సాయం పొందాడు.. ద్రోహం చేశాడు..!

మనకు ఎవరైనా సాయం చేస్తే వారికి కృతజ్ఞతగా ఉండాలన్నారు పెద్దలు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టకూడదన్నారు. అంటే సాయం చేసినవారికి ద్రోహం చేయకూడదని అర్థం. సామాన్య ప్రజలు కొందరు ఈ సూక్తులను పాటి స్తారేమోగాని రాజకీయ నాయకులకు ఇలాంటివి తెలియవు. తెలిసినా పట్టించుకోరు. 'కృతజ్ఞత' అనే మాటకు రాజకీయాల్లో తావులేదు. సాయం చేసినవారికి కృతజ్ఞతగా ఉండటం అనేది రాజకీయ నాయకులకు తెలియని విద్య. పబ్బం గడుపుకోవడం ఒక్కటే వారికి తెలుసు. సాయం పొందాక మళ్లీ తిరిగి కూడా చూడరు. రాజ్యాంగానికే విలువ ఇవ్వని నాయకులు నైతిక విలువలను, ధర్మాలను పట్టించుకుంటారా? ఇప్పటి నాయకులంతా అధర్మాన్ని ఒంటపట్టించుకున్నవారే. ఇలా ఒంటపట్టించుకున్న వారిలో రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభు ఒకరు. ఈయనను ద్రోహి, విశ్వాసఘాతకుడు అన్నా తప్పులేదు. ఈయన ఆంధ్రప్రదేశ్‌ నుంచి సాయం పొందారు. కాని ఆ రాష్ట్రానికే పంగనామాలు పెట్టారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడమంటే ఇదే. 2016 జూన్‌లో ఈయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ సాయం చేసింది ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

బీజేపీతో ఉన్న మిత్రత్వం కారణంగా, రాష్ట్రానికి రైల్వేజోన్‌ వస్తుందనే ఆశతో రాజ్యసభకు ఎంపిక చేయించారు. పబ్బం గడిచింది కదా... ఇక అంతే...! మనిషి పత్తా లేడు. రైల్వేజోన్‌పై ఇప్పటివరకు ఒక్క ముక్కా మాట్లాడలేదు. అసలు దాని కోసం ఎటువంటి ప్రయత్నాలు చేశారో తెలియదు. రైల్వే జోన్‌పై రాష్ట్ర బీజేపీ నాయకులే రకరకాలుగా మాట్లాడుతున్నారు తప్ప సురేష్‌ ప్రభు ఏమీ చెప్పడంలేదు. కొంతమంది వస్తుందంటారు. కొందరు రాదంటారు. రైల్వేజోన్‌ విభజన చట్టంలో ఉన్న అంశమే అయినప్పటికీ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. పార్లమెంటు బడ్జెటు సమావేశాలకు ముందు చంద్రబాబు టీడీపీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో రైల్వేజోన్‌పై గట్టిగా పట్టుబట్టాలని చెప్పారు. 'దేన్నీ వదిలేది లేదు' అని ఎంపీల సమావేశంలో చెప్పారు. కాని రైల్వేమంత్రి జోన్‌ విషయం వదిలేశారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కొంత కాలం క్రితం రైల్వేజోన్‌ గురించి చెబుతూ 'రైల్వేజోన్‌ కొంత సంక్లిష్టమైంది. దానిపైనా పరిశీలన జరుగుతోంది' అన్నారు. రైల్వేజోన్‌ అంశం కూడా ఇతర రాష్ట్రాలతో ముడిపడి ఉన్న అంశంగా కేంద్రం ఎప్పటినుంచో చెబుతోంది. మూడేళ్ల తరువాత కూడా వెంకయ్య నాయుడు రైల్వేజోన్‌ సంక్లిష్టమైన వ్యవహారమని చెబుతున్నారంటే దీనికి 'రెడ్‌ సిగ్నల్‌' పడుతుందేమోనని అనుమానం కలుగుతోంది.

ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నాలు జరిగాయో తెలియదు. దీన్ని విశ్వాస ఘాతుకంగా చెప్పుకోవచ్చు. ఇక సురేష్‌ ప్రభు మరో ద్రోహం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని తెలుగు నాయకులు చెబుతున్నారు. ఎంపీలందరికీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇస్తుంది. ఎంపీల లోకల్‌ ఏరియా డెవెలప్‌మెంట్‌ స్కీమ్‌ కింద ఈ నిధుల కేటాయింపు జరుగుతుంది. ఈ నిధులను ఎంపీలాడ్స్‌ అంటారు. ఈ ఎంపీలాడ్స్‌ను లోక్‌సభ సభ్యులైతే తాము ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఖర్చు చేయాలి. అదే రాజ్యసభ సభ్యులైతే తాము ఏ రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారో ఆ రాష్ట్రంలో ఖర్చు చేయాలి. కాని సురేష్‌ ప్రభు తన ఎంపీ నిధులను హర్యానాలో ఖర్చు చేశారు. ఈయన తన ఎంపీ నిధులతో 17 అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్ట్‌ అంబులెన్సులు కొనుగోలు చేసి హర్యానాకు బహూకరించారు. ఏపీ కంటే ముందు ఆయన హర్యానా నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. రైల్వే మంత్రిలో ఆ ప్రేమ ఇంకా మిగిలి ఉందేమో....! 

వాస్తవానికి ఈ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు ఖర్చు చేయాలి. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎంపీలను లాటరీ పద్ధతిలో తెలుగు రాష్ట్రాలకు కేటాయించారు. దీని ప్రకారం ఏపీకి చెందిన కేవీపీ రామచంద్రరావు తెలంగాణకు, తెలంగాణకు చెందిన కె.కేశవరావు ఏపీకి వెళ్లాల్సివచ్చింది. వారు వారి ఎంపీ నిధులను తమకు కేటాయించిన రాష్ట్రాల్లోనే ఖర్చు చేస్తున్నారని ఓ మాజీ ఎంపీ చెప్పా రు. కాని రైల్వేమంత్రి అందుకు భిన్నంగా వ్యవహరించి తనకు సాయం చేసిన ఏపీని విస్మరించారు. ఇది నిబంధనల ఉల్లంఘనేనని చెప్పారు. రైల్వేమంత్రిని ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు పంపడం వల్ల రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా? అని అప్పట్లోనే (రాజ్యసభ ఎన్నికల సమయంలో) టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రైల్వేమంత్రి ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తారు కాబట్టి ఆ కృతజ్ఞతతో రైల్వేజోన్‌ ఇవ్వొచ్చని అనుకున్నారు. అప్పట్లో బీజేపీకి రాజ్యసభ సీటు ఇచ్చే వ్యవహారంలో హైడ్రామా నడిచింది. చివరి క్షణం వరకు సస్పెన్స్‌ కొనసాగింది. బీజేపీ ఏపీకి అన్యాయం చేసింది (ప్రత్యేక హోదా ఇవ్వకుండా) కాబట్టి దానికి రాజ్యసభ సీటు ఇవ్వకూడదని టీడీపీలోని చాలామంది అభిప్రాయపడ్డారు. రెండు పార్టీల మధ్య విభేదాలు ముదిరిన నేపథ్యంలో ఈ ఎన్నికలు రావడంతో సీటు విషయంలో ప్రతిష్టంభన కొనసాగింది. టీడీపీ తనకు తానై బీజేపీకి సీటు రిజర్వు చేయలేదు. ఆ పార్టీ అడిగితేనే ఇవ్వాలనుకుంది. సీటు అడిగితే కొన్ని షరతులు పెట్టాలని కూడా అనుకుంది. కాని రాష్ట్ర ప్రయోజనాల కారణం చెప్పి చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గారు.

