ష‌ర్మిల‌, సునీత‌పై జ‌గ‌న్ ఫైర్‌!

పులివెందుల గ‌డ్డ మీద నుంచి త‌న చెల్లెళ్లు ష‌ర్మిల‌, డాక్ట‌ర్ సునీత తీరుపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. త‌మ‌కంటే చాలా చిన్న‌వాడైన అవినాష్‌రెడ్డి రాజ‌కీయ జీవితాన్ని నాశ‌నం చేయాల‌ని ప్ర‌త్య‌ర్థుల‌తో కుట్ర‌లు ప‌న్నిన వీరు అస‌లు మ‌నుషులేనా? అని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

వివేకా హ‌త్య‌ను అడ్డం పెట్టుకుని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో పాటు క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తూ కూట‌మికి రాజ‌కీయ ప్ర‌యోజ‌నం క‌లిగించి, త‌ద్వారా భారీగా ఆర్థిక ల‌బ్ధి పొందుతున్నార‌ని ఆరోప‌ణ‌లను ష‌ర్మిల‌, సునీత ఎదుర్కొంటున్నారు. దీంతో వారి ఆగ‌డాల‌కు కోర్టు ద్వారా వైసీపీ అడ్డుక‌ట్ట వేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ‌ను అప్ర‌తిష్ట‌పాలు చేయ‌డానికి వివేకా కేసులో నిందారోప‌ణ‌లు చేసిన అక్కాచెల్లెళ్ల‌కు జ‌గ‌న్ ఘాటుగా స‌మాధానం ఇచ్చారు.

ఎన్నిక‌ల్లో నామినేష‌న్ నిమిత్తం పులివెందుల‌కు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వెళ్లారు. నామినేష‌న్‌కు ముందు సీఎస్ఐ గ్రౌండ్‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ ఉద్వేగ‌భ‌రిత ప్ర‌సంగం చేశారు. ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల‌, సునీత పేర్లు ప్ర‌స్తావించ కుండానే, వారికి గ‌ట్టిగా స‌మాధానం ఇచ్చారు. వైఎస్సార్ వ్య‌తిరేక శ‌క్తుల‌తో చేతులు క‌లిపిన వీళ్లా వార‌సుల‌ని ప్ర‌శ్నించారు. వైఎస్సార్ వార‌సులెవ‌రో ప్ర‌జ‌లు తేలుస్తార‌ని ప‌రోక్షంగా ష‌ర్మిల‌కు చుర‌క‌లు అంటించారు. బ‌హిరంగ స‌భలో జ‌గ‌న్ ఏం మాట్లాడారంటే...

వైఎస్సార్‌,  జ‌గ‌న్‌పై లేనిపోని ముద్ర‌లు వేసి దెబ్బ తీయ‌డానికి చంద్ర‌బాబు, ద‌త్త‌పుత్రుడు , వ‌దిన‌మ్మ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఇటీవ‌ల ఈ కుట్ర‌లో భాగంగా వైఎస్సార్ వార‌సుల‌మంటూ కొంద‌రు ముందుకొస్తున్నార‌ని ష‌ర్మిల‌ను దెప్పి పొడిచారు. మ‌హానేత‌కు వార‌సులెవ‌రో చెప్పాల్సింది ఎవ‌రు?.... ప్ర‌జ‌లే అని ఆయ‌న అన్నారు. ఈ కామెంట్స్‌తో ష‌ర్మిల త‌న‌కు తాను వార‌సురాలిన‌ని చెబితే స‌రిపోద‌ని అన్నారు. ప్ర‌త్య‌ర్థుల కుట్ర‌లో త‌న చెల్లెళ్లు భాగ‌స్వాముల‌య్యార‌ని మండిప‌డ్డారు.

వైఎస్సార్‌పై కుట్ర‌పూరితంగా కేసులు పెట్టిందెవ‌రు? ఆయ‌న పేరును చార్జిషీట్‌లో చేర్చిందెవ‌రు? వైఎస్సార్ కీర్తి ప్ర‌తిష్ట‌ల‌ను చెరిపి వేయాల‌ని , వైసీపీకి పేరు ద‌క్క‌వ‌ద్ద‌ని, వైఎస్సార్ విగ్ర‌హాలు తొల‌గిస్తామ‌ని చెప్పిన వాళ్లు, ఆ పార్టీతో చేతులు క‌లిపిన వాళ్లా... వైఎస్సార్ వార‌సులు? అంటూ జ‌గ‌న్ నిల‌దీశారు.

అలాగే ప‌సుపు చీర క‌ట్టుకుని వైఎస్సార్ శ‌త్రువుల‌తో చేతులు క‌లిపిన వాళ్లు, ఆ పార్టీలో చేరిన వాళ్లా వైఎస్సార్ వార‌సులు? అని ప్ర‌శ్నిస్తున్నాన‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. వివేకా హ‌త్య కేసుతో అవినాష్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేద‌ని న‌మ్మ‌డం వ‌ల్లే టికెట్ ఇచ్చాన‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్‌కి ఓటు వేస్తే బాబుకి ఓటు వేసిన‌ట్టు కాదా? అని ఆయ‌న నిల‌దీశారు. మ‌న ఓట్లు చీలిస్తే కూట‌మికి లాభం కాదా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. త‌న‌కు సీఎం ప‌ద‌వి ఉన్న‌ది బంధువుల‌కు కోట్లు సంపాదించి ఇవ్వ‌డానికి కాద‌ని, ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుక‌ని ప‌రోక్షంగా ష‌ర్మిల‌కు చుర‌క‌లు అంటించారు.

బుర‌ద చ‌ల్లేందుకు చెల్లెమ్మ‌లిద్ద‌రినీ ఎవ‌రు పంపారో మీ అంద‌రికీ క‌నిపిస్తోంద‌ని జ‌గ‌న్ అన్నారు. ఈ కుట్ర‌లో ప‌సుపు మూక‌ల‌తో మ‌న చెల్లెమ్మ‌లు భాగం కావ‌డం దుర్మార్గ‌మ‌ని జ‌గ‌న్ విరుచుకుప‌డ్డారు. వైఎస్సార్‌పై కుట్ర‌లు చేసిన వాళ్లు అందించిన స్క్రిప్ట్‌లు చ‌దువుతున్న వీళ్లా వైఎస్సార్ వార‌సులంటూ ఆయ‌న నిగ్గ‌దీశారు. ఈ కుట్ర‌ల్ని ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించి త‌న‌ను, అవినాష్‌ను గెలిపించాల‌ని ఆయ‌న విన్న‌వించారు. పులివెందుల కేంద్రంగా ష‌ర్మిల‌, సునీత‌ల‌కు జ‌గ‌న్ స్ట్రాంగ్ ఆన్స‌ర్ ఇచ్చార‌ని చెప్పొచ్చు.