జ‌గ‌న్ గ్రాఫ్‌... ఇప్పుడే పెరిగిందా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు, నాలుగు నెలల క్రితం రాజ‌కీయ వాతావ‌ర‌ణానికి, ఇప్ప‌టికీ చాలా తేడా క‌నిపిస్తోంది. ఇప్పుడు ఏపీలో చ‌ర్చ‌ల్లా ఒక‌టే... జ‌గ‌న్ గ్రాఫ్ బాగా పెరిగింద‌ని, ఆయ‌నే మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయని. సాధార‌ణంగా ఎన్నిక‌ల ముంగిట‌... ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తుంటుంది. అధికార పార్టీ గ్రాఫ్ ప‌డిపోవ‌డం చూస్తుంటాం.

ఇదేం విచిత్ర‌మో కానీ, ఏపీలో మాత్రం అందుకు భిన్న‌మైన రాజ‌కీయ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. రోజురోజుకూ వైసీపీ గ్రాఫ్ అమాంతం పెరుగుతోంది. టీడీపీకి కంచుకోట లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా వైసీపీ గెలుస్తుంద‌నే మాట వినిపిస్తోంది. కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీకి ఈ ర‌క‌మైన ప్ర‌చారం ఎంతో లాభం.

మ‌రోవైపు ఎన్నిక‌ల త‌రుణంలో మ‌రీ ముఖ్యంగా టీడీపీ గ్రాఫ్ ప‌డిపోతోంద‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. ఈ ప్ర‌చారాన్ని ప్ర‌త్య‌ర్థులు చేస్తున్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు. టీడీపీ నాయ‌కులే బ‌హిరంగంగా ఆవేద‌న‌తో చెబుతున్నారు. జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకున్న‌ప్ప‌టికీ, ఓట్ల బ‌దిలీ ఆశించిన స్థాయిలో జ‌ర‌గ‌ద‌నే అనుమానం, భ‌యం కూట‌మి నేత‌ల్లో క‌నిపిస్తోంది. దీనికి తోడు బీజేపీతో పొత్తు ఆత్మ‌హ‌త్యా స‌దృశ్యంగా చెబుతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని... చేజేతులా ముస్లిం ఓట్ల‌న్నీ గంప‌గుత్త‌గా వైసీపీకి ప‌డేలా చేసుకుంటున్నామని వారు ఆవేద‌న చెందుతున్నారు.

ఇవ‌న్నీ ఎన్నిక‌ల్లో ఒక కోణం. రెండో కోణం చూద్దాం. వైసీపీ గ్రాఫ్ పెరిగింద‌ని ఇప్పుడే ఎందుకు అనిపిస్తోంది? ఇందులో నిజం ఎంత‌? అనే ప్ర‌శ్న‌ల‌కు రాజ‌కీయ విశ్లేష‌కులు, మేధావుల నుంచి ఆస‌క్తిక‌ర స‌మాధానాలు వ‌స్తున్నాయి. మూడు, నాలుగు నెల‌ల క్రితం వ‌ర‌కూ జ‌గ‌న్ వ్య‌తిరేక బ్యాచ్ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చింది. జ‌గ‌న్ వ్య‌తిరేక మీడియా వారికి ద‌న్నుగా నిల‌బ‌డ‌డంతో ఏపీలో ఎక్క‌డ చూసినా జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌తే క‌నిపించింది. నాటి ప‌రిస్థితుల్లో క‌నీసం త‌మ‌కు 40 నుంచి 50 అసెంబ్లీ సీట్లైనా వ‌స్తాయా? అని వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు కూడా భ‌య‌ప‌డ్డారు.

అయితే జ‌గ‌న్ సిద్ధం పేరుతో ప్ర‌చార యాత్ర మొద‌లు కావ‌డం ఆ పార్టీకి ట‌ర్నింగ్ పాయింట్‌గా చెప్పొచ్చు. జ‌గ‌న్ అనుకూల ఓటు బ్యాంక్ ఒక్క‌సారిగా బ‌య‌టికొచ్చింది. చీమ‌ల పుట్ట ప‌గిలి చీమ‌ల‌న్నీ ఒక్క‌సారిగా నేల‌పైకి వ‌చ్చిన చందంగా... జ‌గ‌న్ అనుకూల ఓట‌ర్లంతా రోడ్డెక్కారు. అప్పుడు తెలిసింది... జ‌గ‌న్‌కు రాష్ట్రంలో ఎంత అనుకూల‌త వుందో. జ‌గ‌న్ సానుకూల గ‌ళాల ముందు, వ్య‌తిరేక గ‌ళాలు నిల‌బ‌డ‌లేక‌పోయాయి.

"ఎన్నిక‌ల స‌మ‌రానికి నేను సిద్ధం, మ‌రి మీరు" అని జ‌గ‌న్ ప్ర‌శ్నిస్తే .. "మేము సైతం సిద్ధం" అంటూ జ‌గ‌న్ అనుకూల ఓటర్లు దిక్కులు పిక్క‌టిల్లేలా నిన‌దించ‌డం విన్నాం, చూశాం. దీంతో జ‌గన్‌పై వ్య‌తిరేక‌త అనే ప్ర‌చారం ప‌టాపంచ‌లైంది. ఏపీలో జ‌గ‌న్ నామ‌స్మ‌ర‌ణ అంత‌కంత‌కూ పెరుగుతూ... మ‌ళ్లీ అధికారంలోకి రాబోతున్నాడ‌నే వాతావ‌ర‌ణాన్ని సృష్టించాయి. జ‌గ‌న్ వ్య‌తిరేకులు ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన రోజు నుంచి ... విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. కానీ జ‌గ‌న్ అనుకూలురు... కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో, అవ‌స‌ర‌మైన సంద‌ర్భంలోనే బ‌య‌టికి వ‌చ్చారు.

ఇదే తేడా. అందుకే జ‌గ‌న్ గ్రాఫ్ ఇప్పుడే పెరిగిన‌ట్టు క‌నిపిస్తోంది. కానీ జ‌గ‌న్‌కు మొద‌టి నుంచి అనుకూల వాతావ‌ర‌ణ‌మే వుంది. జ‌గ‌న్ ప‌ని అయిపోయింద‌ని ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌లు, వాటికి వంత పాడే ఎల్లో మీడియా వుండ‌డంతో నిజ‌మే అని వైసీపీ నేత‌లు సైతం భ‌య‌ప‌డ్డ మాట వాస్త‌వం. ఇలాంటి వాటికి జ‌గ‌న్‌కు వెల్లువెత్తుతున్న ప్ర‌జాద‌ర‌ణ చెక్ పెట్ట‌డంతో పాటు ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో గుబులు రేపుతోంది.

Show comments