పెద్ద బ్రాండ్.. అంతా నాసిరకం, ప్రాణాలతో చెలగాటం

హైదరాబాద్ మెయిన్ రోడ్స్ లో అలా నడుచుకుంటూ వెళ్తుంటే, ప్రతి గల్లీకి ఓ రెస్టారెంట్ కనిపిస్తుంది. ప్రతి ఏరియాలో ఓ ఫేమస్ హోటల్ ఉంటోంది. ఓ చోట బిర్యానీ సూపర్ అంటే, మరోచోట హలీమ్ అద్భుతం అంటారు జనం. అలా ఎంతో పేరు గడించిన హోటళ్లలో కూడా నాసిరకం, కల్తీ తాండవం చేస్తోంది. బ్రాండ్ ముసుగులో అడ్డమైన ఆహార పదార్థాల్ని విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు.

ఆమధ్య ఆల్ఫా కేఫ్ లో జరిగిన బాగోతం గురించి అందరికీ తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఉండే ఈ కేఫ్ చాలా పాపులర్. ఆ పాపులారిటీని అడ్డం పెట్టుకొని ఎంతకు బరితెగించారో, ఆ బాగోతం మొత్తం బయటపడింది. అలాంటి ఉదంతాలు ఈమధ్య చాలాచోట్ల బయటపడుతున్నాయి.

తాజాగా హైదరాబాద్ లోని ఫేమస్ కరాచీ బేకరిలో నాసికరం ఉత్పత్తులు బయటపడ్డాయి. మిడిల్-క్లాస్ రేంజ్ దాటి ఎప్పుడో పైకి వెళ్లిపోయిన ఈ బేకరీలో గడువు ముగిసిన బిస్కెట్లు, చాక్లెట్లను కూడా అమ్మేస్తున్నారు. ఇవి మాత్రమే కాదు, రస్క్ లు, క్యాండీలు, టోస్ట్ లు, కేక్ లు.. ఇలా చాలా ఆహార పదార్థాల్ని ఎక్స్-పైరీ డేట్ దాటిన తర్వాత కూడా ఓపెన్ గా అమ్మేస్తున్నారు. మరికొన్ని కేకులు, ప్యాస్ట్రీలపై అసలు డేట్ కూడా లేకపోవడం విడ్డూరం.

ఇక ఈ ఎండాకాలంలో ఎవరైనా చల్లగా ఐస్ క్రీమ్ తినాలనుకుంటారు. ఇది కూడా ప్రమాదకరంగానే మారింది. ఇప్పటికే కెమికల్స్ తో చేసిన నకిలీ ఐస్ క్రీమ్స్ గుట్టురట్టు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. తాజాగా హైదరాబాద్ లోని ప్రసిద్ధ బిలాల్ ఐస్ క్రీమ్ పార్లర్ లో నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించారు.

జంట నగరాల్లో పాపులర్ అయిన క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ పార్లర్ లో కూడా ఇదే తంతు నడుస్తోంది. గడువు ముగిసినప్పటికీ అవే పదార్థాల్ని చల్లచల్లగా కస్టమర్లకు అందిస్తున్నారు. ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన ఉత్పత్తుల్ని మండుటెండల్లో అలాగే వదిలేస్తున్నారు. బ్రాండ్ చూసి మోసపోవద్దనే సందేశాన్నిస్తున్నాయి ఈ ఘటనలు.