ఎక్స్ క్లూజివ్-మహేష్ బ్యానర్ పై వెబ్ సిరీస్

రాను రాను ట్రెండ్ మారుతోంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రయిమ్, జియో అన్నీ మన జనాలకు కూడా అలవాటు పడుతున్నాయి. అంది వస్తున్న ఈ వ్యాపార అవకాశాలను అందరూ అందిపుచ్చుకుంటున్నారు. మంచి వ్యాపార లక్షణాలు వున్న నమ్రత కూడా ఇప్పుడు వెబ్ సిరీస్ లోకి దిగినట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యవహారాలు అన్నీ దాదాపుగా నమ్రతనే చూసుకుంటారన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మహేష్ బాబు స్వంత బ్యానర్ జిఎమ్బీ కూడా స్టార్ట్ అయింది. 

ఈ బ్యానర్ ను సినిమా సమర్పణకు వాడుతున్నారు. ఇప్పుడు ఇదే బ్యానర్ మీద వెబ్ సిరీస్ లు చేయడానికి నమ్రత రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ వెబ్ సిరీస్ నిర్మాణం ప్రారంభమైంది. దేశంలోని టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్న జియో సంస్థ కోసం ఈ వెబ్ సిరీస్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 

అంతేకాదు, మరిన్ని వెబ్ సిరిస్ లు, మినీ మూవీస్ లాంటివి చేయడానికి యంగ్ టాలెంట్ కోసం నమ్రత అన్వేషిస్తున్నారు. సరైన టాలెంట్ వున్న కొత్త డైరక్టర్లు కానీ, ఒకటి రెండు సినిమాలు చేసినవారు కానీ, మంచి ప్రాజెక్టులతో వస్తే టేకప్ చేసే ఉద్దేశంతో నమ్రత వున్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా.