క్లైమాక్స్‌ మార్పు.. 'అభిలాష'కు జస్టిఫికేషన్‌!

మెగాస్టార్‌ చిరంజీవికి యండమూరి వీరేంద్రనాథ్‌ నవలలు బాగా అచ్చొచ్చాయి. దాదాపు సమ వయస్కులు అయిన చిరంజీవి, కోదండరామిరెడ్డి, యండమూరి వీరేంద్రనాథ్‌, కేఎస్‌ రామారావుల కాంబినేషన్‌ సూపర్‌ హిట్స్‌ ఉన్నాయి. పలు సినిమాల విషయంలో ఈ కాంబోకు రచయితలు సత్యమూర్తి, సత్యనంద్‌లలో ఎవరో ఒకరు తోడవుతూ వచ్చారు. ఈ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలతో చిరు సుప్రీమ్‌ హీరోగా మారడమే కాదు.. తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేకం అనదగ్గ సినిమాలు కూడా వచ్చాయి. అలాంటి వాటిలో ఒకటి 'అభిలాష'. ఉరి శిక్ష రద్దు వాదనతో వచ్చిన చక్కటి సినిమా. ఈ కాన్సెప్టులో వచ్చిన సినిమాల్లో కెల్లా కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ కూడా ఇదే. 

కమల్‌ హాసన్‌ స్వయంగా దర్శకత్వం వహించి, నిర్మించి, నటించిన 'పోతురాజు'లో కూడా ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లో క్యాపిటల్‌ పనిష్మెంట్‌ను రద్దు చేయాలన్న డిమాండ్‌ను అండర్‌ కరెంట్‌గా వినిపించారు. కమల్‌ సినిమాలో రోహిణిని ఉరిశిక్ష వ్యతిరేక పోరాటకర్తగా చూపించారు. అసలు కథ వేరే అయినా.. రోహిణి చేసిన ''ఏంజెలా ఏసుపాదం' పాత్రను ప్రొలాగ్‌గా వాడుకున్నారు. అందులో కమల్‌ హాసన్‌ ఉరిశిక్ష పడ్డ ఖైదీ. అయితే చివర్లో కమల్‌ పాత్ర క్షమాభిక్షను కోరుతుంది. అతడికి శిక్ష పడ్డ కేసుపై పునర్విచారణ మొదలవుతుంది. అయితే ఉరిశిక్షను ఆ పాత్రకు రద్దు చేసినట్టుగా చూపించకుండానే సినిమా ముగుస్తుంది. కమల్‌ 'పోతురాజు' దాదాపు దశాబ్దం కిందటి సినిమా.

ఈ సినిమాకు దశాబ్దాల ముందే యండమూరి ఉరిశిక్షను భారత శిక్షాస్మృతి నుంచి తొలగించాలన్న వాదనతో నవలను రాసి.. ఏ భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రిల ఆధ్వర్యంలో ఈ దేశంలో ఉరి రద్దు అవుతుందో వారికి ఆ నవలను అంకితమిచ్చారు. ఇప్పటికీ దేశంలో ఉరిశిక్ష అంశం ఎప్పుడు చర్చకు వచ్చినా.. తెలుగు టీవీ ఛానళ్లు, మీడియా యండమూరి అభిప్రాయాన్ని అడుగుతూ ఉంటుందంటే.. ఈ నవల ఎంతగా ప్రభావాన్ని కలిగి ఉందో అర్థం చేసుకోవచ్చు.

