తన భయం.. రాష్ట్రంపై రుద్దితే ఎలా?

''ప్రపంచం బాధ.. శ్రీశ్రీ బాధ
కృష్ణశాస్త్రి బాధ.. ప్రపంచం బాధ!''

అన్నాడు ఒక సినీకవి. ప్రపంచం బాధ మొత్తాన్ని తాను అనుభవిస్తూ శ్రీశ్రీ, తానుపడే బాధను ప్రపంచం మొత్తం అనుభవించాలని కృష్ణశాస్త్రి.. కవిత్వం రాశారని దీని అర్థం. చంద్రబాబు- కృష్ణశాస్త్రి లాంటివాడు. తనలోని భయం, ఆందోళన, ఒత్తిడి లాంటివాటిని తెలుగు ప్రజలందరూ అనుభవించాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయనలోని భయాన్ని రాష్ట్రం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అవసాన దశకు వచ్చేసింది. నలభయ్యేళ్ల సుదీర్ఘ రాజకీయానుభవం అనేది ఒక కోణంలో చాలా ఘనంగా కనిపిస్తుంది.

కానీ మరో కోణంలో అది వార్ధక్యం కిందలెక్క. రెండు కోణాలూ అసత్యాలు కాదు. పరిస్థితుల్ని బట్టి మారుతుంటాయి. ఇప్పుడు ముసలితనం కేవలం చంద్రబాబుకు మాత్రమేకాదు.. తెలుగుదేశం పార్టీకి కూడా వచ్చేసింది. ఎప్పటికప్పుడు కొత్త జవసత్వాలను సమీకరించుకుంటూ... ఎదగడంలో ఆ పార్టీ విఫలం అయింది. మన అసమర్థతను ప్రపంచం గుర్తించకపోయినా సరే.. మనకు స్పష్టంగా తెలిసిపోతుందన్నట్లుగా.. తెలుగుదేశం పార్టీ అవసానదశలో ఉన్న సంగతి అధినేత చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు. ఆయనలోని భయం, ఆందోళన, ఒత్తిడికి అది ప్రధాన కారణం.

నిస్వార్థంగా పార్టీని ప్రేమించే నాయకుల పరిస్థితి వేరుగా ఉంటుంది. అక్కడ ఎప్పటికప్పుడు కొత్త నాయకత్వానికి తలుపులు తెరచుకుంటూ ఉంటాయి. కానీ.. చంద్రబాబు ఫ్యూడల్‌ కుటుంబ రాజకీయాలు నడుపుతున్న వ్యక్తి. తన తర్వాత కొడుకు మాత్రమే పార్టీకి పెద్దదిక్కు కావాలనే ఆయన కోరిక యావత్తు పార్టీకి చేటు చేస్తున్నది. కొడుకు.. అడుగడుగునా తన అసమర్థతను చాటుకుంటూ ఉండడం ఆయనలోని ఆవేదనను పెంచుతోంది.

పగ్గాలు కాస్త అందగానే.. తండ్రి ట్విటర్‌ ఖాతాను కూడా భ్రష్టు పట్టిస్తూ.. ఆయన పరువు తీయడంలో కూడా కొడుకు పాత్ర ఉన్నదనే ప్రచారమూ పార్టీలో ఉంది. అలాంటి కొడుకును.. మహానాయకుడుగా ప్రజలు ఆమోదించాలని కోరుకోవడం చంద్రబాబు పతనానికి నాంది. పార్టీకి ప్రాప్తించిన సకల దురవస్థలు అక్కడినుంచే మొదలయ్యాయి. మామ నుంచి పార్టీని దుర్మార్గంగా హస్తగతం చేసుకున్న తొలిరోజుల నుంచి.. చంద్రబాబు నాయకత్వం పట్ల పార్టీలో పెద్ద ఎత్తున అసంతృప్తులు రగులుతూనే వచ్చాయి. ఎప్పటికప్పుడు వాటిని చంద్రబాబు తొక్కేసుకుంటూ వచ్చారు.

