ఆ విషయంలో చంద్రబాబుకు రేవంత్ డైరెక్షన్!

ఇదేమిటి రివర్సులో ఉందే అనుకుంటున్నారా? మామూలుగా నలభై నాలుగేళ్ల రాజకీయ కురువృద్ధుడిని అని చెప్పుకునే చంద్రబాబునాయుడు, తన శిష్యుడు తన స్కెచ్ ప్రకారం నడుస్తూ ఉండే రేవంత్ రెడ్డిని డైరెక్ట్ చేస్తుంటారు గానీ.. రివర్సులో రేవంత్ ఎలా డైరెక్ట్ చేస్తారబ్బా? అని విస్తుపోతున్నారా? కానీ ఇది నిజం.

తెలంగాణలో కేసీఆర్ మీద విజయం సాధించిన రేవంత్ రెడ్డి అక్కడ తన విజయానికి బాటలు వేసిందని అనుకుంటున్న ఒక మార్గాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు డైరెక్ట్ చేస్తున్నారు. మరి చంద్రబాబుకు ఎలా వర్కవుట్ అవుతుందో చూడాలి.

తెలంగాణలో ఎన్నికల సమయంలో.. కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ చుట్టూ విపరీతంగా ప్రచార పర్వాన్ని నడిపించింది. ధరణి పోర్టల్ అనేది కేవలం పేదల భూములను అధికార భారాస నాయకులు కబ్జా చేయడానికి మాత్రమే రూపొందించిన పోర్టల్ అన్నట్టుగా కాంగ్రెస్ ప్రచారం సాగింది. అదే సమయంలో.. ఆ ప్రచారానికి ఆందోళన చెందిన భారాస, కేసీఆర్.. ధరణి పోర్టల్ ను సమర్థించుకోవడానికి చాలా కష్టపడ్డారు.

అదే టెక్నిక్ ను ఇప్పుడు చంద్రబాబునాయుడుకు రేవంత్ రెడ్డి సలహా చెప్పినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మాత్రమే.. చంద్రబాబునాయుడు ఏపీలోని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పడి ఏడుస్తున్నారు. ప్రజలకు పటిష్టమైన భూహక్కులు కల్పించేందుకు కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్నే ఏపీలో జగన్ సర్కారు అమలు చేస్తూంటే.. అది కాస్తా వైసీపీ నాయకులు భూకబ్జాలు చేయడానికి మాత్రమే అమలు చేస్తున్న చట్టంలాగా అభివర్ణిస్తూ చంద్రబాబునాయుడు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

పైగా తాను సీఎం అయిన వెంటనే రెండో సంతకం ఈ లాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయడం మీదనే పెడతానంటూ.. ఆ పాయింట్ కు మరింత హైప్ క్రియేట్ చేశారు చంద్రబాబునాయుడు. అయితే తెలంగాణలో ధరణి పోర్టల్ కు, ఏపీలోని లాండ్ టైటిలింగ్ యాక్ట్ కు ఏమాత్రం సంబంధమే లేదు.

కాకపోతే.. రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో ఈ చట్టం ద్వారా భూకబ్జాలు జరిగిపోతాయి.. మీ భూమి మీద మీకు హక్కు ఉండదు.. మరెవ్వరికో హక్కు ఉంటుంది.. అనే అబద్ధాలతో ప్రజలను భయపెట్టడమే బతుకుగా తెలుగుదేశం పార్టీ, జనసేన పవన్ కల్యాణ్ చెలరేగుతున్నారు. భూమి పేరుతో ప్రజలను భయపెడితే.. తమకు లాభం ఉంటుందని ఈ కుట్రమార్గాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది.