జోక్: మోడీ విదేశీ పర్యటనలపై యనమల ఫైర్!

తాము చేస్తే సంసారం.. వేరే వాళ్లు చేస్తే వ్యభిచారం... తెలుగుదేశం పార్టీ నేతల్లో ఇది అణువణువునా ఇమిడిపోయిన తత్వం. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనల విషయంలో మోడీని విమర్శించాడు. ఒకవైపు తను ఏ విషయంలో తీవ్రంగా విమర్శల పాలవుతున్నానో.. అదే పని చేస్తున్నాడని మోడీని విమర్శించాడు చంద్రబాబు నాయుడు. తను విదేశీ పర్యటనలకు వెళ్లి గొప్పగొప్పవి సాధించుకు వస్తున్నాను అని, మోడీ మాత్రం దండగ తిరుగుడు తిరుగుతున్నాడని చంద్రబాబు నాయుడు అన్నాడు.

ప్రధానమంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లడం భారత దేశానికి కొత్త కాదు. గతంలో మన్మోహన్ కూడా వెళ్లాడు. అయితే మన్మోహన్ కన్నా మోడీ ఎక్కువగా వెళ్లాడు ఇదైతే వాస్తవమే. అయితే ఈ విషయంలో మోడీని విమర్శించే అర్హత చంద్రబాబుకు ఉందా? అనేది ప్రజలకు తెలిసిన అంశమే. తనేదో ఏపీకి ప్రధానమంత్రిని, ఏపీకి ఒక విదేశాంగ శాఖ ఉందన్నట్టుగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తూ వస్తున్నాడు నాలుగేళ్ల నుంచి.

ఇదంతా ఎవరికీ తెలియని విషయం ఏమీ కాదు. మోడీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో చంద్రబాబు విదేశాల్లో పర్యటించాడు. ఇక కేవలం బాబు మాత్రమే కాదు, ఏపీలోని ప్రతి శాఖ మంత్రి కూడా విదేశాలు పట్టుకు తిరిగారు. ఆఖరికి అధికారులు కూడా లెక్కకు మించి విదేశీ పర్యటనలు చేసిన విషయం దాస్తే దాగేది కాదు. లోకేష్, నారాయణ, పల్లె రఘునాథరెడ్డి.. వంటి వాళ్లు నాలుగేళ్లలో చాలా విదేశీ పర్యటనలే చేశారు.

ఇక వీరికి ఏ మాత్రం తీసిపోని ఘనుడు యనమల. ఈయన సింగపూర్ పర్యటన పెద్ద వివాదం అయ్యింది కూడా. పన్ను పోటుకు ట్రీట్ మెంట్ కోసం సింగపూర్ వెళ్లి, లక్షల రూపాయల బిల్లులను ఖజానాపై మోపిన ఘనుడు ఈయన. ఈ విషయంలో యనమలను నెటిజన్లు ఏకేశారు కూడా. ఇప్పుడు కామెడీ ఏమిటంటే.. యనమల స్పందిస్తూ.. మోడీని విమర్శిస్తూ.. విదేశీ పర్యటనల విషయంలో విరుచుకుపడ్డాడు. మోడీ దండగ మారి పర్యటనలు చేశాడని ఈయన విమర్శిస్తున్నాడు. ఆఖరికి యనమల కూడా విదేశీ పర్యటనల విషయంలో విమర్శలు చేస్తూ ఉండటానికి మించిన జోక్ ఏముంటుంది?

Show comments