ఇంకెన్నాళ్లు భ్రమల్లో బతకమంటావ్ బాబూ..?

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత అమరావతి ఉద్యమంలో కదలిక మొదలైంది. అదే సమయంలో అమరావతి ఉద్యమ శిబిరంలో చంద్రబాబుకి గట్టి వ్యతిరేకత కూడా ఎదురైందని సమాచారం. 

సమావేశాల ముందు సహచరులతో కలసి చిత్ర విచిత్రాలుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న చంద్రబాబు, అమరావతి విషయాన్ని ఎందుకు గాలికొదిలేశారని కొంతమంది రైతులు ప్రశ్నిస్తున్నారట.

తప్పో ఒప్పో.. అమరావతిపై స్థిర నిర్ణయంతో ఉన్న జగనే కాస్త మేలని, ఉద్యమాన్ని మొదలు పెట్టేలా చేసి మధ్యలో వదిలేసి పారిపోయిన బాబు మరింత ప్రమాదకారి అనే డైలాగులు కూడా వినిపించాయట.

రెండు రోజుల క్రితం అమరావతి శిబిరంలో వచ్చిన ఈ చర్చను ఎవరో చంద్రబాబుకి మోసేశారు. దీంతో బాబు హడావిడిగా అమరావతి రైతుల శిబిరం వద్దకు వెళ్లి వారికి మరోసారి భ్రమరావతి సినిమా చూపించారు. 

మీకేం ధైర్యం లేదు, మేమున్నాం, పోరాడితే పోయేదేమీ లేదు, చరిత్రలో నిలిచిపోతారు, ఏడాదిపైగా సాగిన ఉద్యమం ఏ దేశంలోనూ లేదు, ఇతర దేశాలవారికి కూడా అమరావతి ఉద్యమకారులే ఆదర్శం అంటూ బాగా గాలికొట్టి వచ్చారు.

వాస్తవానికి చంద్రబాబు అమరావతి అంశాన్ని వదిలేసి చాలా కాలం అయింది. అమరావతి అంశాన్ని పట్టుకున్నంత కాలం ఇతర ప్రాంతాల్లో పార్టీ పలుచన అవుతుందనే అనుమానం రావడంతో బాబు అమరావతిని అటకెక్కించారు. భార్య చేతి బంగారు గాజులు విరాళంగా ఇచ్చి, జోలెపట్టి ఊరూరా తిరిగే అమరావతి యాత్రను మధ్యలోనే ఆపేశారు.

ఆ తర్వాత అమరావతి అనే మాట కూడా ఎక్కడా మాట్లాడలేదు. కోర్టులో కేసులు వేయించి తమాషా చూస్తున్నారు. అంటే అమరావతిపై కోర్టు తీర్పు ఎలా వచ్చినా బాబు దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారనమాట. 

మూడు రాజధానుల ప్రస్తావన వస్తే, విశాఖను అభివృద్ధి చేసింది మేమే, హుద్ హుద్ ని ఆపింది మేమే అంటారు. పట్టిసీమతో రాయలసీమను సస్యశ్యామలం చేసింది కూడా మేనేనంటారు, పరిశ్రమలతో రాయలసీమకు ఉద్యోగాలిప్పించామని ఊదరగొడతారు.

రాజధానుల విషయంలో కూడా బాబు తన రెండు నాల్కల ధోరణిని వదిలిపెట్టలేదు. ఈ విషయం తెలిసే అమరావతి రైతు శిబిరంలో బాబుపై వ్యతిరేకత వచ్చింది. దాన్ని మొగ్గలో తుంచేందుకే చంద్రబాబు చాన్నాళ్ల తర్వాత ఆందోళన శిబిరానికి వెళ్లి రైతుల్ని ఊరడించారు. వారినింకా భ్రమల్లోనే బతికేలా జోకొట్టి వచ్చారు. 

చంద్రబాబు మీద కోపంతో అమూల్‌ను‌ తేలేదు

Show comments