గొప్పగొప్ప‌ ఆలోచ‌న‌ల‌న్నీ జ‌గ‌న్‌కే!

అదేంటో కానీ, గొప్ప‌గొప్ప ఆలోచ‌న‌ల‌న్నీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కే వ‌స్తున్నాయి. ఒక‌వైపు సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, మ‌రోవైపు ఉద్యోగుల వేత‌నాల‌కు ఏ నెల‌కానెల వెతుకులాట త‌ప్ప‌డం లేదు. ఇక అభివృద్ధి ప‌నుల‌నే మాట‌నే జ‌గ‌న్ ప్ర‌భుత్వం విస్మ‌రించింద‌ని చెప్పొచ్చు.  

ఏదైనా ఉత్పాద‌క ప‌థ‌కంతో ప్ర‌భుత్వానికి ఆదాయ వ‌న‌రు తీసుకురావ‌డం ప‌క్క‌న పెట్టి, జ‌నం నుంచే వ‌సూలు కార్య‌క్రమానికి జ‌గ‌న్ తెర‌లేపారు. ఇందులో భాగంగా శ్రీ‌కారం చుట్టిందే జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ హ‌క్కు ప‌థ‌కం. ఈ ప‌థ‌కంలో భాగంగా ప్ర‌భుత్వం అక్ష‌రాలా రూ.4 వేల కోట్లను రాబ‌ట్టేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక వేసుకుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

పేద‌ల ప‌క్కా ఇళ్ల‌ను వారి సొంతం చేయ‌డానికి, వారు ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు ఆస్తి ఉప‌యోగ‌ప‌డ‌డానికే జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ హ‌క్కు ప‌థ‌కాన్ని (వ‌న్ టైమ్ సెటిల్‌మెంట్‌, ఓటీఎస్‌) ప్ర‌భుత్వం తీసుకొచ్చింద‌ని మున్సిప‌ల్‌శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. ఇది పూర్తిగా స్వ‌చ్ఛంద‌మే అని ఆయ‌న  చెప్పారు. నిర్ణీత రుసం చెల్లించి, ముందుకు వ‌చ్చిన వారికే ఆస్తిపై సంపూర్ణ హ‌క్కులు క‌ల్పిస్తూ రిజిస్ట్రేష‌న్ చేస్తార‌ని మంత్రి తెలిపారు. ఎవ‌రిపైనా ఎలాంటి ఒత్తిడి ఉండ‌ద‌న్నారు.

పేద‌లు ఆప‌ద‌లో ఉన్న‌పుడు ఇంటి ప‌ట్టాపై బ్యాంకుల్లో రుణం పొంద‌డానికి, అవ‌స‌ర‌మైతే అమ్ముకోడానికి, చ‌ట్ట‌ప‌ర‌మైన ఆస్తిగా త‌మ పిల్ల‌ల‌కు రాసి ఇచ్చేందుకు వీలు క‌ల్పిస్తూ, ఆ ఇంటిపై సంపూర్ణ హ‌క్కు క‌ల్పించాల‌నే స‌దుద్దేశంతోనే ఈ ప‌థ‌కాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీసుకొచ్చార‌ని మంత్రి చెబుతున్నారు.   

రుణం, వ‌డ్డీతో క‌లిపి ఎంత ఉన్నా ల‌బ్ధిదారులు మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో రూ.15 వేలు , కార్పొరేష‌న్ ప‌రిధిలో రూ.20 వేలతో ప‌థ‌కాన్ని అమ‌లు చేసిన‌ట్టు మంత్రి తెలిపారు. ఇవ‌న్నీ చెప్ప‌డానికి, విన‌డానికి బాగానే ఉన్నాయి.

1983 నుంచి 2011 మధ్య కాలంలో ఎవ‌రో క‌ట్టించిన ఇళ్ల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొత్త ప‌థ‌కం పేరుతో వ‌సూళ్ల‌కు దిగ‌డం ఏంట‌నేది ఇప్పుడు ప్ర‌శ్న‌. ఒక‌వైపు స్వ‌చ్ఛందం అంటూనే, మ‌రోవైపు వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ ద్వారా ల‌బ్ధిదారుల‌పై ఒత్తిడి తీసుకురావ‌డం బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. గృహ లబ్ధిదారులు ప్రభుత్వానికి రూ.14 వేల కోట్లు బకాయిలున్నారని, ఇందులో రూ.10 వేల కోట్లు మాఫీ చేసి, వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద రూ.4 వేల కోట్లు మాత్రమే వసూలు చేస్తున్నామని ప్ర‌భుత్వం ప్ర‌చారం చేయ‌డం విచిత్రంగా ఉంది.

ఖ‌జానాలో డ‌బ్బు లేక‌పోవ‌డం, పంప‌కాల‌కు త‌గిన సొమ్ము లేక‌పోవ‌డంతో, ఏదో ర‌కంగా వ‌సూలు చేసేందుకు ఇలాంటి కొత్త‌కొత్త బాదుడు ఆలోచ‌న‌లు జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేస్తోంద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి గురించి తెలిసి కూడా, విప‌రీతంగా హామీలు ఇచ్చి, వాటి అమ‌లుకు తిరిగి జ‌నంపై ప‌న్నులు విధించ‌డం జ‌గ‌న్ ప్ర‌భుత్వానికే చెల్లింద‌ని జ‌నం గ‌గ్గోలు పెడుతున్నారు. ఇలాంటి గొప్ప‌గొప్ప ఆలోచ‌న‌ల‌న్నీ మ‌న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు మాత్ర‌మే వ‌స్తాయ‌ని నెటిజ‌న్లు వెట‌క‌రిస్తున్నారు.