అధికారం లేని జీవితాన్ని తట్టుకోలేకపోతున్న కేసీఆర్ ఫ్యామిలీ

కేసీఆర్ సహా ఆయన కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు అధికారం లేని జీవితాన్ని తట్టుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి వారి వ్యవహార శైలి అలాగే ఉంది. అధికారం తమ కుటుంబం, తమ పార్టీ జన్మహక్కు అయినట్లుగా మాట్లాడుతున్నారు. 

కాంగ్రెస్ లో వేరెవరైనా సీఎం అయితే వీరి వ్యవహార శైలి ఎలా ఉండేదోగాని రేవంత్ సీఎం కావడం ఏమాత్రం సహించలేకపోతున్నారు. కాంగ్రెస్ లో కేసీఆర్ ను దీటుగా ఎదుర్కొనే నాయకుడు రేవంత్ రెడ్డే కాబట్టి కేసీఆర్ ఫ్యామిలీ ఆయనను ఆగర్భ శత్రువుగా చూస్తోంది. అందులోనూ రేవంత్ రెడ్డి ఘాటుగా మాట్లాడటమే కాదు, కేసీఆర్ భాషలోనే మాట్లాడతాడు. అంటే బూతులన్నమాట. ఆ భాషలోనే మాట్లాడితేనే కేసీఆర్ కు అర్ధమవుతుందని ఒకసారి చెప్పాడు.

రేవంత్ రెడ్డిని రాజకీయంగా అణగదొక్కాలని కేసీఆర్ చాలా ప్రయత్నించాడు. కానీ రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చాలా తక్కువ కాలంలోనే ఎదిగి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది కేసీఆర్ కు కంటగింపుగా ఉంది. అందులోనూ తాను అధికారం కోల్పోవడానికి రేవంతే ప్రధాన కారకుడనే అభిప్రాయం బలంగా ఉంది. 

రేవంత్ ను గద్దె దింపడమే కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత తొందరగా కూలిపోతే తాను మళ్ళీ అంత తొందరగా సీఎం కావాలని కేసీఆర్ తహతహలాడుతున్నాడు. అందుకే కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ హామీలు అమలు చేయాలని రోజూ పోరు పెడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కాకముందే గోలగోల చేస్తున్నారు.

ప్రధానంగా రైతుల్లో బద్నాం చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం, ప్రధానంగా రేవంత్ రెడ్డి అన్యాయం  చేస్తున్నాడని వారి మైండ్ లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. రైతులు బాగా ఆశ పెట్టుకున్న రుణ మాఫీ గురించి అదే పనిగా మాట్లాడుతున్నారు. ఆగస్టు పదిహేనులోగా అమలు చేయకపోతే రాజీనామా చేస్తావా ? అంటూ సవాల్ చేస్తున్నారు. 

ఈ విషయంలో హరీష్ రావు బాగా రెచ్చిపోతున్నాడు. రైతు రుణ మాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, చేయలేకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని సవాల్ చేస్తున్నాడు.  ఇద్దరం రాజీనామా లేఖలు ముందుగానే మేధావులకు ఇద్దామంటున్నాడు. రుణ మాఫీ జరిగి తీరుతుందని, హరీష్ రావు రాజీనామా జేబులో పెట్టుకొని రెడీగా ఉండాలని రేవంత్ అన్నాడు.

ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళితే అక్కడ ఉన్న దేవుళ్లపైన రుణ మాఫీ చేస్తామని ఓట్లు పెడుతున్నాడు. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ దేవుళ్లపై ఒట్టు పెట్టడం కాదని, రేవంత్ తన పిల్లలపై ఒట్టు పెట్టాలని అన్నాడు.  ఇక కేసీఆర్ రైతు రుణ మాఫీ సాధ్యం కాదని చెప్పాడు. ఎందుకంటే గతంలో తాను కూడా చేయలేకపోయాడు కాబట్టి. కేటీఆర్ అండ్ హరీష్ రావు అభిప్రాయం కూడా అదే. అందుకే రేవంత్ రెడ్డిని రెచ్చగొడుతున్నారు. 

రేవంత్ రెడ్డి మాటలు నమ్మి రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారని భయపడుతున్నారు. పదేళ్ళపాటు తెలంగాణను తన సొంత జాగీరులా భావించిన కేసీఆర్ అధికారం పోయినా ఇంకా అదే ధోరణిలో మాట్లాడుతున్నాడు. దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించాడని చెప్పాడు. తన గుండె చీలిస్తే తెలంగాణ కనబడుతుందని అన్నాడు. చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చానన్నాడు.

ప్రజలు తన సేవలను గుర్తించాలని ఒక ఎన్నికల ప్రచారసభలో వేడుకున్నాడు. ప్రజల దీవెనలతో మళ్ళీ అధికారంలోకి వస్తాననన్నాడు. కేసీఆర్ అండ్ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతసేపు రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందని, రేవంత్ రాజీనామా చేయాలని, ఆయన బీజేపీలో చేరిపోతాడని పాట పాడుతూనే ఉన్నారు. 

విచిత్రమేమిటంటే... కేసీఆర్ కానీ, కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ ఈనాటివరకు ప్రజల తీర్పును గౌరవించలేదు. ప్రజా తీర్పును శిరసావహిస్తున్నామని అనలేదు. ఏ ఎన్నికల్లోనైనా అధికారంలో ఉండి ఓడిపోయిన పార్టీ ఈ మాట అంటుంది. ఎంతసేపటికీ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చింది... ఇది కూలిపోతుంది అన్న మాట తప్ప మరో మాట లేదు. అంటే మరో పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ఫ్యామిలీ సహించదన్న మాట.