అపర చాణక్యుడు అమిత్‌ షా

ఆయన ఎక్కడుంటారో కీలకమైన భారతీయ జనతాపార్టీ కార్యకర్తలకు తప్ప చాలా తక్కువ మందికి తెలుసు. ఒకరోజు హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఉంటారు, మరోరోజు ఒడిషాలోని మారుమూల ప్రాంతాల్లో పర్యటిస్తుంటారు. ఆయన ప్రతి పర్యటన వెనుకా, ప్రతి చర్య వెనుకా ఒక వ్యూహం ఉంటుంది. ఆయన ధ్యేయం ఒక్కటే దేశమంతా భారతీయ జనతా పార్టీ కాషాయ ధ్వజం రెపరెపలాడించడమే. ఆయన మా  ప్రాంతంలోకి రాడని, రాలేడని ఎవరైనా అనుకుంటే వారు పొరపాటు చేసినట్లే. ఆయన తలుచుకుంటే దేశంలో ఎక్కడైనా భారతీయ జనతా పార్టీని గెలిపించగలరు.ఆయనే అమిత్‌ షా.

ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం తర్వాత అమిత్‌ షా శక్తియుక్తుల్ని ఎవరైనా తక్కువ అంచనా వేస్తే వారంత మూర్కులు ఉండరు. ఒకప్పుడు కేవలం గుజరాత్‌కే పరిమితమైన అమిత్‌ షా ఇప్పుడు దేశమంతటా విస్తరించారు. దేశంలో అనేక చోట్ల ప్రజల నాడి తెలుసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ లో అఖిలేష్‌ యాదవ్‌- రాహుల్‌ కలయిక వల్ల సమాజ్‌ వాది పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని, బీజేపీ దెబ్బతింటుందని అనేకమంది ఊహించిన సమయంలో బీజేపీ 300 సీట్లకు పైగా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేసిన ఏకైక నేత బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఒక్కరే. ఫలితాలకు ఒక్కరోజు ముందుగా ఆయన ఆయన అంచనాలను ప్రకటించారు. బిజెపి చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున పార్టీకి ఘన విజయాలను సాధించి పెట్టిన మరొక పార్టీ అధ్యక్షుడు లేరు. 

నిజానికి అమిత్‌ షాను ఢిల్లీకి తీసుకువచ్చినప్పుడు, ఆయనను పార్టీ కార్యదర్శిగా నియమిచి ఉత్తరప్రదేశ్‌ బాధ్యతలు అప్పజెప్పినప్పుడు ఢిల్లీ నేతలు చాలా మంది ఈ గుజరాత్‌ వాడికి ఏమి తెలుసని పెదవి విరిచారు. అసలు మోడీని ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించినప్పుడే అద్వానీ తదితరులు అలిగారు. ఇక అమిత్‌ షాను వ్యతిరేకించకుండా ఉంటారా? 2014 ఎన్నికలకు ముందే మోడీ, అమిత్‌ షా ద్వయం యూపీపై కన్నువేశారనడానికి ఇది నిదర్శనం. మోడీ హవా అప్పటికే జాతీయ స్థాయిలో రెపరెపలాడుతుండడంతో బీజేపీ నేతలు అమిత్‌ షాను ఢిల్లీకి తీసుకురాక తప్పలేదు. ఇక అమిత్‌ షా తనకు అప్పజెప్పిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసి బీజేపీకి యూపీలో దాదాపు 80 లోక్‌సభ సీట్లు సాధించి, నరేంద్రమోడీ ప్రధానమంత్రి కావడంలో కీలకపాత్ర పోషించిన తర్వాత ఆయనకు తిరుగులేకుండా పోయింది. మోడీ అభీష్టానుసారం అమిత్‌ షాను పార్టీ అధ్యక్షుడుగా నియమించారు. దీనిపై కూడా గొణుగుడు వినపడింది కాని మోడీ ఆకర్షణ వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అది సద్దుమణిగింది.

తనకు 16వ ఏడు వచ్చేవరకూ అమిత్‌ షా గుజరాత్‌లోని ఒక చిన్న గ్రామం మాన్సాలోనే ఉండిపోయారు. స్కూలు విద్యపూర్తయిన తర్వాతే ఆయన కుటుంబం అహ్మదాబాద్‌ అడుగుపెట్టింది. దేశభక్తుల చరిత్రలు విని ప్రభావితుడైన అమిత్‌ షా తన 17వ ఏట ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. అఖిల భారత విద్యార్థి పరిషద్‌లో దాదాపు నాలుగేళ్లు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. నరన్‌ పురా అనే చిన్న వార్డులో బీజేపీని గెలిపించే పని తొలుత ఆయనకు పార్టీ అప్పజెప్పింది. అక్కడ పోల్‌ ఎజెంట్‌గా ఆయన తన బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించి పార్టీ గెలుపుకు కారణం కావడంతో ఆయనను నరన్‌ పురా పార్టీ సెక్రటరీగా నియమించారు. ఆతర్వాత క్రమంగా ఎదుగుతూ బీజేపీ యువమోర్చా జాతీయ కోశాధికారిగా మారారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, ఉపాధ్యక్షడుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏ బాధ్యతలు నిర్వర్తించినా పార్టీ విస్తరణనే కర్తవ్యంగా ఆయన భావించారు. రామజన్మభూమి ఉద్యమం, ఏక్తాయాత్ర సందర్బంగా గుజరాత్‌లో భారీఎత్తున జన సమీకరణ చేసినప్పుడు ఆయన శక్తి యుక్తులు అందరికీ అర్థమయ్యాయి. అద్వానీ అహ్మదాబాద్‌లో పోటీ చేసినప్పుడు ఆయన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టింది షాయే. దాదాపు రెండు దశాబ్దాలుగా అద్వానీ గుజరాత్‌లో విజయం సాధించడానికి అమిత్‌ షా తెరవెనుక పాత్ర పోషించారన్న విషయం చాలా తక్కువమందికి తెలుసు. అటల్‌ బిహారీ వాజపేయి గాంధీనగర్‌ నుంచి పోటీ చేసినప్పుడు కూడా అమిత్‌ షా ఆయన ఎన్నికల మేనేజర్‌గా పనిచేశారు. 

1990లో నరేంద్రమోడీ, అమిత్‌ షాలు చేతులు కలిపారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మలచడంలో ఇద్దరి కృషి చెప్పుకోదగ్గది. అప్పుడు బీజేపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శిగా అమిత్‌ షా రాష్టమంతటా బీజేపీ ప్రాథమిక సభ్యులను చేర్చి పార్టీని బలోపేతం చేశారు. ఆ తర్వాత  సర్కేజ్‌లో ఎన్నికల బరిలో దిగి ఎమ్మెల్యేగా మారారు. 1998లోనే ఆయన లక్షా 30వేల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా ఉంటూనే పార్టీని పటిష్టం చేసే బాధ్యతలు నిర్వర్తించారు. గుజరాత్‌ సహకార ఉద్యమంలో చురుకుగా పాల్గొని సహకార సంఘాల ఎన్నికల్లో బీజేపీకి ఘనవిజయం తెచ్చిపెట్టారు. తాను స్వయంగా అహ్మదాబాద్‌ జిల్లా సహకార బ్యాంకు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించి ఏడాదిలో ఆ బ్యాంకు లాభాల బాట పట్టేలా చేశారు. దీనితో పార్టీ 2001లో ఆయనను బీజేపీ సహకార కమిటీకి జాతీయ స్థాయిలో కన్వీనర్‌గా నియమించింది. అదే మొదటి ఆయన జాతీయస్థాయి నియామకం. మోడీ అధికారంలోకి రాకముందు అమిత్‌ షా గుజరాత్‌లో గౌరవయాత్ర నిర్వాహకుడా పార్టీని బలోపేతం చేశారు. మోడీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పార్టీ విజయాలకు వ్యూహరచన చేశారు. మోడీ మంత్రివర్గంలో హోం, రవాణా, మద్యనిషేదం, పార్లమెంటరీ వ్యవహారాలు, న్యాయ, ఎక్సైజ్‌ వంటి కీలక శాఖల్ని నిర్వహించారు. వారిద్దరూ కలిశాక బీజేపీ విజయపరంపరకు తిరుగులేకుండా పోయింది.

