ముగ్గురు యాంకర్లు ఔట్.. ఆ ఛానెల్ లో ఏం జరిగింది?

దాదాపు 2 వారాలుగా ఈ వ్యవహారం నడుస్తోంది. కానీ బయటకు మాత్రం రాలేదు. అదంతా ఇంటర్నల్ ఇష్యూ అనుకున్నారంతా. కానీ ఎప్పుడైతే విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిందో, అప్పుడది పబ్లిక్ దృష్టిలో పడింది. ఆ ఛానెల్ పేరు టీవీ9 అయితే.. ఆ కేసు ఓ సైబర్ క్రైమ్ మోసం.

తెలుగు రాష్ట్రాల్లో పాపులరైన టీవీ9 ఛానెల్, మరోసారి తన అంతర్గత విషయాలతో వార్తల్లో నిలిచింది. గతంలో రవిప్రకాష్ ఇష్యూతో ఈ ఛానెల్ ఎంతలా వివాదాస్పదమైందో.. ఇప్పుడు డేటా చౌర్యం కేసుతో అంతకంటే ఎక్కువ వివాదాస్పదమౌతోంది.

అవును.. టీవీ9లో పనిచేసే ఓ మహిళా యాంకర్, మరో ఇద్దరు మహిళా యాంకర్లపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు చాలా బలంగా ఫైల్ అయింది. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఇద్దరు మహిళా యాంకర్లను యాజమాన్యం తప్పనిసరి పరిస్థితుల్లో తప్పించాల్సి వచ్చింది.

ఇంతకీ ఛానెల్ లో ఏం జరిగింది..?

ఛానెల్ లో అంతర్గతంగా కొంతమంది మహిళా యాంకర్ల మధ్య మనస్పర్థలున్నాయి. ఈ క్రమంలో ఓ యాంకర్ తన ఉద్యోగాన్ని కూడా కోల్పోయింది. అలా ఉద్యోగం కోల్పోయిన యాంకర్, మరో ఇద్దరు యాంకర్లపై కేసు పెట్టింది. 

అత్యంత సున్నితమైన సమాచారంతో పాటు ప్రైవేట్ వీడియోలు కలిగి ఉన్న తన మొబైల్ ఫోన్ ను సదరు యాంకర్లిద్దరూ లాక్కున్నారని, అందులోని డేటాను దొంగిలించారనేది ఈ కేసు సారాంశం.

అయితే ఈ కేసు ఇక్కడితో ఆగిపోలేదు. సదరు బాధిత యాంకర్ ఈ విషయాన్ని మరో ''సీనియర్'' యాంకర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా దీనిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారట. మిగతా ఇద్దరు యాంకర్లను సమర్థిస్తూ మాట్లాడారట. 

ఇదే విషయంపై హెచ్ఆర్ ను సంప్రదిస్తే, వాళ్లు కూడా బాధిత యాంకర్ కు అండగా నిలబడలేదంట. దీంతో ఎఫ్ఐఆర్ లో సదరు ''సీనియర్'' యాంకర్ తో పాటు హెచ్ఆర్ అధికారి పేరును కూడా ప్రస్తావించారు.

ప్రస్తుతం పరిస్థితి ఏంటి?

మొత్తమ్మీద ఈ డేటా చౌర్యం వ్యవహారం ఇప్పుడు టోటల్ ఛానెల్ కు చుట్టుకుంది. తక్కువ వ్యవథిలో ముగ్గురు యాంకర్లు ఛానెల్ కు దూరమయ్యారు. ఆ ప్రభావం కచ్చితంగా ఛానెల్ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఇతర యాంకర్లపై పెనుభారం పడింది.

ఓవైపు ఇలా వివాదాలు కొనసాగుతుంటే, మరోవైపు అదే ఛానెల్ కు చెందిన కొంతమంది ఛాందస సిబ్బంది ఇంకోలా స్పందిస్తున్నారు. యాజమాన్యం మారిన తర్వాత టీవీ9 ఆఫీస్ లో నిర్మాణపరంగా చిన్నచిన్న మార్పులు చేశారు. ఆ మార్పుల వల్ల వాస్తు సమస్యలు తలెత్తి, ఛానెల్ ఇబ్బందుల్లో పడుతోందని వాళ్లు అంటున్నారు. 

రవిప్రకాష్ వివాదం నుంచి ఇప్పటి డేటా చౌర్యం కేసు వరకు అన్నీ వాస్తు సమస్య వల్ల వచ్చినవే అని వాదిస్తున్నారు. ఇలా ఎవరికితోచిన లాజిక్కులు వాళ్లు చెబుతున్నారు. ఫైనల్ గా ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

Show comments