వైసీపీలో చ‌ల్లార‌ని కోపాగ్ని!

డీఎస్పీల బ‌దిలీల్లో వైసీపీ స‌ర్కార్ ప‌రిపాల‌నా వైఫ‌ల్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల ఏడాది కావ‌డంతో త‌మకు అనుకూల‌మైన పోలీస్ అధికారుల‌ను వేయించుకోవాల‌ని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోరుకోవ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైన అంశం. అయితే దీన్ని కూడా వివాదం చేసుకోవ‌డం వైసీపీ స‌ర్కార్‌కే చెల్లింది. ఎమ్మెల్యేలు, మంత్రుల మాట‌కు ఎంత మాత్రం విలువ ఇస్తున్నారో డీఎస్పీల బ‌దిలీల్లో రేగిన అసంతృప్తే నిద‌ర్శ‌నం.

ఒంగోలు డీఎస్పీ బ‌దిలీ విష‌య‌మై స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి ఏకంగా సీఎం వ‌ద్ద పంచాయితీ పెట్టారు. చివ‌రికి ఆయ‌న వ‌ద్ద‌నుకున్న డీఎస్పీని రోజుల వ్య‌వ‌ధిలో బ‌దిలీ చేయ‌డం, కొత్త వ్య‌క్తిని వేయ‌డం చ‌కచ‌కా జ‌రిగిపోయాయి. ఈ నేప‌థ్యంలో ప‌ది రోజుల క్రితం, అలాగే తాజా బ‌దిలీల వ్య‌వ‌హారంపై వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల్లో కోపాగ్ని ర‌గులుతూనే వుంది. ప‌ల్నాడు జిల్లాలోని ఒక మంత్రి, అలాగే డిప్యూటీ స్పీక‌ర్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్టు స‌మాచారం.

డీఎస్పీ బ‌దిలీల వ్య‌వ‌హారంలో త‌మ మాట చెల్లుబాటు కాని విష‌యాన్ని ప్ర‌భుత్వ పెద్ద‌ల దృష్టికి వారు తీసుకెళ్లిన‌ట్టు స‌మాచారం. అయితే బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు చెందిన మంత్రి, అలాగే నోరు లేని డిప్యూటీ స్పీక‌ర్ కావ‌డంతో వారి ఆవేద‌న‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ని స‌మాచారం. 

డీఎస్పీ బ‌దిలీల వ్య‌వ‌హారంలో కొన్ని చోట్ల భారీ మొత్తంలో చేతులు మారిన‌ట్టు తెలిసింది. కేవ‌లం ముఖ్య‌మంత్రి సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లకు మాత్ర‌మే ప‌లుకుబ‌డి వుంద‌ని, మిగిలిన వారి విన్న‌పాల‌ను ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేద‌ని అధికార పార్టీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు వాపోవ‌డం గ‌మ‌నార్హం.

ఇలాగైతే ఎన్నిక‌ల‌ను తాము ఏ విధంగా చేసుకోవాల‌ని వారి ప్ర‌శ్న‌. త‌మ‌కు అంగీకారం లేని పోలీస్ అధికారులతో ఏ విధంగా ప‌ని చేయించుకోవాలో అర్థం కావ‌డం లేద‌ని కొంద‌రు అధికార పార్టీ నేత‌లు వాపోతున్నారు. సీఎంవో అధికారుల అతి జోక్యం, వారి సొంత నిర్ణ‌యాల వ‌ల్లే ఈ దుర‌వ‌స్థ ఏర్ప‌డింద‌నేది వారి అభిప్రాయం. 

Show comments