పొలిటికల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌.!

సీ..బీ..ఐ..

ఈ పేరు చెబితే చాలు, చాలామందికి ప్రత్యేకమైన గౌరవం. ఆ ఉద్యోగమంటే అమితమైన మక్కువ. సీబీఐ అధికారికి సమాజంలో దక్కే పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇన్నీ కావు. అయితే అదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సీబీఐ మీద, రాజకీయ పెత్తనం ఎక్కువైపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేయడం చూశాం. ఏకంగా, సీబీఐని పంజరంలోని రామచిలుకగా అభివర్ణించింది సుప్రీంకోర్టు.

సీబీఐ మీద ప్రభుత్వ పెత్తనం లేకుండా చెయ్యమంటారా.? అంటూ సుప్రీంకోర్టు, అప్పట్లో మన్మోహన్‌ సర్కార్‌కి అక్షింతలు కూడా వేసింది. కాంగ్రెస్‌ హయాంలో సీబీఐ స్థాయి అంతలా దిగజారిపోయింది. 'కాంగ్రెస్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌' అనే విమర్శల్ని సీబీఐ ఎదుర్కొంది. అంతెందుకు, పలువురు సీబీఐ ఉన్నతాధి కారులు ఇప్పుడు, పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటు న్నారు. నిజంగానే, సీబీఐ ఆ స్థాయిలో తన గౌరవాన్ని దిగజార్చుకుందా.? అంటే, సీబీఐ స్థాయిని రాజకీయాలే దిగజార్చేశాయని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే.

గతం గతః అనుకుందాం. మరి, ఇప్పుడేం జరుగుతోంది.? సీబీఐ టేకప్‌ చేస్తున్న కేసులన్నీ, 'పద్ధతిగానే' విచారణ జరుగుతున్నాయనుకోవచ్చా.? కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది. దేశంలో కుప్పలు తెప్పలుగా సీబీఐ కేసులు నమోదవుతున్నాయి. కానీ, అన్నీ 'కంచికి' చేరడంలేదు. సీబీఐ పని, పరిశోధించడం మాత్రమే. ఆ తర్వాత వ్యవహారం కోర్టులకు చేరుతుంది. అక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఎన్ని కేసుల్లో చూసినా ఒకటే తంతు. అదే ఆలస్యం. దేశంలో కోర్టులకు కొదవలేదు.

కానీ, ఆ కోర్టులకే సమయం సరిపోవడంలేదు. కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన కేసుల బూజు దులపడానికి సరిపడా న్యాయవ్యవస్థలో 'సిబ్బంది' లేరన్న ఆవేదన న్యాయ నిపుణులు ఎప్పటినుంచో వ్యక్తం చేస్తున్నదే. ఓ సందర్భంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులే, న్యాయవ్యవస్థ విషయంలో పాలకులు చూపుతున్న అశ్రద్ధపై కంటతడి పెట్టారు కూడా. అయినాసరే, న్యాయవ్యవస్థను పట్టించుకోం. ఇట్‌ హ్యాపెన్స్‌ ఓన్లీ ఇన్‌ ఇండియా.. అని సరిపెట్టుకోవాలేమో.!

వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసునే తీసుకుందాం. ఎప్పుడో ఐదేళ్ల క్రితం నాటి కేసు అది. ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. కేవలం ఆరోపణలతోనే, సుదీర్ఘకాలం వైఎస్‌ జగన్‌ జైల్లో వుండాల్సి వచ్చింది. ఏడాదికి పైగా జగన్‌, నిందితుడిగానే జైల్లో ఎందుకు వుండాల్సి వచ్చిందో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని ప్రశ్న. పోనీ, ఇప్పుడన్నా ఆయన మీద నేరారోపణల్ని రుజువు చేయగలిగారా.? అంటే అదీ లేదాయె. ఇప్పటికీ ఆయన నిందితుడే. నిర్దోషి లేదా దోషి.. అని తేలేదెప్పుడు.? ఇలాంటి సందర్భాల్లోనే సీబీఐ వ్యవస్థ సైతం నీరుగారిపోతుంటుంది.

అక్రమాస్తుల కేసులోంచి బయటపడేందుకు వైఎస్‌ జగన్‌, కేంద్రం వద్ద మోకరిల్లారన్న విమర్శల్ని అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీనే చేస్తోంది. అదే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఓటుకు నోటు కేసులో కేంద్రానికి లొగిపోయారన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. న్యాయస్థానాలపై పాలకుల పెత్తనం పనిచేస్తుందా.? అన్న విమర్శలకు.. ఈ కేసులే సమాధానం చెబుతాయి.

కర్నాటక మైనింగ్‌ కింగ్‌ గాలి జనార్ధన్‌రెడ్డి, వందల కోట్ల, వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారనే అభియోగాల్ని ఎదుర్కొన్నారు. దోపిడీ వాస్తవం.. అని తేలింది. జైలు శిక్ష అనుభవించారు.. పదవులు కోల్పోయారు. ఎట్టకేలకు బెయిల్‌ వచ్చింది. మనిషి మారాడా.? లేదే, దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహాన్ని తన ఇంట్లోనే జరిపించారా యన. అదీ పెద్ద పాత నోట్ల రద్దు సమయంలో. దేశం షాక్‌కి గురయ్యింది. కానీ, అతని మీద చర్యల్లేవ్‌. ఎందుకట.? అదంతే, అడగకూడదంతే. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలు, బీహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై నేర నిరూపణ, 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణం, కోల్‌ గేట్‌ స్కామ్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే, దేశంలో రాజకీయ నాయకులపై సీబీఐ కేసులు లెక్కకు మిక్కిలిగా తెరపైకొస్తాయి.

ఇంకా ఇంకా కొత్త కొత్తగా కేసులు నమోదవుతూనే వున్నాయి. ఓ సినీ నటుడి అనుమానాస్పద మరణంపైనా సీబీఐ విచారణ షురూ అయ్యింది. కానీ, 'చివరికి ఏం జరుగుతుంది.?' అంటే మాత్రం, ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. ఒక్కటి మాత్రం నిజం. సీబీఐని రాజకీయమే శాసిస్తోంది. ఈ విషయాన్ని సాక్షాత్తూ సుప్రీంకోర్టు ధృవీకరించింది. తనవంతుగా సీబీఐ పారదర్శకంగా విచారణ చేపట్టినాసరే, ఆ తర్వాత రాజకీయం ఆయా కేసుల్ని నీరుగార్చేస్తోంది. వెరసి, సీబీఐని పొలిటికల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌గా మార్చేశారు. ఇంకెందుకు సీబీఐ కేసులు.? కేవలం, రాజకీయంగా కక్ష సాధింపుల కోసమేనా.? ఏమో, ఔనేమో.. నిజమేనేమో.. అని నమ్మాల్సి వస్తోందిప్పుడు.

Show comments