టీడీపీ అభివృద్ధి వర్సెస్ వైసీపీ అభివృద్ధి

విశాఖలో వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు సాగుతోంది. విశాఖ ఎంపీ సీటుకు పోటీ పడుతున్న ఈ రెండు పార్టీల అభ్యర్థులు ప్రచారం చూస్తే కనుక వైసీపీ అజెండాను వైసీపీ ఎంపీ అభ్యర్ధి బొత్స ఝాన్సీ జనాల్లోకి బలంగా తీసుకుని వెళ్తున్నారు. వైసీపీని ఎంపీ సీటుకు గెలిపిస్తే విశాఖ రాజధాని అవుతుందని, అభివృద్ధి సాధ్యపడుతుందని ఆమె చెబుతున్నారు.

రెండు సార్లు ఎంపీగా పనిచేసిన తాను ఆ అనుభవంతో విశాఖ విజన్ ని రూపొందించామని ఆమె పేర్కొంటున్నారు. విశాఖ ఉత్తరాంధ్రకు గేట్ వే అని రాజధాని వస్తే వెనకబడిన మూడు ఉమ్మడి జిల్లాలూ ఎంతో అభివృద్ధి సాధిస్తాయని ఆమె విడమరచి చెబుతున్నారు.

టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న శ్రీ భరత్ సహా ఆ పార్టీ నేతలు అంతా విశాఖ అభివృద్ధి అంటున్నారు. టీడీపీకి ఓటు వేస్తే విశాఖను అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. విశాఖ అభివృద్ధి అంటే ఏమిటి అన్నది స్పష్టంగా వివరించడం లేదు అని వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి.

చంద్రబాబు అయితే విశాఖ ఆర్థిక రాజధాని అని ఒక బ్రహ్మపదార్థం లాంటి మాటను వాడుతూ ఉంటారు. ఈ ఆర్థిక రాజధాని ఏమిటో సగటు జనాలకు అర్థం కాదని అంటున్నారు. సూటిగా విశాఖ పరిపాలనా రాజధానికి మద్దతు ఇస్తామా లేదా చెప్పకుండా టీడీపీ ఈ విధంగా చెప్పడమేంటి అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

విశాఖ అభివృద్ధి కావాలంటే టీడీపీని గెలిపించండి అని ఆ పార్టీ చెబుతోంది. రాజధానినే విశాఖను తీసుకుని వస్తూంటే అంతకంటే అభివృద్ధి వేరేది ఉంటుందా అని వైసీపీ తిప్పికొడుతోంది. విశాఖ జనాలలో అండర్ కరెంట్ గా రాజధాని సెంటిమెంట్ ఉందని వైసీపీ నేతలు అంటున్నారు.

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో కూడా రాజధాని ప్రభావం ఉందని అంటున్నారు. అయితే విశాఖ రాజధాని అంశం వైసీపీకి మరోసారి ఎంపీ సీటు దక్కేలా చేస్తుందా అన్నదైతే అంతా తర్కించుకుంటున్న విషయంగా ఉంది. టీడీపీ అభివృద్ధి వర్సెస్ వైసీపీ విశాఖ రాజధానిలలో జనాలు దేనిని ఎంచుకుంటారు అన్నదే రేపటి ఎన్నికల్లో తేలనుంది అంటున్నారు.