పార్టీలో ఆయన నాయకత్వం బలంగా ఉన్నప్పుడు.. అసమ్మతి నాయకులు కూడా గతిలేక లొంగిపోతూ వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. నాయకత్వానికి ముసలితనం వచ్చేసింది. పార్టీలో ఆయనను ఖాతరు చేయని వారి సంఖ్య పెరిగిపోయింది. ఇతర పార్టీలతో బహిరంగంగానే బేరాలాడుతున్నారు. బయటకు వెళ్లే ఉద్దేశం ఉన్నట్లు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. వెళ్లిపోతూ ఉన్నారు. ఆయన పెట్టే సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. ఇన్ని జరుగుతున్నా.. ఆయన కన్నెర్రజేసే స్థితిలో ఉన్నారు. అంతగా ముసలితనం, దౌర్బల్యం ముసురుకుని ఉన్నాయి.

కొడుకు నెత్తిన మాత్రమే వారసత్వపు కిరీటం పెట్టాలనే దురాశ వీటన్నింటినీ మించి ఇరుకున పెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఎంతకాలం బతుకుతుంది? అనేది ఆయనలో ఉన్న పెద్దభయం. పార్టీని అందరి సొత్తులాకాకుండా.. తన సొంత ఆస్తిలాగా ఆయన భావించడం వల్లనే ఈ ఇబ్బంది వచ్చి పడుతోంది. ఆ భయం ఆయన వ్యక్తిగతమైనదిగా మారింది. పార్టీలో ఎవ్వరూ- పార్టీని 'ఓన్‌' చేసుకోవడం లేదు. 'తమ' భవిష్యత్తు కోసం తమదార్లు తాము చూసుకుంటున్నారు. అయితే తన వ్యక్తిగత భయాన్ని రాష్ట్రం మొత్తంమీద పులమాలని చంద్రబాబు దురాలోచన చేస్తున్నారు.

అసలు భయం, ఆందోళన బయటపడితే జనంముందు నవ్వులపాలవుతాం గనుక.. ప్రభుత్వం పట్ల ప్రజలందరిలో భయం పెంచడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. పునరావాస శిబిరాలు, చలో ఆత్మకూరు నాటకాలు ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని బూచిగా చూపించే ప్రయత్నంలో భాగమే. ప్రభుత్వం ప్రజాకంటకమైనది అని ప్రజల్ని నమ్మించాలని ఆయన తొందరపడుతున్నారు. పచ్చ ముసుగులో ఉండే కార్యకర్తలు, పెయిడ్‌ ఆర్టిస్టుల్లో తప్ప.. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అనేది కనీసం ఒక్కశాతం ప్రజల్లో స్వఛందంగా అనేది ఏర్పడినా కూడా ఆయన కోరిక సఫలమైనట్లే. కానీ.. ప్రజలు ఇప్పటిదాకా అలాంటి అభిప్రాయానికి రాలేదు.

సామాన్యుడికి ప్రమేయం ఉండని కాంట్రాక్టులు, రాజధాని లాంటి వివాదాస్పద వ్యవహారాలు తప్ప.. 13 జిల్లాల ప్రజలను సార్వజనీనంగా ప్రభావితం చేసే ఒక్క నెగటివ్‌ నిర్ణయం కూడా ఇప్పటిదాకా జగన్‌ సర్కారు నుంచి రాలేదు. తదనగుణంగానే.. వ్యతిరేకత కూడా ప్రబలలేదు. ఇది చంద్రబాబుకు కంటగింపుగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత అనే విషబీజాలను ప్రజల్లో విత్తడానికి ఆయన శతధా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి కూహకాలు, కుట్రలకు ఈతరం రాజకీయాల్లో కాలం చెల్లింది.

ప్రజలు అంత సులువుగా నాయకుల ఉచ్చులో పడడంలేదు. చంద్రబాబు ఇలాంటి వక్రతను మానుకుని, రుజుమార్గంలో ప్రభుత్వం మీద పోరాడుతూ, ప్రజల తరఫున నిలిస్తే.. ఆయనకు, పార్టీకి మేలు జరుగుతుంది.

మారని తీరు.. అదే కుట్రల, కుతంత్రాల రాజకీయం!

Show comments