బాబుకు అనుకూలంగా భలే టర్న్ తీసుకున్నారు

తెలంగాణ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఏపీలో కూడా టీడీపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. బాబు కుతంత్రాలు పొరుగురాష్ట్రం ఎన్నికల్లో పనిచేయలేదని అర్థమైంది. ఏపీలో రాబోయే ఎన్నికల్లో కూడా చంద్రబాబుకు ఇదే గతి పడుతుందని జనం ఫిక్స్ అయిపోయారు. అయితే కేసీఆర్ విజయాన్ని మరో కోణంలో జనంపై రుద్దేలా చూస్తున్నారు చంద్రబాబు అండ్ టీమ్.

ఈ మేరకు టీడీపీ అనుకూల మీడియా తిమ్మిని బమ్మిని చేసేపనిలో బిజీ అయింది. తెలంగాణలో టీఆర్ఎస్ అభివృద్ధి పథకాలే గులాబీ దళాన్ని గెలిపించాయని టీడీపీ నేతలు రాగాలు తీస్తున్నారు. ఇంతవరకు ఓకే. దీని కొనసాగింపే కాస్త ఇబ్బందిగా ఉంది. అవే అభివృద్ధి పథకాలు ఏపీలో కూడా టీడీపీని మరోసారి పీఠమెక్కిస్తాయనేది వీరి మాటల సారాంశం.

రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి పథకాలకు ప్రజాదరణ ఉందని, అందుకే కేసీఆర్ కి ప్రజా దీవెన లభించిందని.. ఏపీలో కూడా చంద్రబాబు పథకాలకు ఆకర్షితులైన జనం ఆయనకు పట్టం కడతారని అంటున్నారు.

పథకాల పేర్లు, వాటి తీరు ఒకటే అయినా అమలు విషయంలో తెలంగాణకు, ఏపీకి చాలా తేడా ఉంది. కేసీఆర్ మాటమీద నిలబడి రైతు రుణమాఫీని అమలు చేశారు. చంద్రబాబు మాఫీ పేరుతో రైతులను నిలువునా మోసం చేశారు.

ఉచిత విద్యుత్ తో తెలంగాణ రైతులు సంతోషంగా ఉంటే, ఏపీలో మాత్రం ఇది పక్కాగా అమలు కాలేదు. మిషన్ భగీరథ, రైతుబంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాలు తెలంగాణలో బాగా సక్సెస్ అయ్యాయి. చివరిగా పెట్టిన కంటి వెలుగు పల్లెల్లో కేసీఆర్ ఇమేజ్ ని రెట్టింపు చేసింది.

ఇక ఏపీ విషయానికొస్తే అభివృద్ధి తక్కువ, అవినీతి ఎక్కువ. ప్రతి పథకంలో దోపీడీకి తెరలేపారు టీడీపీ నేతలు. నీరు-చెట్టులో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత. రైతుల పేరుతో సబ్సిడీలు దిగమింగారు. పనిముట్లు ఇస్తున్నామంటూ కలరింగ్ ఇచ్చారు.

రుణాల మంజూరులో నేతలే కమీషన్లు వసూలు చేశారు. మొత్తంగా ప్రచారం ఎక్కువ, ప్రభావం తక్కువ. ఇదీ ఏపీలో పథకాల పరిస్థితి. మరి తెలంగాణలో అధికార పక్షం గెలిచినట్టు, ఏపీలో కూడా అధికార పార్టీ ఎలా గెలుస్తుంది?

Show comments