అద్భుత రాజధాని వెనక వినాశనం...!

ఒక మేలు జరగాలంటే ఒక కీడు జరగాల్సిందేనా? ఒక కొత్త సృష్టి జరగాలంటే ఇప్పుడున్న సృష్టి సర్వనాశనం కావల్సిందేనా? ఇలా కీడు, నష్టం జరక్కుండా ప్రత్యామ్నాయ మార్గాలుండవా? ఆలోచిస్తే సవాలక్ష మార్గాలుండొచ్చు. కాని ఆలోచించనివారు ఏది సర్వనాశనమైనా తమ ప్రయోజనాలే నెరవేరాలనుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కోవలోకే వస్తారు. ఆయన అద్భుత రాజధాని అమరావతి గురించి కలలు కంటున్నారుగాని భావి తరాలకు జరిగే నష్టం గురించి ఆలోచించడంలేదనిపిస్తోంది. అద్భుత రాజధాని పేరుతో ఆయన ఆంధ్రప్రజలకు కీడు చేస్తున్నారో, మేలు చేస్తున్నారో కాలం గడిచిన కొద్దీ తెలుస్తుంది. 

అంటే రాజధాని నిర్మించనక్కర్లేదా? అని కొందరు ఆగ్రహించవచ్చు. వద్దని ఎవ్వరూ చెప్పరు. కాని వినాశనం జరక్కుండా రాజధాని నగరం నిర్మాణం కాదా? అలాంటి అవకాశాలు లేవా? రాజధాని నిర్మాణం కోసం భవిష్యత్తు తరాల ప్రయోజనాలు బలి కావల్సిందేనా?...కొందరు ఇలాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు. చంద్రబాబు కృష్ణా, గుంటూరు ప్రాంతంలో రాజధాని నిర్మాణాన్ని ప్రతిపాదించినప్పుడే అనేకమంది మేధావులు, సామాజికవేత్తలు పలు ప్రశ్నలు సంధించారు. అభ్యంతరాలు లేవదీశారు. ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన భూముల్లో రాజధాని నిర్మాణం వద్దన్నారు. 

ప్రభుత్వ భూముల్లో రాజధాని నిర్మించుకోవచ్చని వైఎస్సార్‌సీపీ సూచించింది. రాజధాని నిర్మాణం విషయంలో సర్కారు శివరామకృష్ణన్‌ కమిటీ సూచనలను బేఖాతరు చేసింది. సరే....కారణాలు, ప్రయోజనాలేవైనా చంద్రబాబు అనుకున్న చోటనే రాజధాని నిర్మాణం కాబోతోంది. ఇది ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు చెప్పలేం. ప్రభుత్వ సేకరించిన భూమి 34, 184 ఎకరాలు. రాజధానికి ఇంత భూమి అవసరమా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అది వేరే సంగతి. సేకరించిన భూమిలో 21 వేల ఎకరాలు సుభిక్షమైన, సారవంతమైన భూమి. కాని ఈ భూమి సరిపోదని ప్రభుత్వం అభిప్రాయం. మరో 5,571 ఎకరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తోంది. 

చిల్లరమల్లర కలుపుకొని 40 వేల ఎకరాలు. దీంట్లో రాజధాని నిర్మాణం జరుగుతుంది. మరి రాజధాని నిర్మాణం జరగ్గానే రాష్ట్రం అభివృద్ధి కాదు కదా. అభివృద్ధి కావాలంటే, ప్రజలకు ఉపాధి కల్పించాలంటే పరిశ్రమలు పెట్టాలి. వాటికి భూములు ఇవ్వాలి కదా. పరిశ్రమలకు ఇవ్వడానికి ప్రభుత్వానికి భూములు కనబడటంలేదు. ఏం చేయాలి? ఒక్కటే మార్గం. ప్రకృతి సంపదను నాశనం చేసి పెట్టుబడిదారులకు కట్టబెట్టడమే. భవిష్యత్తు తరాల సంగతి తరువాత. వారి పాట్లు వారు పడతారు. ఇప్పుడైతే పరిశ్రమలు రావాలి. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 35 వేల ఎకరాల్లో ఉన్న దట్టమైన అడవులను తెగనరకడం ఒక్కటే మార్గం. 

పరిశ్రమలు కూడా రాజధాని చుట్టుపక్కలనే ఉండాలి.  'మేం 35 వేల ఎకరాల్లో అడవులను నరికేస్తాం. అనుమతి (డీనోటిఫై) ఇవ్వండి' అని బాబు సర్కారు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు అనేకసార్లు లేఖలు రాసింది. కాని కేంద్ర అడవులు, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ విషయం తేల్చడంలేదు. ఏ ప్రభుత్వమైనా ఒకచోట అడవులు నరికితే మరోచోట అదే విస్తీర్ణంలో అడవులు పెంచాలనే నిబంధన ఉంది. కేంద్రం రాష్ట్రాన్ని ఈ విషయమై అడిగినప్పుడు ప్రకాశం, కడప జిల్లాల్లో అడవులు పెంచుతామంది. కాని కేంద్రం ఎందుకో అడవులను డీనోటిఫై చేయడానికి తాత్సారం చేస్తోంది. 

35 వేల ఎకరాల్లో అడవులను నరకాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పర్యావరణ శాస్త్రవేత్తలు, ప్రకృతి ప్రేమికులు, జంతు ప్రేమికులకు, సామాజికవేత్తలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ అడవుల్లో విలువైన అరుదైన వృక్ష సంపద, జంతుజాలం, పక్షి జాతులు, అనేక వన్యమృగాలున్నాయి. అడవులు నరికేస్తే వృక్ష సంపద నశించడమే కాకుండా, జంతుజాలం, పక్షిజాతులు తీవ్ర ప్రమాదంలో పడతాయి. కొన్ని అంతరించిపోయే ప్రమాదముండగా, అనేకం వేటగాళ్ల బారిన పడతాయి. 

ఇక్కడ అడవులు నరికేసి మరోచోట పెంచుతామంటున్నారు. కాని వన్యమృగాలను, పక్షి జాతులను ఏం చేస్తారు? వాటి మనుగడ ఏమిటి? అడవులు పెంచడం మాటలు చెప్పినంత సులభం కాదు. మళ్లీ 35 వేల ఎకరాల్లో దట్టమైన అరణ్యాలు పెరగాలంటే వందల ఏళ్లు పడుతుంది. మనవాళ్లకు అడవులు నరకడం తెలుసుగాని పెంచడం పట్ల శ్రద్ధ ఉండదు. పచ్చదనం పట్ల మన పాలకులకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అనేకసార్లు నిరూపితమైంది.

Show comments