విజయ్ ఓకే అంటేనే ఆ సినిమా రిలీజ్

టాక్సీవాలా.. యూవీ క్రియేషన్స్, గీతాఆర్ట్స్-2 కలిసి నిర్మించిన సినిమా. షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. లీకులు కూడా అయిపోయాయి. కాకపోతే సినిమా ఔట్ పుట్ అస్సలు బాగోలేదు. అందుకే గ్రాఫిక్ వర్క్ జరుగుతోందనే సాకుతో సినిమాను పక్కనపెట్టారు. ఇప్పుడీ మూవీని ఎప్పుడు విడుదల చేయాలనే విషయం నిర్మాతల చేతుల్లో లేదు. 

అవును.. టాక్సీవాలాను ఎప్పుడు రిలీజ్ చేయాలనేది ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇష్టం. ఎందుకంటే ఈ సినిమా రైట్స్ ను విజయ్ దేవరకొండ తీసుకున్నాడు. ఇదేదో హిట్ అవుతుందని విజయ్ ఈ సినిమా రైట్స్ తీసుకోలేదు. ఇప్పటికే నోటాతో ఫ్లాప్ తెచ్చుకున్న ఈ హీరో, టాక్సీవాలా కూడా బయటకొస్తే మరో ఫ్లాప్ వస్తుందేమో అని భయపడి రైట్స్ తీసుకున్నాడు. 

నిజానికి టాక్సీవాలాకు సంబంధించి ఓవర్సీస్ రైట్స్ తీసుకున్నాడు విజయ్. ఆ సినిమాను ఓవర్సీస్ లో సొంతంగా రిలీజ్ చేయాలనుకున్నాడు. కానీ ఈలోగా ఎన్నో జరిగిపోయాయి. కచ్చితంగా హిట్ అవుతుందనుకున్న నోటా ఫెయిల్ అయింది. మరోవైపు టాక్సీవాలా అస్సలు బాగా రాలేదని స్వయంగా నిర్మాత బన్నీ వాసు ఆఫ్ ది రికార్డు చెబుతున్నాడు. దీంతో  ఇమేజ్ కు మరింత డ్యామేజ్ కలగకూడదనే ఉద్దేశంతో టాక్సీవాలా పూర్తి హక్కులు తనే తీసేసుకున్నాడు విజయ్.

భవిష్యత్తులో మళ్లీ తను సేఫ్ పొజిషన్ కు వచ్చినప్పుడు మాత్రమే ఈ సినిమాను విడుదల చేస్తాడు విజయ్. అప్పటివరకు టాక్సీవాలాకు మోక్షం లేనట్టే. ప్రియాంక జలాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు.

Show comments