అసలు పవన్ పోటీ చేస్తారా.. జనసైనికుల్లో కొత్త డౌట్

2024 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేస్తారా లేదా..? అనుమానం ఎందుకు.. కచ్చితంగా పోటీ చేస్తారు.. ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో నామినేషన్ వేస్తారు. కానీ ఎక్కడో చిన్న డౌట్ కొడుతోంది. 

ఇప్పటికే చంద్రబాబుతో పొత్తు అంటున్నారు, ఆ పొత్తులో ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు. వచ్చిన వాటిలో రెండు పవన్ కల్యాణ్ తీసుకుంటే, ఖర్మ కాలి రెండుచోట్లా పోటీచేసి ఓడిపోతే అప్పుడు తలెక్కడ పెట్టుకోవాలి. అందుకే ఈసారి ప్రయోగం చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మాయావతిలాగా ఎన్నికలకు తాను దూరం అని చెబుతారేమోననే అనుమానం జనసైనికుల్లో ఉంది.

ప్రచార సారధిగా మాత్రమే ఉండి, వీలైనంతమంది ఎమ్మెల్యేలను జనసేన నుంచి గెలిపించుకునే ఆలోచన చేస్తున్నారట పవన్ కల్యాణ్. టైమ్ బాగుండి కూటమి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవితో మంత్రివర్గంలోకి వద్దామనుకుంటున్నారట. 2019లో వచ్చిన రిజల్ట్ రిపీటైతే మాత్రం తాను పోటీచేయలేదు కాబట్టి, ఓటమి భారం తనపై ఉండదనే సేఫ్ గేమ్ ఆడబోతున్నారట. అందుకే ఇప్పటి వరకూ ఆయన నియోజకవర్గం సెట్ చేసుకోలేదట.

ఇందులో ఎంత నిజం ఉందో మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. 30 ఏళ్లకు పైగా కుప్పంలో గెలుస్తూ వస్తున్న చంద్రబాబే ఎన్నికలకు రెండేళ్ల ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. కుప్పంలో సొంత ఇల్లు కట్టుకుంటున్నారు.

ఇక నారా లోకేష్ కూడా మంగళగిరిలో తోపుడు బండ్లు పంచుతూ, పెళ్లి కి గిఫ్ట్ లు పంపిస్తూ తనదైన శైలిలో వెళ్తున్నారు. మరి పవన్ కల్యాణ్ కి ఏమైంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ఇప్పటికే ఆయన ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవాల్సింది. కానీ అది జరగలేదు. కనీసం ఆ ఆలోచన కూడా ఆయనకు ఉన్నట్టు లేదు.

కాసేపు ఉత్తరాంధ్ర అంటారు, ఇంకాసేపు రాయలసీమ అంటారు.. ఎక్కడా గురి కుదరలేదు. ఈలోగా రెండు మూడుసార్లు సర్వేలు కూడా చేశారు. కానీ ఎక్కడా జనసేనకు అనుకూల పవనాలు లేకపోవడంతో.. పవన్ కల్యాణ్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మాయావతి ఫార్ములా ఫాలో అయిపోదామనుకుంటున్నారు.

యూపీ ఎన్నికల్లో మరోసారి విజయం బీజేపీదే అని ఖాయమని తెలిసిన తర్వాత, మాయావతి సడన్ గా అస్త్ర సన్యాసం చేశారు. ఎస్పీ, కాంగ్రెస్ రెచ్చిపోయినా తాను మాత్రం తగ్గే ఉన్నారు. పైగా తాను పోటీకి దూరంగా ఉంటూ రాజకీయం చేశారు. చివరకు పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. 

ఇక్కడ పవన్ కల్యాణ్ కూడా ఆ ఫార్ములా ప్రకారం తాను పోటీకి దూరంగా ఉందామనే ఆలోచనలో ఉన్నారట. అదే జరిగితే జనసైనికులు మరింతగా డీలా పడటం ఖాయం. పవన్ మనసులో ఉన్న ఈ ప్లాన్-బి అమలైతే మాత్రం.. ఆయన అసెంబ్లీకి ఇంకో ఐదేళ్లు దూరమైనట్టే.

Show comments