రాజధానిలో కొత్తపుండు పెట్టిన టీజీ

అసలే ఏపీ రాజధాని వ్యవహారం హాట్ హాట్‌గా  ఉంది. ఎవరికి తోచిన పుకార్లు వాళ్లు పుట్టిస్తూ... తమకు అనుకూలమైన రియల్ దందాలు చేసుకోవాలని ఉత్సాహపడిపోతున్నారు. జగన్ మీద బురద చల్లడానికి కొందరు అదే పనిగా రాజధాని పుకార్లను వ్యాపింపజేస్తూ ఎడాపెడా... సోషల్ మీడియాలో విషం కక్కుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సీనియర్ నాయకుడు, ప్రస్తుతానికి భాజపా ఎంపీ టీజీ వెంకటేష్ రాజధానిపై కొత్త పుండు పెట్టారు. ఏపీకి నాలుగు రాజధానులు ఉండేలా జగన్ ప్లాన్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

కేవలం ఇది టీజీ వెంకటేష్ ప్రకటన మాత్రమే అయితే.. అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడూ మీడియా ఫోకస్‌ను తన మీదకు మళ్లించుకోవడానికి టీజీ వెంకటేష్ అవాకులూ చెవాకులూ పేలుతుండడం కొత్త కాదు. అయితే ఆయన తన వ్యర్థ ప్రేలాపనలకు ఒక సాధికారతను పులమడానికి.. ఈ మాటలు తనకు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలిసినట్లుగా ప్రకటించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... నాలుగురాజధానులు ప్లాన్ చేస్తున్నారనేది ఆయన మాట. విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప ఊర్లను రాజధాని నగరాలుగా అభివృద్ధి చేసే ఆలోచనతో ఉన్నట్లుగా ఆయన చెప్పారు. అంటే ఉత్తరాంధ్ర, గోదారి, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు సమ ప్రాధాన్యం కల్పించడానికి నాలుగు చోట్ల నుంచి నాలుగు ఊర్లను ఎంపిక చేయడం అన్నమాట. ప్రాంతాలవారీగా సమతూకం విషయానికి వస్తే ఇలాంటి మాటలు రుచికరంగానే కనిపించవచ్చు. కానీ ఆచరణలో ఇది సాధ్యమేనా?

వెంకటేష్ చెబుతున్నదాన్ని బట్టి... జగన్ ఈ విషయాలను ఇప్పటికే కేంద్రంతో, భాజపా వారితో చర్చించారు. భాజపా అధిష్ఠానమే ఆ విషయాన్ని టీజీకి చెప్పిందిట..! ఒకవైపు విజయసాయిరెడ్డి మేం ప్రతి నిర్ణయానికీ అమిత్ షా, మోదీల ఆశీస్సులు తీసుకుంటూనే ఉన్నాం.... అని ప్రకటించిన నేపథ్యంలో.. టీజీ పుట్టించిన ఇలాంటిమాట.. కాస్త ఒకదానికొకటి సింక్ అవుతున్నట్లే కనిపించవచ్చు. సహజంగానే టీజీ ప్రకటనపై రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏదైనా ఒక పెద్ద రాష్ట్రానికి రెండు రాజధానులు ఉండడం కొత్త కాదు. కానీ.. 13 జిల్లాలు ఉన్న రాష్ట్రానికి నాలుగు రాజధానులు అంటే కామెడీగా ఉంటుంది. కోర్ కేపిటల్ అనగా.. సచివాలయం, అసెంబ్లీ.. సీఎం, గవర్నరు, ఎమ్మెల్యేల నివాసాలు, తత్సంబంధిత నివాసగృహాలు మాత్రం ఒకచోట ఉంచి.. తతిమ్మా రకాల అభివృద్ధిని ఇతర ప్రాంతాలకు వికేంద్రీకరించే ఆలోచన ఉంటే ఉండవచ్చు. నిజానికి అది మంచి పద్ధతి కూడా. మరి టీజీ మాటల్లో ఉత్తుత్తి పొగ ఎంతో... నిప్పున్నది ఎంత భాగమో నిదానంగా తెలుస్తుంది.

ఏపీ రాజధానిని వైఎస్ జగన్ మారుస్తారా?

Show comments