అమిత్‌ షా గత రెండు సంవత్సరాలుగా తనకు జాతీయ స్థాయిలో అప్పజెప్పిన బాధ్యతలు అద్భుతంగా నిర్వర్తించారనే చెప్పాలి. ఢిల్లీ, బీహార్‌ ఎన్నికల్లో తప్ప దేశమంతటా ఆయన పార్టీ జెండా రెపరెపలాడించడంలో కృతకృత్యులయ్యారు. దక్షిణాన, తూర్పు ప్రాంతాల్లో, ఈశాన్య ప్రాంతాల్లో ఎక్కడ చూసినా బీజేపీ కనపడేలా చేశారు. బీజేపీ కేవలం ఉత్తరాది పార్టీ అన్న ముద్ర తొలగించడంలో ఆయన పూర్తిగా విజయవంతం అయ్యారు. ఒక పార్టీగా బీజేపీని సుస్థిరం చేశారు. అమిత్‌ షా అంటే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. తాను బీజేపీని కన్యాకుమారి నుంచి లడఖ్‌ వరకు, కచ్‌ నుంచి కామరూప్‌ వరకు విస్తరింపచేస్తానని, బీజేపీకి కనీసం ప్రాతినిధ్యం ఉండేలా చూస్తానని తాను అధ్యక్షుడైన కొత్తలో చేసిన ప్రకటనను అమిత్‌ షా నిలబెట్టుకున్నారు. 2016 ఎన్నికల్లో కేరళ, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రవేశించిన తీరు ఎంతో ముఖ్యమైనది. ఒకప్పుడు బీజేపీ అంటే తెలియని ఈ రాష్ట్రాల్లో బీజేపీకి ఓటుశాతం పెద్దఎత్తున పెరిగింది. కేరళలో బీజేపీ అసెంబ్లీ సీటును సాధించగలిగింది. పశ్చిమబెంగాల్‌తో ఖాతా తెరిచింది. దీన్ని బట్టి షా వ్యూహ రచన మనకు అర్థమవుతున్నది. ఆ తర్వాత అస్సాంలో బీజేపీ విజయం సాధించడం, ప్రభుత్వం ఏర్పాటు చేయడం  మామూలు విషయం కాదు. అస్సాంలో అస్సాం గణ పరిషద్‌ వచ్చిన రోజులు ప్రక్కన పెడితే కాంగ్రెస్‌ లేకుండా ఆ రాష్ట్రంలో పాలన సాగలేదు. ఇక ఒడిషా మారుమూల గ్రామాల్లో సైతం బీజేపీ చొచ్చుకుపోయి బిజూ జనతాదళ్‌ కోటల్ని విచ్ఛిన్నం చేయడం సాధారణ విజయంకాదు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కూడా షా బీజేపీని ప్రవేశపెట్టగలిగారంటే అది పెద్ద సైద్దాంతిక విజయం అని చెప్పక తప్పదు. అమిత్‌ షాకు హిందీ సరిగా రాదని, ఉత్తరాది ప్రాంతాల నాడిని కనిపెట్టలేరని వ్యాఖ్యానించిన వారి నోళ్లు కట్టుబడేలా చేశారు. ఆయనకు దేశమంతటా ప్రజలనాడిని, స్థానిక రాజకీయ పరిస్థితులను అంచనా వేయగలిగిన శక్తి ఉన్నదని క్రమంగా అందరికీ అర్థం అవుతున్నది.

