ప్రజాస్వామ్యంలో ఈ బెదిరింపులేమిటి.?

అధికారంలో నా చేతిలో వుంది గనుక.. నేనేం చేసినా చెల్లుతుంది.. అని ఎవరనుకున్నా, అది మూర్ఖత్వమే అవుతుంది. ఏ పార్టీకి అయినా ప్రజలు అధికారమిచ్చేది ఐదేళ్ళు మాత్రమే. ఐదేళ్ళ తర్వాత అదే పార్టీకి తిరిగి అధికారం కట్టబెట్టాలా.? వద్దా.? అన్నదాని విషయమై ప్రజలే నిర్ణయించుకుంటారు. రెండో దఫా అధికారం దక్కడం, మూడోసారీ అధికార పీఠమెక్కడం చాలా అరుదుగా జరిగే విషయం మాత్రమే. 

ఐదేళ్ళలో విపక్షాల్ని నిర్వీర్యం చేసేస్తే, ఇంకోసారి తమకే అధికారం దక్కుతుందని రాజకీయ కుట్రలు ఎవరు పన్నినాసరే కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విస్మరించడం అత్యంత హాస్యాస్పదమైన విషయం. కేసీఆర్‌ అనే కాదు, చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు కూడా ఇక్కడ ఆక్షేపణీయం. ఆ మాటకొస్తే దేశంలో రాజకీయ వ్యవస్థకు ఇప్పుడేదో చీడ పట్టిందని అన్పించకమానదు.. పాలకుల తీరు అలా తగలడింది. 

రాజకీయాలన్నాక ఆరోపణలు సహజం. ఇప్పుడంటే టీఆర్‌ఎస్‌ అధికారంలో వుండి నీతులు చెబుతోందిగానీ, గతంలో విపక్షంలో వున్నప్పుడు టీఆర్‌ఎస్‌ చేసిన రాజకీయ ఆరోపణ సంగతేంటట. అప్పుడలా వ్యవహరించి, ఇప్పుడిలా అధికారంలోకి వచ్చాక, 'అసత్య ఆరోపణలు చేస్తే న్యాయపరమైన చర్యలు..' అంటూ విపక్షాల్ని హెచ్చరించడాన్ని ఏమనుకోవాలా.? అధికార పార్టీలు ఇలా హెచ్చరిస్తూ పోతోంటే, విపక్షాలు దుకాణం సర్దేసుకోవాలేమో.! 

'కేసులు' రాజకీయ నాయకులకు కొత్త కాదు. ఆ విషయం అందరికన్నా బాగా కేసీఆర్‌కే తెలుసు. 'మేం అధికారంలోకి వచ్చాక ఉద్యమ కేసుల్ని ఎత్తేస్తాం..' అని ఘనంగా ప్రకటించిన వ్యక్తి ఆయన. కాబట్టి, ఇప్పుడు కేసీఆర్‌ కేసులు పెడితే, రేప్పొద్దున్న ఇంకో ప్రభుత్వం వచ్చాక ఆ కేసులు వీగిపోవడం పెద్ద విషయమేమీ కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తానున్నానని, ప్రజలకు సేవకుడినన్న విషయాన్ని మర్చిపోయి, రాచరికపు రోజుల్ని కేసీఆర్‌ గుర్తుకు తెస్తున్నారు. మూడేళ్ళకే 'తొండ ముదిరి ఊసరవెల్లి' అన్న చందాన తయారైతే.. భవిష్యత్‌ ఇంకెలా వుంటుందో ఏమో.!

కొసమెరుపు: అసత్యాలు చెప్పినట్లు నిరూపిస్తే, క్షణాల్లో రాజీనామా చేస్తానని ప్రకటించేశారు కేసీఆర్. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పిన కేసీఆర్, రాజీనామా చేస్తానని చెప్పినా.. ఆ మాటకి కట్టుబడి వుంటారని ఎవరు నమ్ముతారు గనక.?

Show comments