జనసేన.. డిజాస్టర్ దిశగా..?!

అదిగో ఇదిగో అంటే ఎన్నికల షెడ్యూల్, ఆ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే జనసేనలోకి మాత్రం ఇప్పటి వరకూ కాస్త ఛరిష్మా ఉన్న నేతలు ఎవరూ ప్రవేశించకపోవడాన్ని ఇప్పుడు ప్రస్తావించుకోవచ్చు. కనీసం ఆయారాం.. గయారాం.. నేతలు అయినా జనసేనలోకి వెళ్తారని అంతా అనుకున్నారు. అదేంటో మరీ చోద్యంగా.. నేతలు ఎవరూ జనసేన వైపు చూడకపోవడాన్ని గమనించవచ్చు.

చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కాపు సామాజికవర్గం నుంచి కొందరు, కులాలకు అతీతంగా అనేకమంది వెళ్లారు. ప్రజారాజ్యం పార్టీ తరఫు నుంచి చాలా నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, అప్పటి తాజామాజీలు పోటీ చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి అప్పట్లో ఒక రేంజ్లో వలసలు సాగాయి. ఎన్టీఆర్ స్థాయిలో చిరంజీవి మ్యాజిక్ చేసే అవకాశాలు లేవని తెలిసినా.. చాలామంది ఆ పార్టీలోకి వెళ్లారు!

మరి ప్రజారాజ్యంతో పోల్చిచూసుకున్నా.. జనసేనలో మాత్రం కనీసం ఆ ఊపు కనిపించడం లేదు. ఇప్పటి వరకూ జనసేనలో చేరిన తాజా మాజీలు ఇద్దరు. వీరిలో ఒకరు బీజేపీ నుంచి వచ్చారు. బీజేపీకి భవితవ్యం లేదని.. తెలుగుదేశంలోకి మార్గంలేక.. ఆయన జనసేనలోకి వచ్చారు. ఇక మరో వ్యక్తి రేపటి ఎన్నికల్లో ప్రస్తుత స్థానంలో ఏ నియోజకవర్గం నుంచి పోటీచేసినా గెలిచే అవకాశాలు లేవు. ఆయన వైకాపాలోకి వెళ్లే ప్రయత్నం చేశారనేది బహిరంగ రహస్యం. అయితే అక్కడ ఛాన్స్ లభించకపోవడంతోనే జనసేన వైపు వెళ్లారు!

వారి తర్వాత కనీసం చెప్పుకోవడానికి అయినా మళ్లీ ఒకరిద్దరు తాజా మాజీ ఎమ్మెల్యేలు జనసేనలోకి చేరడంలేదు! అవతల జనసేన టికెట్లకు దరఖాస్తులు తీసుకుంటున్నారట. అయినా కూడా ఎమ్మెల్యేలు, నేతలు జనసేన వైపు వెళ్లకపోవడం విశేషం.

అన్ని కమిటీల్లోనూ.. అన్ని బాధ్యతల్లోనూ.. అవే నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అంతకు మించి కొత్తగా చేరికల ముచ్చట్లు ఏమీ కనిపించడం లేదు. మరి చేరికలతో అవసరం లేదు.. పవన్ కల్యాణ్ పార్టీని కొత్త వాళ్లతో నిలబెట్టేసుకుంటాడు అనేంత అవకాశమూ లేదు. ఒకవేళ అలా చేయాలని అనుకుంటే.. బీభత్సమైన గ్రౌండ్ వర్క్ చేయాల్సింది.

పవన్ సొంత పార్టీ గురించి కసరత్తు మొదలుపెట్టిందే నాలుగైదు నెలల కిందట. ఇంతలోనే కొత్త వాళ్లతో రాజకీయ పార్టీని నిర్మించుకోవడం అసలు సాధ్యం అయ్యే పనికాదు. అవన్నీ సినిమాల్లో పనులే. మరో పక్షం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో ఇదీ జనసేన పరిస్థితి. ఇక ఏం జరుగుతుందో చూడాలి!

ప్రజలు చంద్రబాబు కన్నా తెలివైన వారు!

అంతా అనైతికం, చెప్పేవి మాత్రం నీతులు