ఇకపై వాట్సాప్ లో సుప్రీంకోర్టు

చాలామంది వ్యక్తుల జీవితాల్లో వాట్సాప్ ఓ భాగమైంది. వ్యక్తిగత వాడకంతో పాటు, సంస్థలు కూడా వాట్సాప్ లో ఛానెల్స్ నిర్వహిస్తున్నాయి. కొన్ని పేమెంట్స్ కూడా వాట్సాప్ తో జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కూడా వాట్సాప్ లోకి వచ్చింది.

టెక్నాలజీకి తగ్గట్టు అప్ డేట్ అవుతోంది అత్యున్నత ధర్మాసనం. ఇకపై లాయర్లకు ఇవ్వాల్సిన సమాచారాన్ని వాట్సాప్ లో పంపించనుంది. కోర్టులో ఏ రోజు ఏ కేసులు విచారణకు వస్తున్నాయి, వాటి విచారణ ఏ స్టేజ్ లో ఉందో తెలిపే కాజ్ లిస్ట్ ను ప్రతి రోజూ లాయర్లకు వాట్సాప్ చేయబోతున్నారు.

ఇంతకుముందు ఈ వివరాలన్నింటినీ ప్రింట్ చేసి ఇచ్చేవాళ్లు. దీని వల్ల చాలా పేపర్ వృధా అవుతోంది. దీంతో పాటు సుప్రీంకోర్టును వినియోగదారులు, లాయర్లకు మరింత దగ్గర చేసేందుకు వాట్సాప్ నంబర్ ను వాడాలని కోర్టు నిర్ణయించింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ కీలక ప్రకటన చేశారు. ఇకపై ఓ వాట్సాప్ నంబర్ ద్వారా రోజువారీ కేసుల వివరాలు తెలుసుకోవచ్చని ప్రకటించిన చీఫ్ జస్టిస్, కోర్టులోని ఐటీ విభాగంతో ఈ వాట్సాప్ నంబర్ ను అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అయితే ఈ నంబర్ తో కేవలం రోజువారీ కేసుల వివరాలు, విచారణకు సంబంధింన అప్ డేట్స్ మాత్రమే పొందగలరు. ఈ నంబర్ కు కాల్ చేయడం లేదా తిరిగి రిప్లయ్ చేయడం లాంటివి చేయలేం. ప్రధాన న్యాయమూర్తి మార్గదర్శకత్వంలో, సుప్రీంకోర్టు న్యాయ కార్యకలాపాల డిజిటలైజేషన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ-కోర్టు ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 7వేల కోట్ల రూపాయలు కేటాయించింది.