అంధకార బంధురం... దేశం నేతల భవితవ్యం..!

కాకినాడ వేదికగా కాపునేతల మంతనాలు
బీజేపీ దిశగా కొందరి పయనం
జనసేన మాటెత్తని మాజీలు

తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ వేదికగా తెలుగుదేశం పార్టీకి చెందిన కీలకనేతలు సాగించిన మంతనాలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి కలిగించాయి. తెలుగుదేశం పార్టీకి ఒక్కసారిగా నలుగురు ఎంపీలు ఝలక్‌ ఇవ్వడం... వెనువెంటనే బీజేపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఓ సామాజికవర్గం నేతలు కాకినాడలో భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ అధికారంలో ఉన్నంతవరకూ ఓ వెలుగు వెలిగిన కాపు సామాజికవర్గ నేతలు ప్రత్యేకించి కాకినాడలో సమావేశమయ్యారు. వీరంతా తమ భవిష్యత్‌పై దిగులుతోనే ఈ భేటీ ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం! బోండా ఉమా, జ్యోతుల నెహ్రూ, బండారు మాధవనాయుడు, పంచకర్ల రమేష్‌బాబు, తోట త్రిమూర్తులు వంటి కాపు నేతలందరూ ఈ కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఓ వైపు పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలో ఉండటం, మరోవైపు నలుగురు టీడీపీ ఎంపీలు కమలం గూటికి చేరిన నేపథ్యంలో వీరందరూ సమావేశం కావడం దేశంవర్గాల్లో కలకలం రేపింది.

సదరు నేతలందరూ మూకుమ్మడిగా బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరిగింది. అలాగే సదరు కాపునేతలు ఈ సమావేశంలో జనసేన పార్టీ ఊసే ఎత్తలేదని సమాచారం! పార్టీ మారే అవకాశాలున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేస్తూ భవిష్యత్‌ కార్యాచరణలో భాగంగా కాకినాడలో సమావేశమైనట్టు భేటీలో కూర్చున్న నేతలు పేర్కొన్నారు. ఇదిలావుంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాకినాడలో కాపునేతల భేటీకి వెనుక కారణాలను ఆరాతీశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు తదితరులతో ఈ విషయమై చర్చించినట్టు సమాచారం! అయితే సదరు నేతలు పార్టీని వీడే యోచనలో లేరని చినరాజప్ప అధినేత చంద్రబాబుకు వివరించినట్టు తెలిసింది.

విదేశీ పర్యటన అనంతరం అమరావతి చేరుకున్న చంద్రబాబు దీనిపై ప్రత్యేకించి రాష్ట్రస్థాయి నేతలతో సంప్రదించినట్టు భోగట్టా! ఇదిలావుంటే ఇటీవల అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సభ్యుల సాక్షిగా చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా దేశంనేతలు గుర్తు చేసుకుంటున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు పలువురు తమ పార్టీ నేతలకు టచ్‌లో ఉన్నారని, తాను తలచుకుంటే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తానని జగన్‌ చెప్పడం ఇపుడు ఆయావర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. వైకాపాలోకి రావాలంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి వస్తేనే పరిశీలిస్తామని జగన్‌ స్పష్టం చేయడాన్నీ ఆయావర్గాలు చర్చించుకుంటున్నారు.

2014 ఎన్నికల్లో తెలగుదేశం అధికారంలోకి రావడం అనంతర పరిణామాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 23 మంది ఎమ్మెల్యేలు వైకాపాను వీడి తెలుగుదేశం గూటికి చేరారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శాసనసభ్యులు వైకాపా నుండి తెలుగుదేశంలోకి జంప్‌ చేశారు. ఈ పరిణామం అప్పట్లో వైకాపాకు శరాఘాతంగా మారింది. 2019 ఎన్నికల్లో తిరుగులేని రీతిలో 151 అసెంబ్లీ సీట్లు సాధించి జగన్‌ ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. తూర్పు గోదావరి జిల్లాలో కేవలం నాలుగుచోట్ల టీడీపీ, ఒకచోట జనసేన విజయం సాధించగా మిగిలిన 14 స్థానాలూ వైసీపీ వశమయ్యాయి. అయితే కాపు సెంటిమెంట్‌ బలంగా ఉండే తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఎన్నికల్లో కాపులు అధికంగా జనసేన వైపే మొగ్గినట్టు స్పష్టమయ్యింది.

ఇదే సమయంలో బీసీలు వైకాపాకు ఏకపక్షంగా మద్ధతు ఇవ్వడంతో ఈ అనూహ్య విజయం సాధించినట్టు తేటతెల్లమయ్యింది. ఈ నేపథ్యంలో తమ వ్యూహం ఏ విధంగా ఉండాలన్న విషయమై కాపునేతలు తీవ్రంగా యోచిస్తున్నట్టు తెలుస్తోంది. వైకాపా తిరుగులేని అధిక్యంతో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయంగా ఆ పార్టీని తట్టుకుని నిలబడాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీలో ఉంటే సాధ్యంకాదని కొందరు టీడీపీ నేతల వాదన! ఈ నేపథ్యంలో టీడీపీ కంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో ఉంటే పంతోకొంత ప్రయోజనం ఉంటుందన్న ఆలోచనతో సదరు నేతలున్నట్టు ప్రచారం జరుగుతోంది.

సమ్మర్‌కి బంపర్‌ బిగినింగ్‌! హడలెత్తించిన మార్చి! ఆల్‌టైమ్‌ డిజాస్టర్‌!

Show comments