిస్థితులు అనుకూలించకపోవడం అనేది మజ్ను కథా వస్తువు. ఈ కథ రసకందాయంలో పడే వరకు దర్శకుడు ఏ చిక్కు, చీకు చింత లేకుండా సరదాగా నడిపిస్తూ పోయాడు. కానీ అసలు సంఘర్షణ మొదలయ్యే సమయానికి ముందుకి ఎలా తీసుకెళ్లాలో తెలియని అయోమయానికి గురయ్యాడు. ప్రియ శ్రీకి దగ్గర కావడానికి నాని చేసే ప్రయత్నాలతో సరదాగా మొదలైన మజ్ను, ఆ తర్వాత అతని లవ్‌స్టోరీ ఫ్లాష్‌బ్యాక్‌తో మరింత ప్లెజెంట్‌గా మారుతుంది. ప్రేమించిన అమ్మాయి కోసం లెక్చరర్‌గా మారిన వైనం, ఆ క్రమంలో జరిగే తంతు అంతా వినోదాత్మకంగా ఉంది. 

వీనుల విందైన పాటలు, అద్భుతమైన కెమెరా పనితనం కారణంగా ఆ లవ్‌స్టోరీ మొత్తం చాలా హాయిగా అనిపిస్తుంది. అయితే వాళ్లిద్దరూ విడిపోవడమనే సంఘటన అకస్మాత్తుగా వచ్చి పడిపోతుంది. విడిపోవడానికి సాకు వెతుక్కునట్టు అనిపిస్తుందే తప్ప అదో బలమైన కారణం అనిపించదు. ఎప్పుడైతే విడిపోవడానికి బలమైన కారణం లేదో, వాళ్లిద్దరూ కలవడానికి కూడా పెద్ద సమస్య లేదు. అలాంటప్పుడు ఆ జంట కలవకపోవడానికి ఒక పరిస్థితి సృష్టించినా కానీ కలవకుండా ఉంటారని అనుమానం ఉండడానికేం లేదు. దీంతో మజ్ను పూర్తిగా ప్రిడిక్టబుల్‌ అయిపోయింది. ఎక్కడో ఒక చోట రెండో హీరోయిన్‌ త్యాగం చేయాల్సి వస్తుందనేది తెలిసిపోతూనే ఉంటుంది కనుక, మధ్యలో దర్శకుడు చేస్తున్నదంతా కాలక్షేపమే అనేది స్పష్టమవుతుంది. 

కథలో బలం తగ్గిన టైమ్‌లో విరించి వర్మ తెలివిగా త్రివిక్రమ్‌ టెక్నిక్‌ వాడాడు. కొత్త పాత్రలని ఇంట్రడ్యూస్‌ చేసి కథ గురించి కంప్లయింట్స్‌ లేకుండా చేయడం త్రివిక్రమ్‌ ఎక్కువగా ఫాలో అవుతుంటాడు. అలాగే సెకండ్‌ హాఫ్‌లో వెన్నెల కిషోర్‌తో కాసేపు టైమ్‌ పాస్‌ చేయించి, ఆ తర్వాత రాజ్‌ తరుణ్‌ని ఇంట్రడ్యూస్‌ చేసి కాన్‌ఫ్లిక్ట్‌ని కాస్త స్ట్రాంగ్‌గా మార్చడానికి దర్శకుడు ట్రై చేశాడు. వీటి వల్ల ఖచ్చితంగా కొంత ప్రయోజనం జరిగింది. ఇక సాధారణ సన్నివేశాల్లో, అసలు నటించడానికి పెద్దగా అవకాశమే లేని సందర్భాల్లో కూడా నాని అక్కరకు వచ్చాడు. అతని నేచురల్‌ టాలెంట్‌ 'మజ్ను' చిత్రానికి అతి పెద్ద బోనస్‌ అయింది. 

ఉదాహరణకి కీలకమైన పతాక సన్నివేశాలని పేలవంగా తేల్చేసిన తర్వాత ట్రెయిన్‌ ఎపిసోడ్‌లో నాని నటన, అతని కామెడీ టైమింగ్‌, రాజమౌళితో ఫోన్‌ కాన్వర్‌జేషన్‌ వగైరా సరిగ్గా థియేటర్‌ బయటకి వచ్చే ముందు పెదాలపై చిరునవ్వు నిలిచేట్టు చేస్తాయి. ఒక ఆర్డినరీ స్క్రిప్ట్‌ని ఇలా నిలబెట్టడం మామూలు నటుల వల్ల అయ్యే పని కాదు. కాకపోతే నాని ఈమధ్య ఎంచుకుంటోన్న కథల వల్ల అతడు ఇలాంటి మామూలు కథకి ఓకే చెప్పడమే ఒకింత ఆశ్చర్య పరుస్తుంది. 

హీరోయిన్లు అంత ఇంప్రెసివ్‌గా లేరు. సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌లో సత్య, వెన్నెల కిషోర్‌ రాణించారు. రాజ్‌ తరుణ్‌కి ఎలాంటి ప్రత్యేకతలు లేని సాధారణ పాత్రనిచ్చారు. తొలి సినిమా దర్శకుడి కోసం చేసినట్టున్నాడు. కానీ అతని ప్రెజెన్స్‌ ఈ చిత్రానికి ఖచ్చితంగా హెల్ప్‌ అయింది. డైలాగ్స్‌ బాగున్నాయి. విజువల్‌గా రిచ్‌గా అనిపించింది. ఓవరాల్‌గా మజ్నుకి మళ్లీ మళ్లీ చూసే ప్రత్యేక లక్షణాలేం లేకపోయినప్పటికీ ఒకసారి చూడడానికి అంతగా ఇబ్బంది పెట్టిన సమస్యలూ ఏం లేవు. సరదాగా సాగిపోయే లైట్‌ హార్టెడ్‌ సినిమానే కనుక కమర్షియల్‌గా పాస్‌ అయిపోవడానికి కూడా అడ్డంకులేం ఎదురు కాకపోవచ్చు. 

బోటమ్‌ లైన్‌: రొటీనే కానీ... టైమ్‌పాస్‌ గ్యారెంటీ!

- గణేష్‌ రావూరి

//twitter.com/ganeshravuri

Show comments