ఉత్తరప్రదేశ్‌లో కూడా ఆయన 2014 ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటినుంచే తన పని ప్రారంబించారు. యూపీ అంతటా మొత్తం 398 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన తిరిగారు. అక్కడ తన మనుషులెవరో, కులసమీకరణలేమిటో ఆయన గుర్తించారు. స్థానిక ఎమ్మెల్యేలను, ఎంపీలను పెద్దగా సంప్రదించలేదు. అభ్యర్థుల ఎంపీకలో తన స్వంత సర్వేలపై ఆధారపడ్డారు. తమను సంప్రదించలేదని పెద్దఎత్తున రణ గొణధ్వనులు వినపడ్డా ఆయన పట్టించుకోలేదు. యూపీలో బీజేపీ ఓడిపోతుందని అమిత్‌ షా తమను విస్మరించడాన్ని సహించలేని బీజేపీ ముఖ్యనేతలు కూడా ప్రచారం చేశారు. ప్రతి ప్రాంతం గురించి తనకు కావల్సిన సమాచారాన్ని సేకరించడం అమిత్‌ షా చేసే పని. ఆ తర్వాత ఆ సమాచారం ఆధారంగా ఎత్తుగడలు వేసేందుకు ఆయన అహర్నిశలు కృషి  చేస్తారు. నిజానికి గుజరాత్‌లో అమిత్‌ షా ప్రవేశించకుండా యూపీఏ సర్కార్‌ కోర్టు ద్వారా ఆంక్షలు విధింపజేయడం ఆయనకు వరంగా పరిణమించింది. ఆ కాలంలో ఆయన యూపీ అంతటా తిరిగి భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారు. పెద్ద నోట్లను రద్దు చేస్తానని మోడీ చెప్పినప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్లమని చెప్పిన పార్టీ నేత అమిత్‌ షా ఒక్కరే. నోట్ల రద్దుపై ప్రజావ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ దాన్ని తెలివిగా అనుకూలంగా మలుచుకునేందుకు ప్రచార సరళిని మార్చిన ఘనుడు అమిత్‌ షా.

అమిత్‌ షా ప్రత్యేకత కులతత్వానికి, వారసత్వానికి, మతం పేరుతో బుజ్జగించడానికి వ్యతిరేకంగా పనిచేయడం. ఆయన అడుగుపెట్టిన ప్రతిచోటా ఆయన ఈ అడ్డంకులను అధిగమించారు. కాంగ్రెస్‌ తదితర పార్టీలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే ఆడుతుంటే, కులతత్వ, మతతత్వ శక్తులనుప్రోత్సహిస్తుంటే అమిత్‌ షా వాటికకి అతీతమైన రాజకీయాలు ఆడారు. వెనుకబడిన కులాల్లో మరీ వెనుకబడిన కులాలపై, దళితుల్లో మరీ దళితులపై దృష్టి కేంద్రీకరించారు. ఒకవైపు నరేంద్రమోడీ ఆకర్షణను, అభివృద్ది మంత్రాన్ని మధ్యతరగతిని, అగ్రవర్ణాలను, మేధావులను తమ వైపుకు తిప్పుకునేందుకు ఉపయోగించుకుంటూనే క్రింది నుంచి చిన్న చిన్న వర్గాలపై ఆయన దృష్టి పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లో ఒక్క ముస్లింకు సీటు ఇవ్వకుండా ఆయన అత్యధిక సీట్లను సాధించగలగడం ఎవరూ ఊహించలేనని ప్రయోగం. ఆఖరుకు ముస్లిం నియోజకవర్గాల్లో కూడా బీజేపీ ఘన విజయం సాధించేలా ఆయన వ్యూహరచన చేశారు. ఫలానా కులాలు కలిస్తే విజయం తప్పదని భావించే పరిస్థితి లేకుండా పోయింది. 

పాతకాలపు సమీకరణలు అన్నీ కొట్టుకుపోయాయి. ఈ దేశంలో కుల రాజకీయాలకు, మత రాజకీయాలకు అతీతంగా బీజేపీ విజయం సాధించగలుగుతున్నదంటే అది అమిత్‌ షా వల్లే సాధ్యమైంది. ఇది అత్యంత ఆరోగ్యకరమైన పరిణామం. నిజానికి కులరాజకీయాలను, మత రాజకీయాలను ప్రజలు తీవ్రంగా అసహ్యించుకుంటున్నారని, అవి తాత్కాలికంగా నెగ్గినా శాశ్వతంగా వాటి వల్ల విజయం సాధించడం కష్టమని అమిత్‌ షా గ్రహించి ఒక విశాల ప్రాతిపదికగా రాజకీయాలను అవలంబించారు. యూపీ విజయం తర్వాత ఏ రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించలేదో చెప్పడం కష్టమైంది. తన దృష్టి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, ఓడిషా, కర్ణాటకలపై ఉన్నదని అమిత్‌ షా ఏనాడో చెప్పారు. పశ్చిమబెంగాల్‌, కేరళలో కూడా చొచ్చుకుపోతానని చెప్పారు. 2019 నాటికి అమిత్‌ షా వ్యూహరచన ఫలించే అవకాశాలు లేవని పూర్తిగా చెప్పలేం.

Show comments