కోమటి: ఈసీకి వివరణలో కూడా అదే బరితెగింపు!

ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘిస్తే, నియమాలకు విరుద్ధంగా ఓటర్లను ప్రలోభపెట్టాలనిచూస్తే, వారి ఓట్లను కొనుగోలు చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నట్టు తెలిస్తే ఎన్నికల సంఘం ఊరుకోదు. నోటీసులు జారీచేస్తుంది.

ఈసీ దృష్టిలో మామూలు వ్యక్తులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు అనే వ్యత్యాసం కూడా ఉండదు. ప్రజాస్వామ్యామ్యాన్ని అపహాస్యం చేసే ఇలాంటి పెడపోకడలు కనిపించినప్పుడు ఎంతటివారైనా సరే ఈసీ ఒకేరీతిగా స్పందిస్తుంది. ఎన్నారైలు అయినంత మాత్రాన వారికి కొమ్ములు వచ్చి ఉంటాయని అనుకోవడానికి వీల్లేదు. వారిని ప్రత్యేకంగా పరిగణించేది కూడా ఉండదు.

ఆ క్రమంలో ఓటర్లను కుటుంబాలకు కుటుంబాలుగా లక్షల రూపాయలు ఖర్చు చేసి అయినా కొనేయాలని, వారితో ఈ ఒక్కసారికి తెలుగుదేశానికి అనుకూలంగా ఓటు వేయించాలని ఎన్నారైలందరికీ కర్తవ్యోపదేశం చేసిన ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ కోమటి జయరామ్ విషయంలో మాత్రం ఈసీ ఎందుకు ఉపేక్షిస్తుంది. కానీ ఆ నోటీసులకు ఆయన ఇచ్చిన జవాబు.. ఆయనలోని అహంకారాన్ని మరింతగా చాటిచెబుతోంది. 

తెలుగుదేశాన్ని గెలిపించడానికి అమెరికానుంచి తరలివచ్చి.. ఇక్కడి ఓటర్లను ప్రభావితం చేయడానికి తన శక్తివంచన లేకుండా పనిచేస్తున్న కోమటి జయరాం ఇటీవల ఎన్నారై తెలుగుదేశం వారితో ఒక సమావేశం నిర్వహించారు.

భార్యా పిల్లల కోసం తప్పించే కుటుంబాలు ఉంటాయి. ఆ దిశగా ప్రలోభ పెట్టి ఆయా కుటుంబాలను లొంగదీసుకోవాలని ఉపదేశం చేశారు. గ్రామాల్లో మనకు అర్థమైపోతుంది. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా తెలుగుదేశానికి ఓటు వేయని- కుటుంబాలను టార్గెట్ చేయండి. వారిని ప్రలోభ పెట్టి లొంగదీసుకోండి. డబ్బుకు మాత్రమే లొంగేవాళ్లయితే డబ్బు ఖర్చు పెట్టండి. రెండు మూడు లక్షలు ఈ సమావేశంలో ఉన్నవారికి (ఎన్నారైలకు) పెద్ద సంగతి కాదు. ఖర్చు పెట్టండి వారి ఓట్లు తెలుగుదేశానికి పడేలా చేయండి’’ అంటూ నీతి తప్పి ఉపదేశాలు చేశారు కోమటిజయరాం. 

ఓట్ల కొనుగోలు ఇప్పటి రాజకీయ వ్యవస్థలో సర్వత్రా జరుగుతున్నదే గానీ.. ఇంతగా బరితెగించి బాహాటంగా సమావేశాల్లో అలాంటి ఉపదేశాలు ఇవ్వడం ఎక్కడాలేదు. మాంసం తిన్నాం కదా అని ఎముకలు మెడలో వేసుకుని తిరిగినట్లుగా ఆయన వ్యవహారం మారింది. సహజంగానే దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. నోటీసులు జారీ అయ్యాయి. ఆ నోటీసులకు కోమటి జయరాం ఇచ్చిన సమాధానం మరింత అహంకారి పూరితంగా ఉంది. 

‘నచ్చిన పార్టీకి ప్రచారం చేసుకునే హక్కు ఎన్నారైగా తనకు ఉన్నదని’ కోమటి పేర్కొన్నారు. భారత దేశ చట్టాల్ని గౌరవిస్తున్నానని కూడా అన్నారు.

ఆయన హక్కును ఎవ్వరూ కాదనలేదు. ఇక్కడ ఓటర్లను కొనడానికి ఎన్నారైలను ప్రేరేపించడం గురించి కదా చర్చ. ప్రజలకు లంచాలిచ్చి ప్రభావితం చేయాలన్నానంటూ తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని బరితెగించి అబద్ధాలాడుతున్నారు.

స్పష్టంగా వీడియోల్లో దొరికిపోయిన తర్వాత కూడా ఆయన బుకాయింపు మరీ హేయంగా ఉంది. ఆయన అహంకారం ఎంతగా శ్రుతిమించి ఉన్నదంటే.. వైసీపీ వాళ్లు కావాలనే ఫిర్యాదు చేశారని, ఈసీ తనమీద తదుపరి చర్యలు తీసుకోకుండా నిలిపివేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఈసీ ఏం చేయాలో కూడా కోమటి జయరాం చెప్పేస్తున్నారు. ఎన్నారై అయినంత మాత్రాన తనకు కొమ్ములు వచ్చాయని కోమటి అనుకుంటున్నారేమో తెలియదని ఆయన వివరణ చూసిన ప్రజలు విస్తుపోవడం విశేషం.