పందేరం మొదలైంది.. గెట్ రెడీ...!

రాష్ట్రంలో పదవుల పందేరానికి జగన్ తెర తీశారు. మూడు ప్రధాన ఆలయాలకు పాలకవర్గాలను నియమించారు. రాష్ట్రంలోని విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి, సింహాచలం వరాహలక్ష్మీనరసింహస్వామి, ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాలకు పాలకవర్గాల నియామకం పూర్తయింది. జగన్ అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలల్లో.. తిరుమల తిరుపతి దేవస్థానాలకు తప్ప.. మిగిలిన ఏ ఆలయానికి ఇప్పటిదాకా ట్రస్టు బోర్డులను వేయలేదు. మొదటిసారిగా మూడు ఆలయాలకు వేయడంతో.. ఇంకా నామినేటెడ్ పోస్టులను ఆశించే ద్వితీయ శ్రేణి నాయకులంతా గేరప్ అవుతున్నారు. తమ తమ ప్రయత్నాలు మొదలు పెట్టుకుంటున్నారు.

జగన్ ముఖ్యమంత్రి అయిన నాటినుంచి.. ద్వితీయ శ్రేణి నాయకులు నామినేటెడ్ పోస్టులకోసం ఎదురుచూడడం మొదలైంది. దానికి తగ్గట్టుగానే పదవిలోకి వచ్చిన వెంటనే ఎలాంటి తాత్సారం లేకుండా టీటీడీ బోర్డు ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమించేసి.. చంద్రబాబు లాగా తాను పదవులు ఎవ్వరికీ పంచకుండా.. మురగబెట్టే అలవాటు లేదని జగన్ చాటుకున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ముడి ఉండడంతో.. అన్ని రకాల నామినేటెడ్ పోస్టులకు సంబంధించి చురుగ్గా దృష్టి పెట్టలేదు.

స్థానిక సంస్థల ఎన్నికలు, పురపాలక ఎన్నికలు ముగిసేదాకా నామినేటెడ్ పోస్టులు పంచేది లేదని జగన్ ముందుగానే ఆశావహులకు తేల్చిచెప్పారు. దాంతో అందరూ కూడా ఆ పర్వం ముగిసేదాకా ఆగాల్సిందేనని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు దాదాపుగా పూర్తియినా, కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చే దాకా ఆగాల్సిన పరిస్థితి. దాంతో ఎప్పుడు ఆ ఎన్నికలు పూర్తవుతాయో తెలియడం లేదు. ఇంతకంటె జాప్యం అనవసరం అనుకున్న జగన్మోహన రెడ్డి.. మూడు ఆలయాలకు పాలకవర్గాలను వేసేశారు.

అంటే.. ఇక నామినేటెడ్ పదవుల పందేరం మీద ప్రభుత్వం దృష్టి పెట్టిందనడానికి ఇది సంకేతం. దీంతో.. మిగిలిన అనేక ఆలయాలు, ఇతరత్రా రాష్ట్రస్థాయిలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవుల కోసం ఆశలు పెంచుకున్న వారంతా ఇప్పుడు అమరావతిలో తేలుతున్నారు. ప్రభుత్వంలోని పెద్దలను జగన్ కు సూచన మాత్రంగా తమ అర్హతలను చెప్పగలవారిని ఆశ్రయిస్తున్నారు. పదవులు దక్కించుకోవడానికి తమ పాట్లు తాము పడుతున్నారు.

Show comments