అసలుకు ఉరిశిక్ష సమంజసం కాదు.. అనే వాదనకు అనుగుణంగా వచ్చిన సినిమాలే చాలాతక్కువ. ప్రపంచ భాషలన్నింటిలోనూ వెదికినా ఇలాంటి సినిమాలు చాలా తక్కువగానే కనిపిస్తాయి. బహుశా చాలా దేశాల్లో చాలా సంవత్సరాల కిందటే క్యాపిటల్‌ పనిష్మెంట్‌ను రద్దు చేయడంతో ఇలాంటి సినిమాల అవసరాలు రాలేదు కాబోలు. హాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలోనే వచ్చిన 'ది లైఫ్‌ ఆఫ్‌ డేవిడ్‌ గాలే' ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథాంశమే. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ సినిమా కాన్సెప్టు 'అభిలాష'కు దగ్గరదగ్గరగా ఉంటుంది. ఒకవేళ ఈ సినిమా గనుక 'అభిలాష'కు ముందు వచ్చి ఉండుంటే.. కచ్చితంగా మనోళ్లు దీన్ని కాపీ కొట్టే 'అభిలాష'ను తీశారు అని తేల్చేసే వాళ్లు. ఉరిశిక్ష రద్దు చేయాలన్న డిమాండ్‌తో వచ్చిన భారతీయ ఫీచర్‌ ఫిల్మ్స్‌లో రెండూ సౌతిండియా నుంచి వచ్చినవే. పోతురాజు మనకు డబ్బింగ్‌ వెర్షన్‌గా పలకరించగా, అభిలాష సినిమా తమిళంలో మోహన్‌ హీరోగా రీమేక్‌ అయ్యింది.

అభిలాష నవల్లో హీరో పేరు చిరంజీవి. సినిమాలో ఈ పాత్రను చిరంజీవి చేయడం యాదృచ్ఛికమే కావొచ్చు. ఫస్ట్‌ పేజీలోనే హీరో పాత్రను ఉరిశిక్షను ఎదుర్కొంటున్న వ్యక్తిగా పరిచయం చేసి.. అతడి పేరును 'చిరంజీవి'గా చెప్పడం యండమూరి మార్కు ఇంట్రడక్షన్‌. ఉరికంబం మీద నుంచి ఆఖరిక్షణంలో బయటపడటం ద్వారా కూడా అతడి పాత్రకు 'చిరంజీవి' అనే పేరు యాప్ట్‌ అయ్యింది.

అభిలాష నవల ఆరంభమంతా హీరో వెర్షన్‌ ప్రకారం సాగుతుంది. తన కథను.. తన భావాలను.. తన పరిస్థితిని.. ఎదుటివారిపై తన అభిప్రాయాలను హీరో వివరిస్తుండగా నవల ముందుకు సాగుతుంది. ఈ నవలను సినిమాగా మార్చడం విషయానికి వస్తే.. చాలా మార్పులే చేశారు. నవలను స్క్రిప్ట్‌గా మార్చడం, సీన్లుగా విడగొట్టుకోవడంలో చాలా మార్పులే ఉంటాయి. మరి ఇలాంటి మార్పులతో కొన్ని పాత్రల స్వభావం మారిపోతుంది. ప్రధానంగా రావుగోపాల రావు ధరించిన 'సర్వోత్తమరావు' పాత్ర స్వభావాన్ని సినిమాలో చాలా వరకూ మార్చారు. నవలనూ, సినిమాను పోల్చి చూస్తే.. సినిమాలో సర్వోత్తమరావు కొంచెం మంచి విలన్‌. నవలలో మరీ హీనం.

ఈ క్యారక్టరేజేషన్‌లో మార్పుకు, సినిమాలో క్లైమాక్స్‌కు ఆసక్తికరమైన ముడి ఉంది. నవల్లో తన మేనకోడలి కాంక్షను పెంచుకుంటాడు సర్వోత్తమరావు. అయితే ఈ కామవాంఛను అతడు మరోరకంగా తీర్చుకొంటూ ఉంటాడు. ఆమె ధరించి, వదిలిన బట్టలను తాకడం, ఉదయాన్నే ఆమె బెడ్రూమ్‌లోకి వెళ్లి స్థానభ్రంశం చెందిన నైటీ నుంచి వెలుగు చూసే అందాలను ఆస్వాధించడం.. మేనమామగా పెద్దరికాన్ని చెలాయిస్తూ ఆమెను తాకి ఆనందించే పర్వర్ట్‌ పాత్రకు సినిమాలో మార్పులు చేశారు. మేనమామ తీరు నవల్లో చివరాఖరి వరకూ హీరోయిన్‌కు అర్థం కాదు. తీరా క్లైమాక్స్‌లో అతడు ప్రమాదంపాలై హాస్పిటల్‌ ఐసీయూలోకి చేరాకా ఆమెకు అతడి గురించి అర్థం అవుతుంది. దీంతో.. అంతవరకూ తను ఎంతో గౌరవించిన మేనమామలోని ఆ కోణాన్ని ఆమె భరించలేకపోతుంది. ఇక అతడి మొహాన్ని కూడా చూడలేనట్టుగా ఐసీయూ నుంచే అతడు అనంతలోకాలకు వెళ్లిపోతే బాగుంటుందన్న హీరోయిన్‌ కోరిక నెరవేరడంతో నవల ముగుస్తుంది. నవల్లో క్లైమాక్స్‌ విషయంలో ఉరి రద్దు విషయంలో గట్టి వాదనను వినిపించడాని కన్నా ముందు 'అర్చన' పేరుతో తను సృష్టించిన హీరోయిన్‌ మానసిక ప్రశాంతతకు అనుగుణంగానే క్లైమాక్స్‌ను రాశారు యండమూరి. ఇందులో మాత్రమే కాదు.. 'తులసి' 'అనైతికం' నవల క్లైమాక్స్‌లలో కూడా తను సృష్టించిన తెలివైన, అందమైన స్త్రీల పాత్రల అంతరంగాన్ని డిఫరెంట్‌గా ప్రజెంట్‌ చేశాడీ రచయిత.

అభిలాష క్లైమాక్స్‌ను సినిమా విషయంలో మార్చారు. హీరో 'అభిలాష'కు అనుగుణంగా క్లైమాక్స్‌ రాయడం ఆసక్తికరమైన అంశం. అంతవరకూ తను చేసిన హత్యను, దాన్ని తెలివిగా చిరంజీవి మీదకు తోసేసిన విధానాన్ని కోర్టులో ఒప్పుకున్న సర్వోత్తమరావుకు కోర్టు 'ఉరిశిక్ష' విధిస్తుంది. అక్కడ హీరో ఎంటరవుతాడు. అతడు చేసింది తప్పే అయినా.. నేరం నిరూపణ అయినా ఉరిశిక్ష విధింపు సరికాదని, మనిషిని చంపే హక్కు మరో మనిషికి లేదన్న వాదన ఉరిరద్దు అభిలాషను వినిపిస్తాడు. ఇక్కడ హీరో క్యారెక్టర్‌కు జస్టిఫికేషన్‌ జరిగింది. సినిమాలో దేన్నైతే క్లైమాక్స్‌గా చూపారో.. అది జరగాలని నవల్లో హీరో కోరుకుంటాడు. ఈ ప్రక్రియలో కేసు మళ్లీ తన మీదకే మళ్లినా పోరాడదామని అనుకుంటాడు. అయితే అతడి కోరిక నవల్లో నెరవేరదు. సినిమాలో నెరవేరుతుంది. తన మెడ మీదకు ఉరితాడును తీసుకొచ్చిన వాడే అయినా.. విలన్‌ తరపునే హీరో న్యాయవాదిగా కోర్టులో అడుగుపెట్టి, అతడికి ఉరిశిక్ష వద్దని వాదించడం, ప్రపంచంలో చాలా దేశాలు ఉరి శిక్షను రద్దు చేసిన విధానాన్ని వివరించి.. సినిమా ఉద్దేశాన్ని హైలెట్‌ చేసింది. నవలతో పోలిస్తే, సినిమాదే గొప్ప క్లైమాక్స్‌ అయ్యింది. 'అభిలాష' క్లాసిక్‌గా నిలిచిపోయింది. 

Show comments