టాక్సీవాలా ఫ్లాప్ అయితే దేవరకొండ పరిస్థితేంటి?

పైకి ఎన్నిమాటలు చెప్పినా సమస్య వచ్చేసరికి ఎవరైనా షార్ట్ కట్స్ వెదకాల్సిందే. విజయ్ దేవరకొండ కూడా ఇదే కోవలోకి వస్తాడో రాడో చూడాలి. తనకు నచ్చితేనే చేస్తా, కథ కదిలిస్తే ఓకే అనేస్తా లాంటి డైలాగ్స్ దేవరకొండ నుంచి ఇప్పటివరకు చాలానే చూశాం. అతడి అదృష్టం కొద్దీ అర్జున్ రెడ్డి, గీతగోవిందం లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. హిట్స్ తగిలాయి.

కానీ తన మనసుకు నచ్చినట్టు దేవరకొండ చేసిన నోటా సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఇదే వరుసలో టాక్సీవాలా కూడా వస్తోంది. ఇది కూడా తన మనసుకు నచ్చి చేశానంటున్నాడు. ఫార్ములాల జోలికి అస్సలు పోలేదంటున్నాడు. మరి ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే విజయ్ దేవరకొండ పరిస్థితేంటి? అప్పుడు ఫార్ములా మూసలో పడిపోతాడా..? తన యాటిట్యూడ్ కు తగ్గ కథలతోనే బండి లాగిస్తాడా..?

సరిగ్గా ఇదే ప్రశ్న విజయ్ దేవరకొండకు ఎదురైంది. దీనికి ఈ హీరో ఇచ్చిన సమాధానం కాస్త డిప్లమాటిక్ గా ఉంది. మనసుకు నచ్చితే అది ఫార్ములా సినిమా కాకుండా పోతుందా అనేది విజయ దేవరకొండ ఎదురు ప్రశ్న. ఓ సినిమా నచ్చిందంటే అందులో ఎమోషన్ లేదా క్యారెక్టర్ ఏదో ఒకటి నచ్చుతుందని, అలా నచ్చిన పాయింట్ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అవుతుందని వాదిస్తున్నాడు దేవరకొండ.

అంతా ఓకే కానీ, అర్జున్ రెడ్డి లాంటిదే మరో బోల్డ్ కథ వస్తే చేస్తారా అనే ప్రశ్నకు మాత్రం దేవరకొండ సమాధానం ఇవ్వలేదు. ఒకటి మాత్రం నిజం, టాక్సీవాలా ఫ్లాప్ అయితే మాత్రం విజయ్ దేవరకొండ తన కెరీర్ ను ఓసారి పునఃసమీక్షించుకోవడం బెటర్. అవసరమైతే గ్యాప్ తీసుకోవాలి. ఈ హీరోకు ప్రస్తుతానికి ఆ అవసరం రాకూడదని ఆశిద్దాం. 

కమ్మ, రెడ్డి కలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments