అడ్డదోవలో కట్టబెట్టే కక్కుర్తి!

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. అసలు అధికార్లతో సమీక్షలు కూడా నిర్వహించడానికి వీల్లేదంటూ ఒకవైపు నిబంధనలు సూటిగా చెబుతుండగా... ఏకంగా నియామకాలే చేపట్టేస్తే.. ఇక అలాంటి ప్రభుత్వపు బరితెగింపు గురించి ఏమనుకోవాలి? చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రస్తుతం అంతే లెక్కలేనితనంతో వ్యవహరిస్తోంది. ప్రభుత్వ పరిపాలనలో మామూలు అధికారాలు కూడా లేని ప్రస్తుత సమయంలో.. ఏకంగా సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకం వంటి కీలక నిర్ణయం తీసుకోవడం ద్వారా మరో వివాదానికి ఆజ్యంపోసింది.

సహ చట్టం కమిషనర్ల నియామకానికి సంబంధించిన వ్యవహారం కొన్ని సంవత్సరాలుగా పెండింగులో ఉంది. కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వడం అంటేనే... అక్కడికేదో తన సొంత ఆస్తిని తవ్వి పెట్టేస్తున్నట్లుగా సంకోచిస్తూ ఉండే అలవాటున్న చంద్రబాబునాయుడు... సహచట్టం కమిషనర్ల నియామకం విషయంలోనూ ఇంచుమించు అదేతీరుగా వ్యవహరించారు. కాకపోతే.. ఇక్కడ మరోఅడుగు ముందుకేసి... రాజకీయాలకు అతీతంగా ఉండవలసిన ఈ నియామకాలను పచ్చ పార్టీ తైనాతీలతో నింపే ప్రయత్నం చేయడం కూడా ఇప్పుడు వివాదం అవుతోంది.

తెలుగుదేశం పార్టీ భజన చేస్తున్నందుకు ఇద్దరిని ఆర్టీఐ కమిషనర్ పదవులు వరించాయి. విజయవాడలో హోటల్ యజమాని ఐలాపురం రాజా, విద్యాశాఖ మంత్రికి ప్రెవేటు కార్యదర్శిగా ఉన్న శ్రీరామమూర్తి ఈ పదవుల్లోకి నియమితులయ్యారు. ఆర్టీఐ కమిషనర్ అంటే ఇంచుమించుగా చీఫ్ సెక్రటరీకి సమానమైన హోదాతో ఆరేళ్లపాటు ఉండే పదవి. వీరికి సకల ప్రోటోకాల్ రాజభోగాలుంటాయి. అయితే ఈ నియామకాలు నాలుగేళ్లుగా ఖాళీగా ఉన్నా చంద్రబాబునాయుడు పట్టించుకోలేదు.

ఈ పోస్టుల నియామకాల్లో అనుసరించాల్సిన ప్రక్రియను కూడా సరిగ్గా పాటించలేదు. తీరా పదవీకాలం ముగిసిపోతున్న ప్రస్తుత తరుణంలో.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో... రాజకీయ పదవుల్లాగా వీటిని పంచిపెట్టేశారు. రాజకీయ, అధికార పదవులకు పచ్చరంగు పులమడంలో ఆరితేరిపోయిన చంద్రబాబునాయుడు, ఆర్టీఐ వంటి స్వతంత్ర ప్రతిపత్తితో వ్యవహరించాల్సిన వ్యవస్థలను కూడా వివాదాల మయం చేయడానికి బరితెగిస్తున్నారని ఇప్పుడు గగ్గోలు పుడుతోంది. మరి ఈ వివాదం ఎలాటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.

మహర్షి ఒడిదుడుకుల ప్రయాణం!

Show comments