హస్తిన పెద్దల అహంకారానికి ఇది నిదర్శనం!

ఏపీలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ రెండు పార్టీలతోనూ సమానదూరం పాటించాలని బిజెపి నిర్ణయించింది. పవన్ కల్యాణ్ తో మాత్రం పొత్తు కొనసాగుతుందని కూడా ప్రకటించింది. నిజానికి ఈ రెండు ప్రకటనలు పరస్పర విరుద్ధమైన విషయాలు. వీటికి పొంతన కుదరదు. కానీ బిజెపి వైఖరిని జాగ్రత్తగా గమనిస్తే.. ఒకటో విషయానికే వారి ప్రాధాన్యం ఎక్కువ అనే సంగతి మనకు బోధపడుతుంది. ఆ మిష మీద పవన్ ను వదిలించుకుని రాష్ట్రమంతా ఒంటరిగా పోటీచేయాలనే కోరిక కమలదళానికి ఉంది. 

చిరంజీవిని అప్పట్లో వైఎస్సార్ మింగేసినట్లుగా పవన్ కల్యాణ్ రాజకీయ కెరీర్ ను కూడా చంద్రబాబునాయుడు మింగేస్తాడనే వ్యాఖ్యల ద్వారా.. తమ ఆలోచనలను కమలనాయకులు బయటపెట్టుకున్నారు. అయితే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా ఢిల్లీ పెద్దల సూచలను, మార్గదర్శకాల్లో వారి అహంకారం బాగా కనిపిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు. 

రాష్ట్రంలో పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లే ఆలోచన అక్కర్లేదని హైకమాండ్ అనడం వరకు ఓకే. కానీ, ఆ సందర్భంగా వారు మరో మాట కూడా అన్నారు. దేశం మొత్తం మోడీ వైపు సానుకూలంగా చూస్తోంటే, ఏపీ మాత్రం ఎందుకు చూడదు. అక్కడ కూడా మనం ఒంటరిగానే లాభపడతాం అనేది ఢిల్లీ సందేశంగా సమావేశానికి అందింది. సరైన ప్రతిపక్షాలు లేక దేశవ్యాప్తంగా మోడీకి వారు చెబుతున్నట్టుగా సానుకూల పవనాలు కనిపించవచ్చు గాక. కానీ ఏపీ సంగతి వేరు. అందరిలా ఏపీ ప్రజలు కూడా మోడీని దేవుడిగా కొలవాలని కమల నాయకులు ఆశించవచ్చు.. కానీ అది అసాధ్యం. ఎందుకంటే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చేసినంత ద్రోహం ఈ తొమ్మిదేళ్ల పాలన కాలంలో మోడీ మరే ఇతర రాష్ట్రానికీ తలపెట్టలేదంటే అతిశయోక్తి కాదు. 

ఏపీకి ప్రత్యేకంగా ఒక్కటంటే ఒక్క మేలు చేయలేదు సరికదా.. చట్టబద్ధంగా రాష్ట్రానికి హక్కుగా దక్కవలసిన అనేక అంశాలను కూడా ఆయన ఇవ్వకుండా వంచించారు. రాష్ట్ర విభజనతో అనాథగా కుమిలిపోయిన ఏపీ ప్రజలు ప్రత్యేకహోదా మీద ఎన్నో కలలు పెట్టుకుంటే.. అయిదు కాదు పదేళ్లు ఇస్తానన్న మోడీ మాటలను వారు నమ్మితే.. ఆ విషయంలో దారుణంగా మోసం చేశారు. 

హోదా ఇవ్వకుండా, కనీసం విభజన చట్టంలోని ఇతర సమస్యలను పరిష్కరించకుండా, ఏపీలోని వెనుకబడిన ప్రాంతాల అభ్యున్నతికి ప్యాకేజీలు కూడా ఇవ్వకుండా అన్ని రకాలుగానూ వంచించారు. ఇవేవీ కూడా తెలుగు ప్రజలు కొన్ని శతాబ్దాలు గడచినా మరచిపోయే మోసాలు కావు. ఇన్ని వంచనలకు పాల్పడి కూడా.. ‘ఏపీ మాత్రం మోడీ పట్ల ఎందుకు సానుకూలంగా చూడదు’ అని తలపోయడం బిజెపి పెద్దల అహంకారంగా కనిపిస్తోంది. 

ఏపీలో తమ ఓటు శాతం పెంచుకోవడం తప్ప.. ఎవరు గెలుస్తారు? రాజకీయంగా అభివృద్ధిపరంగా రాష్ట్రం ఏమవుతుంది? అనే అంశాలు బిజెపికి ఎప్పటికీ పట్టవు. కానీ, ఇదేమాదిరి అహంకారం ప్రదర్శిస్తే వారికి ఎప్పటికీ ఈ రాష్ట్రంలో మనుగడ ఉండదు.

Show comments