ఎవరు గెల్చినా నష్టం షర్మిల కే!

జగన్ గెలుస్తారా.. చంద్రబాబు అధికారం సాధిస్తారా అన్న ప్రశ్నలు పక్కన పెడితే, ఎన్నికలు ముగిసిన తరువాత ఆటలో అరటిపండుగా మిగిలిపోయేది మాత్రం వైఎస్ షర్మిల మాత్రమే.

ఎందుకంటే షర్మిల ఎంత మాత్రం నమ్మ దగిన వ్యక్తి కాదు అని అర్థం అయిపోయింది. అన్నతో గొడవల కారణంగా కావచ్చు, ఆస్తి తగాదాలు కావచ్చు. మరీ ఇంతలా రెచ్చిపోయి హడావుడి చేయడం అన్నది సరి కాదు. ఎందుకంటే ఇలాంటి వారిని ఎవరైనా దగ్గరకు తీయడానికి భయపడతారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సాధించేది ఏమీ వుండదు. అలా సాధించకపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ వ్యవహరించే తీరు వేరుగా వుంటుంది. దానికి జాలి, దయ లాంటివి ఏమీ వుండవు అనడానికి జగన్ ఉదంతమే ఉదాహరణ.

జగన్ పవర్‌లోకి వస్తే షర్మిల పరిస్థితి దారుణంగా వుంటుంది. చంద్రబాబు పవర్ లోకి వస్తే, చూసీ, చూడనట్లు పక్కన పెడతారు తప్ప, తెచ్చుకుని నెత్తిన పెట్టుకోరు. ఎందుకుంటే గతంలో షర్మిల అన్న తరపున ప్రచారం సాగించి, చేసిన ప్రసంగాలను అంత సులువుగా మరిచిపోరు. ఇప్పుడు అంటే బాబు గారికి అవసరం కనుక, క్రిస్టియన్ ఓటు బ్యాంక్ చీలుస్తుందేమో అని సైలంట్‌గా వున్నారు.

చంద్రబాబు పవర్‌లోకి వస్తే, ఏదో కిందా మీదా పడి, బతిమాలుకుని కాస్త వ్యాపారాలు సాగించుకునే అవకాశం కొంతయినా వుంటుంది. కానీ జగన్ వస్తే మొత్తం సమస్యలే. అందువల్ల అన్నింటికి షర్మిల రెడీగా వుండాల్సి వుంటుంది.