బీజేపీ వైఖరిపై ఏడాదిపాటు వేచి చూస్తామని ఆయన గతంలో చెప్పారు. అందుకే రాజ్యసభ సీటు విషయంలో మరీ పంతానికి పోలేదు. ప్రత్యేక హోదా రాదని ఆయనకు తెలుసు. కనీసం రైల్వేజోన్‌ అయినా వస్తే ఇది సాధించామని ప్రజలకు చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇక రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్‌ రాష్ట్రం విడిచి వెళ్లడానికి కారణాలు రకరకాలుగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజనలో వెంకయ్య నాయుడిది కీలకపాత్ర. ఆనాడు రాజ్యసభలో ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టింది ఆయనే. దాన్ని ఆయన సాధించలేకపోయారు. రెవిన్యూ లోటుభర్తీ, ఇతరత్రా సహాయాల విషయంలోనూ ఆయన ఏమీ చేయలేకపోయారు. దీంతో ప్రతిపక్ష నేతలు ఆయనపై మొదటి నుంచి విమర్శల దాడి చేస్తూనే ఉన్నారు. 'వెంకయ్య ఆంధ్రాను ముంచాడు' అనే ప్రచారం సాగింది. తరచుగా రాష్ట్రంలో పర్యటించే వెంకయ్యకు ఈ పరిస్థితి ఇబ్బందిగా ఉంది. హోదా మీద, ఇతర సహాయాల మీద ఎదరుయ్యే ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేక సతమతమవుతున్నారు. రాష్ట్రంలో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సొంత రాష్ట్రం నుంచి పోటీచేసే అవకాశమున్నా వద్దనుకున్నారు.

'బీజేపీ సభ్యులు తగినంతమంది లేని రాష్ట్రం నుంచి నేను పోటీ చేయను' అని చెప్పారు. మరి సురేష్‌ ప్రభును ఎన్నిక చేయిస్తున్నారు కదా...! అనే ప్రశ్నకు సమాధానం లేదు. నిర్మలా సీతారామన్‌ను కూడా కర్నాటకకు పంపమని వెంకయ్యే నాయకత్వానికి సలహా ఇచ్చారట. ఆమె తమిళియన్‌ అయినా తెలుగువారి కోడలు. ప్రస్తుతం చంద్రబాబుకు మీడియా సలహాదారుగా ఉన్న పరకాల ప్రభాకర్‌ సతీమణి నిర్మల. కాని ఆమెవల్ల కూడా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం కలగలేదు. ఇక సురేష్‌ ప్రభు విషయానికొస్తే హర్యానా నుంచి పెద్దల సభకు ప్రాతినిథ్యం వహించిన ఆయన్ని ఆంధ్రకు పట్టుకొచ్చారు. మహారాష్ట్రకు చెందిన ఈయనకు ఆంధ్రతో అసలు లింకులేదు. కాబట్టి రాజ్యసభ ఎన్నికలు ముగిశాక ఈయన రాష్ట్రం వైపు కన్నెత్తి చూసే అవకాశం లేదని కొందరు నాయకులు అప్పట్లో అభిప్రాయపడ్డారు. ఆయన రైల్వేజోన్‌ ఇవ్వకపోయినా ప్రజలు ప్రత్యక్షంగా నిలదీసే అవకాశంలేదు. ఆరేళ్లు ఆయన పదవికి ఢోకాలేదు. ఇప్పటి వరకు రైల్వే మంత్రులైనవారంతా తమ సొంత రాష్ట్రాలకు ఎక్కువ మేలు చేశారు తప్ప ఇతర రాష్ట్రాలను అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏ రైల్వేమంత్రి తీరైనా ఇంతే. ఇప్పటివరకూ ఏ రైల్వేమంత్రి తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేయలేదు. 

 -నాగ్‌ మేడేపల్లి

Show comments