వారాహి యాత్ర వేదిక మార్పు... కార‌ణం అదేనా?

ఎట్ట‌కేల‌కు వారాహి యాత్ర‌కు ముహూర్తం ఖ‌రారైంది. గ‌తంలో తిరుప‌తి నుంచి వారాహి యాత్ర ప్రారంభం అవుతుంద‌ని జ‌న‌సేన నాయ‌కులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఆ వేదిక తిరుప‌తి నుంచి అన్న‌వ‌రానికి మార‌డం గ‌మ‌నార్హం. అన్న‌వ‌రంలో స‌త్య‌నారాయ‌ణస్వామికి పూజ‌లు నిర్వ‌హించి ఈ నెల 14న ప‌వ‌న్ వారాహి యాత్ర ప్రారంభించ‌నున్న‌ట్టు జ‌న‌సేన ముఖ్య నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్ తెలిపారు.

ఈ సంద‌ర్భంగా వారాహి యాత్ర షెడ్యూల్‌ను ఆయ‌న విడుద‌ల చేశారు. అన్నవరం దర్శనం తర్వాత పత్తిపాడు నుంచి యాత్ర మొదలవుతుందని ఆయ‌న‌ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో పవన్‌ పర్యటిస్తారని నాదెండ్ల వెల్ల‌డిం చారు. సినిమాల కమిట్‌మెంట్లు పూర్తి కాగానే ప్రజల్లోనే పవన్ ఉంటారని మనోహర్ పేర్కొన్నారు. అయితే గ‌తంలో తిరుప‌తి నుంచి వారాహి యాత్ర ప్రారంభం అవుతుంద‌ని చెప్పి, ఇప్పుడు మార్చ‌డానికి కార‌ణాలేంట‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.  

ఇందుకు ప్ర‌ధానంగా వినిపిస్తున్న కార‌ణం... కేవ‌లం త‌న సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల‌ను ఎంచుకోవ‌డం ఉత్త‌మ‌మ‌ని ప‌వ‌న్ భావించ‌డ‌మే అని మెజార్టీ ప్ర‌జానీకం అభిప్రాయ‌ప‌డుతోంది. తూర్పు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల్లో ప‌వ‌న్ సామాజిక వ‌ర్గం ఎంత బ‌లంగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అందుకే ఆ ప్రాంతాల్లో మొద‌ట వారాహి యాత్ర మొద‌లు పెడితే భారీగా జ‌నం వ‌స్తార‌ని, మంచి ఇంఫ్రెష‌న్ క్రియేట్ చేయ‌వ‌చ్చ‌ని ఎత్తుగ‌డ‌తోనే వారాహి యాత్ర వేదిక మారింద‌ని అంటున్నారు.

ఇదే తిరుప‌తిలో వారాహి యాత్ర మొద‌లు పెడితే... ఆ న‌గ‌రం వ‌రకూ ప‌వ‌న్ సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా వుండ‌డంతో జ‌నం వస్తార‌ని, ఆ త‌ర్వాత రోజుల్లో స‌మీక‌రించ‌డం క‌ష్ట‌మ‌నే అభిప్రాయంతోనే మార్పు జ‌రిగిన‌ట్టు జ‌న‌సేన నేత‌లు చెబుతున్నారు. కోస్తా జిల్లాల్లో ప‌వ‌న్ అభిమానులు, ఆయ‌న సామాజిక వ‌ర్గీయులు ఎక్కువ‌గా ఉండ‌డంతో జ‌న‌స‌మీక‌ర‌ణ‌కు ఇబ్బంది ప‌డాల్సిన అవ‌స‌ర‌మే రాద‌నే అభిప్రాయంతోనే ముంద‌డుగు వేసేందుకు సిద్ధ‌మైన‌ట్టు స‌మాచారం. 

ప‌వ‌న్ వారాహి యాత్ర‌కు ఎటూ ఆ రెండు జిల్లాల్లో జ‌నం వెల్లువెత్తుతార‌ని, ఇక రాజ‌కీయ అద్భుత‌మే తరువాయి అని ప్ర‌చారం చేసుకోడానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మవుతున్నాయి. ఏది ఏమైనా త‌న సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉన్నప్రాంతాల్లో వారాహి యాత్ర‌ను మొద‌లు పెట్టాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించ‌డంపై జ‌న‌సేన నేత‌లు ఖుషీ అవుతున్నారు.

Show comments