కరోనాను ఉఫ్ ఊదేసిన వృద్ధ జంట

కరోనా అంటే మహమ్మారిగా భావించి జనాలు జడుసుకుంటున్నారు. దాని జోరు కూడా అలాగే ఉంది. అయితే కరోనా విషయంలో ముందు భయమే మనిషిని నిలువునా చంపేస్తోంది అన్నది నిజం.

ఇదిలా ఉంటే కరోనా మా ఒంట్లో ఉన్న జబ్బుల ముందు ఎంత అంటూ చాలా తేలిగ్గా ఆ వృద్ధ దంపతులు తీసుకున్నారు. కరోనా వచ్చిందని తెలిసినా ఏ మాత్రం భయపడకుండా ఇంట్లోనే ఉంటూ ఉంటూ వైద్యులు ఇచ్చిన సూచనలు పాటించారు. ఇపుడు చక్కగా కోలుకున్నారు.

శ్రీకాకుళంలోని యస్.వి.అర్.ఎం. పట్నాయక్, కమల దంపతుల వయసు డెబ్బై దాటే ఉంటుంది. వీరిలో ఒకరు క్యాన్సర్ వ్యాధితో మరొకరు గుండె జబ్బుతో బాధపడుతున్నారు. 

ఏ రకంగా చూసినా కరోనాతో వీరు పోరాడడం కష్టమే అని అంతా అనుకున్నారు. అయితే వారు దాన్ని ఒక మామూలు జ్వరంగానే భావించారు. తమకు కరోనా ఉందన్న ఊసే మరచారు. డాక్టర్లు చెప్పిన ప్రకారం మందులు వాడారు.

అంతే వారి గుండె ధైర్యాన్ని చూసి కరోనావే పరార్ అయింది. ఇపుడు వీరు అందరికీ చెబుతున్న సలహా ఏంటి అంటే భయపడకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను జయించవచ్చునని. ఇలాంటి వారిని చూసినపుడు వారి కధలు విన్నపుడు కరోనా మన ధైర్యం ముందు ఎంత చిన్నదో అర్ధమవుతోంది కదా.

Show comments