అదే ధీమా: సెంచరీ కొట్టేదెలా కేటీఆర్‌.?

'ఎట్టి పరిస్థితుల్లోనూ సెంచరీ కొట్టబోతున్నాం.. 100 క్రాస్‌ చేసి తీరతాం.. తెలుగుదేశం పార్టీ పని ఎప్పుడో అయిపోయింది.. ఇప్పుడు కాంగ్రెస్‌ వంతు.. ముఖ్యమంత్రులమని చెప్పుకుంటోన్నవాళ్ళు నియోజకవర్గ పరిధి దాటింది లేదు.. చాలామందికి షాక్‌ తగలబోతోంది.. సర్వేలు, అంచనాలు ఎలా వున్నా, మాకు ప్రజాతీర్పే ముఖ్యం. ప్రజలు ఏమనుకుంటున్నారన్నదానిపై మాకు ఖచ్చితమైన అవగాహన వుంది..' అంటూ, తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఖచ్చితమైన అభిప్రాయాన్ని ఇంకోసారి కుండబద్దలుగొట్టేశారు ఆపద్ధరమ్మ మంత్రి కేటీఆర్‌.

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌, 100 సీట్లలో తమ పార్టీ గెలుస్తుందన్న అంచనాతోనే, ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. ఎన్నికల ప్రచారాన్ని పక్కాగా ప్లాన్‌ చేసుకుంది తెలంగాణ రాష్ట్ర సమితి. అంచనాలు అస్సలేమాత్రం తప్పలేదు.. ప్రచారం వరకూ. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు మాత్రం, కాస్తంత భిన్నంగా కన్పిస్తున్నాయి. చాలా ఫలితాలేమో 55 నుంచి 65 మధ్య మాత్రమే టీఆర్‌ఎస్‌ని నిలబెడ్తున్నాయి. ఒకట్రెండు సర్వేలు మాత్రమే, టీఆర్‌ఎస్‌కి 70 ఆ పైన ఫలితాల్ని అందిస్తున్నాయి. ఒక్క సర్వే కూడా 100 సీట్లు టీఆర్‌ఎస్‌ కొల్లగొడుతుందని చెప్పలేదు.

అయినా, కేటీఆర్‌లో 'సెంచరీ కొట్టేస్తాం..' అనే ధీమా ఎలా వ్యక్తమవుతోందట.! 'ఆంధ్రా ఆక్టోపస్‌' లగడపాటి రాజగోపాల్‌ సర్వే అయితే, టీఆర్‌ఎస్‌కి ఓటమి తప్పదని తేల్చేసింది. అయితే, లగడపాటి సర్వేని కేటీఆర్‌ లైట్‌ తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో లగడపాటి రాజగోపాల్‌ రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వచ్చిందనీ.. తాజా ఎన్నికలతో లగడపాటి రాజగోపాల్‌ సర్వేల నుంచి కూడా సన్యాసం తీసుకోవాల్సి వస్తుందని జోస్యం చెప్పారు కేటీఆర్‌.

ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్స్‌ భద్రత విషయమై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేయడాన్ని 'కుంటి సాకు'గా అభివర్ణించిన కేటీఆర్‌, ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేయడం సాధ్యంకాదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌ ఓటమిని పరోక్షంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముందే అంగీకరించేశారన్నది కేటీఆర్‌ వాదన.

ఎవరి వాదనలు ఎలా వున్నా, ఓటరు తీర్పు మాత్రం ఈవీఎంలలో నిక్షిప్తపోయింది. డిసెంబర్‌ 11న ఎవరి జాతకమేంటో తెలిసిపోతుంది. ఆ రోజున తాను గడ్డం తీస్తాననీ, తెలంగాణ సమాజానికి టీఆర్‌ఎస్‌ అనే చీడ నుంచి విముక్తి కలుగుతుందనీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెబుతున్న దరిమిలా.. ఉత్తమ్‌ గడ్డంతీస్తారా.? ఆ గడ్డం ఎప్పటికీ తీసే పరిస్థితి రాదా.? కేటీఆర్‌ చెబుతున్నట్లు టీఆర్‌ఎస్‌ సెంచరీ కొడ్తుందా.? వేచి చూడాల్సిందే.

తెలంగాణ తీర్పు ప్రభావం.. ఏపీపై ఉంటుందా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments