కొనసాగుతున్న వాయిదాల పరంపర

టాలీవుడ్ లో సినిమాలు వాయిదా పడ్డం కొత్తేంకాదు. కొన్ని నెలల కిందట క్రిస్మస్, సంక్రాంతి టైమ్ లో ఎన్ని సినిమాలు వాయిదా పడ్డాయో అందరం చూశాం. ఆ తర్వాత పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది అనుకున్నలోపే, మరోసారి సినిమాలన్నీ వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి.

ఎన్నికల కారణంగా కల్కి సినిమా ఆల్రెడీ వాయిదా పడింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ఇంకా కొత్త విడుదల తేదీని ప్రకటించలేదు. ఈసారి డేట్ ఇస్తే వాయిదా వేయకూడదనే కృతనిశ్చయంతో ఉంది యూనిట్.

ఇక నారా రోహిత్ కమ్ బ్యాక్ మూవీ ప్రతినిధి-2 కూడా పోస్ట్ పోన్ అయింది. మరికొన్ని గంటల్లో రిలీజ్ అవుతుందనగా, సినిమాను అర్థాంతరంగా వాయిదా వేశారు. కొత్త విడుదల తేదీ ఇంకా చెప్పలేదు.

అటు దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన లవ్ మీ సినిమాను కూడా వాయిదా వేశారు. సరిగ్గా నెల రోజులు పోస్ట్ పోన్ చేసి, మే 25ను కొత్త విడుదల తేదీగా ప్రకటించారు.

ఇక చిన్న సినిమాల సంగతి సరేసరి. బాక్ లాంటి 3-4 సినిమాలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి కృష్ణమ్మ కూడా చేరింది. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమాను మే 10న విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు.

ఎన్నికల హడావుడి ముగిసి, సెన్సార్ సమస్యలు తీరితే తప్ప, టాలీవుడ్ లో మరోసారి ఈ వాయిదాల పర్వం ఆగేలా లేదు.